Take a fresh look at your lifestyle.

తమిళనాట మజ్లిస్‌ ‌ప్రవేశం సాధ్యమేనా..?

తమిళనాడు శాసనసభకు త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు హైదరాబాద్‌ ‌కేంద్రంగా పని చేస్తున్న ఎంఐఎం ఆసక్తిని ప్రదర్శిస్తోంది. దీంతో ఆ పార్టీతో పొత్తు కోసం ఇప్పటికే సినీనటుడు కమల్‌ ‌హసన్‌ ‌తన సుముఖతను వ్యక్తం చేశారు. డిఎంకె కూడా ఒవైసీని తమ కూటమిలోకి ఆహ్వానించి, ఇప్పటికే తమ కూటమిలో ఉన్న ఎంఎంకె నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఒవైసీ బీహార్‌లో, మహారాష్ట్రలో మహరాష్ట్ర మునిసిపల్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల్లో సాధించిన విజయాలతో ఇతర రాష్ట్రాల్లో విస్తరణకు ఉత్సాహంగా అడుగులు వేస్లున్నారు. తమిళనాడులో ముస్లిం పార్టీలు ఇప్పటికే రెండు ఉన్నాయి. మానతానీయ మక్కల్‌ ‌కట్టి(ఎంఎంకె), ఆలిండియా ముస్లిం లీగ్‌. ఈ ‌రెండూ ఉభయ డిఎంకె కూటముల్లో చెరో దాంట్లో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఎంఐఎంను కూడా డిఎంకె చేర్చుకోవాలని డిఎంకె ఎన్నికల వ్యూహ కర్చ ప్రశాంత కిషోర్‌ ‌సూచించినట్టు తెలిసింది. ఎంఐఎంకు బీహార్‌లో ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాఘట్‌ ‌బంధన్‌లో స్థానం కల్పించకపోవడంతో విడిగా పోటీ చేసింది. ఆ పార్టీ విడిగా బరిలో ఉండటం వల్ల సెక్యులర్‌ ‌వోట్లు చీలిపోయాయి. బీజేపీ లాభ పడింది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంఐఎంను కలుపుకుని పోవాలని డిఎంకెకి ప్రశాంత కిషోర్‌ ‌సూచించి ఉండవొచ్చు. అయితే, మరో వాదన కూడా ముందుకు వొచ్చింది. బీజేపీయే ఎంఐఎంను ముందుకు తోస్తోందన్న వాదన ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వినిపిస్తోంది. ఎంఐఎంకు ఇతర రాష్ట్రాల్లో బలం లేకపోయినా, ఇతర ప్రాంతాల్లో విస్తరణ పేరిట పోటీ చేయడం వల్ల సెక్యులర్‌ ‌వోట్లు చీలి బీజేపీకి లాభం జరుగుతోందనీ, బీజేపీ ప్రోద్బలంతోనే ఆ పార్టీ బరిలోకి దిగుతోందేమోనన్న అనుమానం కూడా పలు సందర్భాల్లో వ్యక్తం అయింది. అయితే, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌అధ్యక్షురాలు, బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో వాదన సందర్భంగా ఆమెకు ఒవైసీ ఘాటైన సమాధానమిచ్చారు. తమ పార్టీని ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు. ఎంఐఎం దేశ వ్యాప్తంగా ముస్లింలు ఎక్కడున్నా వారి ప్రయోజనాల కోసం పాటు పడుతుందనీ, ఆ క్రమంలోనే వివిధ రాష్ట్రాల్ల ప్రవేశించేందుకు ప్రయత్నాలు సాగిస్తుందనీ, ఒక రాజకీయ పార్టీగా తమకు ఆ హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఆయన వాదన సహేతుకమైనదే. తమిళనాడు నేపథ్యం గురించి పరిశీలిస్తే అక్కడ మొదటి నుంచి ద్రవిడ పార్టీలకే ప్రాధాన్యం లభిస్తుంది. ద్రవిడ పార్టీల సిద్ధాంతాల ప్రకారం మతాన్ని దూరంగా పెట్టడం, వ్యూహాత్మకంగా ముస్లిం లీగ్‌, ఎంఎం‌కె వంటి పార్టీలతో జత కట్టడం వేరు. ఇతర ప్రాంతాల నుంచి వొచ్చే పార్టీలను తమ కూటమిలో చేర్చుకోవడానికి వారు మొదటి నుంచి వ్యతిరేకం. అంతేకాక, డిఎంకె వ్యవస్థాపకుడు అన్నాదురై ద్రవిడ కజగం(డికె) వ్యవస్థాపకుడు ఈవీ రామస్వామి నాయకర్‌ ‌శిష్యుడు. నాస్తిక వాదం పునాదులపై ఆ పార్టీ ఏర్పడింది. ఆ పార్టీనుంచి బయటకు వొచ్చిన అన్నా దురై డిఎంకెని స్థాపించి కరుణానిధిని తన వారసునిగా చేసుకున్నారు. ఆ స్థానాన్ని ఆశించి భంగపడిన సినీనటుడు ఎంజీ రామచంద్రన్‌ అన్నా డిఎంకెను స్థాపించారు. అన్నాదురై నుంచి కరుణానిధి వరకూ, ఆయన నుంచి ఎంజీఆర్‌ ‌వరకూ, ఆయన నుంచి ఆయన వారసురాలు జయలలిత వరకూ సిద్ధాంతపరమైన సరళీకరణ జరిగింది. అయినప్పటికీ హిందీ పట్ల వ్యతిరేకత విషయంలో ఎటువంటి మార్పు రాలేదు. అలాగే, ఉత్తరాది వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించడంలో కూడా ద్రవిడ పార్టీల ధోరణి మారలేదు. అయితే, వాజ్‌ ‌పేయి హయాంలో సంకీర్ణ కూటమిలో డిఎంకె స్థానం సంపాదించి కేంద్రంలో మంత్రి పదవులను పొందింది. అలాగే, యూపీఏ కూటమిలో కూడా మంత్రి పదవులను పొందింది. సంకీర్ణంలో డీఎంకె మద్దతు అవసరమైనందున వారికి స్థానం కల్పించడం జరిగింది. కానీ, ఉత్తరాది వ్యతిరేకత, హిందీ వ్యతిరేకత భావజాలాన్ని సరళీకరించుకున్నారేమో కానీ, పూర్తిగా వదిలి పెట్టలేదు. ఉర్దూ భాష హిందీకి దగ్గరైనందున ఒవైసీ పార్టీ ఉత్తరాదిన గెల్చుకోవడంలో ఆశ్చర్యం లేదు.

