Take a fresh look at your lifestyle.

భారతంలో శిశు మరణాలు ప్రధాన సమస్య అవుతోందా ?

ప్రతి వెయ్యి మంది జన్మించిన 5 ఏండ్ల లోపు శిశువుల్లో మరణించిన వారి సంఖ్యను శిశు మరణాల రేటు(ఇన్ఫాంట్‌ ‌మోర్టాలిటీ రేట్‌, ఐయంఆర్‌)‌గా వర్ణిస్తారు.  దేశ శిశు మరణాల రేటు ఆధారంగా ఆ దేశ ప్రజల ఆరోగ్య సంక్షేమం ఉంటుందని మనకు తెలుసు. ఇటీవల విడుదల చేసిన రిజిస్ట్రార్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా గణాంకాల ప్రకారం ప్రస్తుత శిశు మరణాల రేటు 28 (ప్రతి 1000 శిశు జననాల్లో 28 మరణాలు) ఉందని తెలుస్తున్నది. గత వివరాల ప్రకారం భారత దేశ శిశు మరణాల రేటు 44 నుంచి నేడు 28కి తగ్గించడం కొంత విజయమే అయినా ఈ సమస్యను ప్రధానమైందని తలచి మరింత కృషి చేయాల్సి ఉందని గమనించాలి.

ప్రపంచ దేశాల శిశు మరణాల రేటు:
యూనిసెఫ్‌-2020 ‌నివేదిక ప్రకారం శిశు మరణాల రేటు అతి తక్కువగా ఉన్న దేశాల జాబితాలో 1.54తో ఐస్‌లాండ్‌, 1.56‌తో సాన్‌ ‌మరీనో, 1.65తో ఎస్టోనియా, 1.76తో స్లోవియా, 1.79తో నార్వే, 1.82తో జపాన్‌, 1.85‌తో సింగపూర్‌, 1.88‌తో ఫిన్‌లాండ్‌, 1.95‌తో మాంటెనిగ్రో, 2.15తో స్వీడెన్‌లు ఆదర్శంగా నిలుస్తున్నాయి. 2022లో ప్రపంచ దేశాల సగటు శిశు మరణాల రేటు 27 ఉంది. అత్యధిక శిశు మరణాల రేటు నమోదైన దేశాల జాబితాలో సియెరా లియోన్‌లో 80, సెంట్రల్‌ ఆ‌ఫ్రికన్‌ ‌రిపబ్లిక్‌లో 76, సొమాలియాలో 73, నైజీరియాలో 72, కాంగోలో 64, సౌథ్‌ ‌సూడాన్‌లో 63, మాలిలో 59 అగ్రభాగాన నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 5 ఏండ్ల లోపు వయస్సు ఉన్న శిశువుల్లో ఏడాదికి 4 మిలియన్లు (75 శాతం) మరణాలు నమోదు అవుతున్నాయి. 2020లో తొలి మాసంలోనే 2.4 మిలియన్లు, 1 మిలియన్‌ ‌తొలిగంటలో (5 ఏండ్ల లోపు మరణాల్లో 47 శాతం) శిశు మరణాలు నమోదు కావడం విచారకరం.ఆఫ్రికన్‌ ‌ప్రాంతంలో ఏడాది లోపు శిశువుల మరణాల రేటు 52 ఉండగా, యూరోప్‌ ‌ప్రాంతంలో7ఉన్నది.

భారతంలో శిశు మరణాల రేటు:
గ్రామీణ భారతంలో ఐయంఆర్‌ 48 ‌నుంచి 31 వరకు, పట్టణాల్లో 29 నుంచి 19 వరకు తగ్గడం గమనించారు. అంతర్‌ ‌రాష్ట్రాలు, పట్టణాలు, గ్రామాల మధ్య శిశు మరణాల రేటులో వ్యత్యాసాలు కొన్ని ప్రమాదకర వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా శిశు మరణాల రేటు తగ్గినా ప్రతి 36 మంది శిశువుల్లో ఒకరు ఏడాది లోపు మరణించడం గమనించారు. భారతదేశంలో క్రమంగా శిశు మరణాల రేటు తగ్గినప్పటికీ మన ఇరుగుపొరుగు దేశాలతో పోల్చితే మనం వెనుకబడి ఉన్నామని తెలుస్తున్నది. బంగ్లాదేశ్‌, ‌నేపాల్‌లలో ఐయంఆర్‌ 24, ‌భూటాన్‌లో 23, శ్రీలంకలో 6 ఉండగా పాకిస్థాన్‌లో మాత్రం 56 వరకు ఉండడం గమనించాలి. పెద్ద దేశాలైన బ్రెజిల్‌, ‌చైనాల కన్న భారత శిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని తెలుస్తున్నది.

భారత రాష్ట్రాల శిశు మరణాల రేటు:
భారత రాష్ట్రాల్లో అత్యల్ప ఐయంఆర్‌ ‌మిజోరాంలో 3, కేరళలో 6 నమోదైంది. చిన్న రాష్ట్రాల్లో శిశు మరణాలు తక్కువగా నమోదు కావడం గమనించారు. యంపిలో 43, యూపిలో 38, ఛత్తీస్‌ఘడ్‌లో 38, బీహార్‌లో 27, ఝార్ఖండ్‌లో 25 శిశు మరణాల రేటు అధికంగా ఉండడం విచారకరం. దేశంలో తొలి పుట్టిన రోజు ఉత్సవాలు జరుపుకోకుండానే శిశువులు తుది శ్వాస విడవడం గర్హనీయం. డబ్ల్యూహెచ్‌ఓ ‌వివరాల ప్రకారం భారతీయ శిశువుల్లో పోషకాహారలోపం అధికంగా ఉండడంతో సాధారణ బాల్య జబ్బులైన డయేరియా, న్యుమోనియా, మలేరియా లాంటి అనారోగ్యాలకు కూడా శిశు మరణాలకు బలికావడం జరగడం సోచనీయం. పోషకాహారలోపంతో వ్యాధినిరోధకశక్తి పడిపోవడం, మరణాలరేటు పెరగడం సహజంగా జరుగుతోంది.

