Take a fresh look at your lifestyle.

రష్యాకు భారత్‌ ‌భయపడుతున్నదా ?

రష్యా వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసే విషయంలో భారత్‌ ‌వెనుకాడటం చూస్తుంటే రష్యాను చూసి భారత్‌ ‌భయపడుతున్నదన్నది స్పష్టమవుతున్నదని అమెరికా ఆరోపిస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న సందర్భంగా ‘నాటో’ దేశాలు రష్యాపై పలు ఆంక్షలను విధిస్తూ వొస్తున్నాయి. దీనివల్ల రష్యా ఆర్థిక పరిస్థితి క్రమేణా క్షీణిస్తూ వస్తున్నది. రష్యాలో నిత్యవసరాల ధరలు మిన్నంటుతున్నాయి. ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని రష్యా ప్రజలు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌కు అనేక రకాలుగా విజ్ఞప్తి చేస్తున్నారు. యుద్ధోన్మాది అయిన పుతిన్‌ ఎవరి విజ్ఞప్తులను ఇప్పుడు వినిపించుకునే పరిస్థితిలో లేడు. ఉక్రెయిన్‌ను పూర్తిగా మట్టుపెట్టాలన్న లక్ష్యంగానే ఆయన తన సైన్యాన్ని ఇంకా ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. అనేక దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలకు కూడా ఆయన ఏమాత్రం బెదరటంలేదు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న భారత్‌ ‌లాంటి కొన్ని దేశాలు ఇంకా రష్యాతో లావాదేవీలు కొనసాగిస్తూనే ఉన్నాయి.

ఇది అమెరికాకు కంటగింపుగా ఉంది. అమెరికా మిత్రదేశాలన్నీ రష్యాపై అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకువస్తుంటే భారత్‌ ‌తటస్థవైఖరిని అవలంబిస్తుండటం ఒక విధంగా భారత్‌ ‌బలహీనతగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ‌పేర్కొనడం చూస్తుంటే ఈ సంఘటనలో భారత్‌ను ఇరుకున పెట్టాలన్నది అమెరికా ఆలోచనగా కనిపిస్తున్నది. రష్యాపై చర్యలు తీసుకోవడానికి భారత్‌ ‌వెనుకాడుతుండడం చూస్తుంటే, రష్యాకు భారత్‌ ‌భయపడుతున్నట్లున్నదంటూ జో బైడెన్‌ ‌సంచలనాత్మక కామెంట్‌ ‌భారత్‌ను తీవ్ర వొత్తిడికి గురిచేసేదిగా కనిపిస్తోంది. భారత్‌ ‌సహా అమెరికా, జపాన్‌, అ‌స్ట్రేలియా దేశాలు సభ్యత్వం కలిగిన క్వాడ్‌ ‌దేశాలు రష్యాపై తీవ్ర వొత్తిడిని తీసుకువొస్తున్నాయి. భారత్‌మాత్రం ఆంక్షల జోలికి వెళ్ళకుండా కేవలం యుద్ధం ద్వారా కాకుండా శాంతియుత చర్చలద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచనలు చేస్తున్నది..