- Advertisement -

కానీ, తమిళనాడులో ఆ ప్రయోగం ఫలిస్తుందా అన్నది ప్రశ్నార్థకం. అంతేకాకుండా, జయలలిత మాజీ ఇష్టసఖి శశికళ ఈ నెలాఖరున విడుదల కానున్నారు. ఆమె జైలు నుంచి ఎప్పుడొస్తారా అని ఆమె అభిమానులు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఆమె ప్రవేశంతో తమిళనాడులో రాజకీయ ముఖచిత్రం మారిపోవొచ్చు. ఆమె విడుదలను దృష్టిలో ఉంచుకునే, ఆమె ప్రభావాన్ని తగ్గించేందుకు సూపర్‌ ‌స్టార్‌ ‌రజనీకాంత్‌ని పార్టీ పెట్టమని కమలనాథులు వొత్తిడి చేశారు. ఆయన మెత్తబడి డిసెంబర్‌ 31‌వ తేదీన పార్టీని ప్రకటిస్తానన్నారు. కానీ, అనారోగ్యం కారణంగా ఆయన సారీ చెప్పారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో శశికళ సూపర్‌ ‌స్టార్‌ ‌కావొచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె వైఖరి ఏమిటో ఎవరికీ తెలియదు. తమిళనాడు రాజకీయాల్లో ఒవైసీ ప్రవేశించగలరా.. ఒక వేళ ప్రవేశిస్తే ఏ కూటమిలో చేరుతారు..లేక విడిగా పోటీ చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కూడా ఎన్నికల రంగంలో ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనకు డిఎంకె అధ్యక్షుడు, తన సోదరుడు ఎంకె స్టాలిన్‌పై వ్యతిరేకత తప్ప రాజకీయ అజెండా ఏమీ లేదు. ఆయనను తమ వైపు తిప్పుకోవడానికి కమలనాథులు కొద్ది కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలను ముమ్మరం చేయవొచ్చు. ఏమైనా, తమిళులు ఉత్తరాదివారి ఆధిపత్యాన్నీ, హిందీ ఆధిపత్యాన్ని అంగీకరించరన్నది జగమెరిగిన సత్యం.

Leave a Reply