- Advertisement -

తెలుగు రాష్టాల శిశు మరణాల రేటు:
2022లో ఆంధ్రలోనా 24, తెలంగాణలో 21 శిశు మరణాల రేటు ఉండడం విచారకరమే. 2021లో దేశంలో ఐయంఆర్‌ 30 ఉం‌డగా పట్టణాల్లో 20, పల్లెల్లో 34గా నిర్థారించబడింది. తెలంగాణలో శిశు మరణాల రేటు 23 (గ్రామీణంలో 26, పట్టణాల్లో 18), ఆంధ్రప్రదేశ్‌లో 25 (గ్రామీణంలో 28, పట్టణాల్లో 19గా నమోదైంది. 2018లో ఐయంఆర్‌ ‌దేశంలో 32, తెలంగాణలో 27, ఆంధ్రప్రదేశ్‌లో 29గా నిర్థారిణచబడిన విషయం మనకు తెలుసు. 2014లో తెలంగాణలో ఐయంఆర్‌ 39 ఉం‌డేదని గమనించాలి.

శిశు మరణాలకు కారణాలు – పరిష్కార మార్గాలు:
శిశు సంబంధ ఔషధాల కొరత, నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది లేమి, త్రాగే నీటి అలభ్యత, పోషకా హారలోపం లాంటి సమస్యలు ప్రజారోగ్యాన్నే కాకుండా శిశు మరణాల రేటును ప్రభావితం చేస్తున్నాయని విధితమ వుతోంది. తీవ్రాతితీవ్రమైన పోషకాహారలోపం (సివియర్‌ అక్యూట్‌ ‌మాల్‌ ‌న్యూట్రిషన్‌, ‌యస్‌ఏయం) భారతీయ బాలల్లో ప్రమాదకరంగా మారింది. ఒక మోస్తారు పోషకాహారలోపం (మాడరేట్‌ ‌మాల్‌న్యూట్రిషియన్‌, ‌యంఏయం)తో బాధ పడుతున్న భారత బాలలు కూడా మరణాల అంచున ఉన్నారని అర్థం అవుతున్నది. భారత్‌లో తక్కువ బరువు కలిగిన శిశు జననాలు మరో తీవ్ర సమస్యగా నిలుస్తున్నది. ఇండియాలో ఆసుపత్రి ప్రసవాలు కొంత పెరిగిన, అన్ని ఆసుపత్రుల్లో సమాన అవసర వసతులు లేవని, నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కొరత కూడా ఐయంఆర్‌ ‌సమస్యాగ్నికి ఆజ్యం పోస్తున్నది.

భారతీయ మాతల్లో పోషకాహార సమస్య కూడా శిశు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నది. తాజా నేషనల్‌ ‌ఫామిలీ హెల్త్ ‌సర్వే వివరాల ప్రకారం 15-49 ఏండ్ల వయస్సుగల భారత గర్భిణి స్త్రీల్లో 52 శాతం రక్తహీనతతో బాధ పడుతున్నట్లు తెలుస్తున్నది. తల్లి బిడ్డల్లో రక్తహీనతతో మాతశిశు ఆరోగ్యం దెబ్బ తింటున్నది. ప్రభుత్వాలు జిడిపీలో ఒక్క శాతం మాత్రమే వైద్య ఆరోగ్యాలకు వెచ్చించడం సమస్య తీవ్రతను జటిలం చేస్తున్నది. ఢిల్లీ, త్రిపుర లాంటి రాష్ట్రాలు జిడిపిలో 10 శాతం వరకు వైద్య ఆరోగ్యాలకు వెచ్చించడం హర్షదాయకం, అనుసరణీయం.  నేటి శిశువులే రేపటి పౌరులు. నేటి శిశు ఆరోగ్యమే రేపటి దేశ సౌభాగ్యం. శిశు రక్షణ మనందరి భాద్యత. శిశు ఆరోగ్య యజ్ఞంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమ తమ కర్తవ్యాలను నిర్వహించాలి. పోషకాహార భద్రత ప్రాధమిక మానవ హక్కు కావాలి. శిశు మరణాలు జాతికి మాయని మచ్చలని, పోషకాహార లభ్యతే సరైన ఔషధమని గుర్తిద్దాం. మాతశిశు ఆరోగ్య పరిరక్షణ ప్రథమ కర్తవ్యమని ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. కుటుంబాలకు పోషకాహార భద్రత కల్పిద్దాం. చిన్నారుల ముఖాల్లో చిరునవ్యులు విరబూసేలా ప్రతి ఒక్కరం కంకణబద్దులం కావాలి. మన పిల్లలే మన దేశ భవ్య భవిత వెలుగులని నమ్ముదాం. శిశు చిరునవ్వులే కుటుంబ సభ్యుల ఆరోగ్యాలకు కారణమని తెలుసుకుందాం. వంశాంకురాలైన శిశువులను కళ్శల్లో పెట్టుకొని పెంచుకుందాం.
– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి, కరీంనగర్‌,9949700037

Leave a Reply