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి దాదాపు నెలరోజులు కావస్తున్నది. చాలా చిన్నదేశమైన ఉక్రెయిన్‌ను కొద్ది కాలంలోనే లోబరుచుకోవచ్చనుకున్న పుతిన్‌ అభిప్రాయానికి తీవ్ర విఘాతమే ఏర్పడింది. నాటో దేశాలు సరాసరి యుద్ధ క్షేత్రంలోకి దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వొస్తుందని రష్యా హెచ్చరించిన నేపథ్యంలో అమెరికా దాని మిత్రదేశాలు కేవలం ఆయుధ సామగ్రీని ఉక్రెయిన్‌కు అందిస్తూ వొచ్చాయి. కొద్ది సైన్యం, కొద్ది ఆయుధ సామగ్రీ ఉన్న ఉక్రెయిన్‌ ‌రష్యా సైన్యాన్ని ఈ నెల రోజులుగా థీటుగా ఎదుర్కుంటున్నది. ఈ భీకర సంగ్రామం ఇప్పుడు ప్రపంచంలోని దేశాలన్నీ రెండు భాగాలుగా ఏర్పడే మరిణామాలకు దారి తీస్తున్నది. అది క్రమేణ మూడవ ప్రపంచ యుద్దంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలకు తావిస్తోంది. ఇప్పటివరకు కేవలం ఆయుధాలు, ఆర్థిక ఇతర సహకారాన్ని అందిస్తున్న నాటో దేశాలు యుద్ధం ఇలానే కొనసాగితే ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాలున్నాయంటున్నారు. అదే జరిగితే అప్పుడు మరో ప్రపంచ సంగ్రామానికి దారి తీయకపోదు. ఈ పరిస్థితిలో యుద్ధ నివారణ చర్యలు చేపట్టిన ఐక్యరాజ్య సమితి మాటలను కూడా రష్యా ఏమాత్రం లెక్కచేయడంలేదు. అంతేకాదు యుద్ధాన్ని నిలిపివేయాల్సిందిగా అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా రష్యా ఖాతరు చేయడంలేదు. ఉక్రెయిన్‌ను అక్రమించి అక్కడ తన ఆధీనంలో తమకు అనుకూ)మైన ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్నదే పుతిన్‌ ‌లక్ష్యం.

దాదాపు రెండు దశాబ్దాల కాలంగా ఉక్రెయిన్‌కు అనేక విధాలుగా సహాయ సహకారాలను అందిస్తున్న అమెరికా, రష్యాకు పక్కలో బల్లెంలా తయారయ్యే అవకాశాలున్నాయి. అదే విషయాన్ని పుతిన్‌ ఉద్ఘాటిస్తూ, తన పక్కదేశంలో నాటో దళాల ఏర్పాటును తానెలా ఉపేక్షిస్తానని చెబుతున్నాడు. అది చూడడానికి ఉక్రెయిన్‌పై యుద్ధమే అయినా వాస్తవంగా పరోక్ష అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటమన్నది తెలిసిందే. అందుకే ఆ దేశాన్ని సర్వనాశనం చేసిఅయినా భవిష్యత్‌లో రష్యాను ఆనుకుని ఉన్న దేశాలేవీకూడా నాటో సంబంధాలను నెలకొల్పితే ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వొస్తుందని హెచ్చరించాలన్నదే పుతిన్‌ ఆలోచన. కాగా ఈ యుద్దంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా తనది పైచెయ్యిగా ఉండా లని అమెరికా చూస్తున్నది. కాని అమెరికా తన పెద్దరికాన్ని నిలుపుకోలేకపోయింది. ఉక్రెయిన్‌పై దాడిని నిలువరించలేక పోయింది.

ఆ దేశంపై జరుగుతున్న దాడి విషయంలో చాలా ఆలస్యంగా స్పందించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు అమెరికాతో సహా నాటో దేశాలు అనుకున్నంతగా స్పందించకపోవడంపట్ల చాలా నిస్పృహను వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో రష్యాపై ఇంతో అంతో వొత్తిడి తీసుకువచ్చేందుకు భారత్‌ను ఆయుధంగా వాడుకోవాలని జో బైడెన్‌ ‌చూస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకే భారత్‌ను తీవ్ర పదజాలంతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రపంచంలో అతి పెద్ద దేశాలు, పరస్పర వ్యతిరేక రాజ్యాలైన రష్యా, అమెరికాతో భారత్‌ ‌సత్సంబంధాలను మొదటినుండీ నెలకొల్పుతూనే ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో ధీటుగా ఎదుగుతున్న భారత్‌ ‌సర్వసత్తాక సార్వభౌమత్వం కలిగినదేశం. అందుకే ఆచితూచి అడుగులేస్తున్నది. అమెరికా రెచ్చగొట్టినంత మాత్రాన భారత్‌ ‌తన పంథాను మార్చుకోదు.

Leave a Reply