Take a fresh look at your lifestyle.

హుజూరాబాద్‌ ‌మరో నిజామాబాద్‌ ‌కానుందా..?

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్‌ ‌రాక ముందే ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈ ఎన్నిక ఇప్పుడు దేశ ప్రజలందరినీ ఆకర్షించేదిగా మారింది. ఆత్మగౌరవానికి, అధికారానికి మధ్య పోరు నినాదంతో జరుగనున్న ఈ ఎన్నికలో విజేతలెవరవుతారన్న విషయంలో ఆసక్తి నెలకొంది. ఈ ఉప ఎన్నికలో విజయం తమనే వరిస్తుందని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు కుస్తీ పట్లకు సిద్ధమవుతుంటే, మరో పక్కన ఉపాధి కోల్పోయిన వర్గాలు ఈ పార్టీలను హడలగొడుతున్నాయి. తమకు న్యాయం జరుగని పక్షంలో తాము కూడా ఎన్నికల్లో పోటీపడి రాజకీయ పార్టీల అంచనాలను తలకిందులు చేస్తామని హెచ్చరికలు జారీచేస్తున్న తీరు మరో నిజామాబాద్‌ ఎం‌పి ఎన్నికలను తలపించేదిగా కనిపిస్తున్నది. నిజామాబాద్‌లో కూడా అక్కడి రైతులు పసుపు బోర్డు నెలకొల్పాలన్న విషయంలో కల్వకుంట్ల కవిత విఫలమవడాన్ని ఎత్తిచూపుతూ ఆమెను ఓడించే దిశగా వందలాది మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలియందికాదు. రైతుల పట్టుదల ఫలితంగా అక్కడ పోటీ చేసిన అధికార పార్టీ అభ్యర్థి కవిత ఓటమిని చవిచూడాల్సి వొచ్చింది. అదే సీన్‌ ‌హుజూరాబాద్‌లో కూడా రిపీట్‌ అవబోతున్నట్లు కనిపిస్తున్నది. హుజూరాబాద్‌లో జండా పాతే విషయంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే ఎంతో ఉత్సుకతతో ఉన్నాయి. ఆ స్థానానికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌ ‌కాషాయ కండువా కప్పుకున్నా గెలుపు తనదనే ధీమాను వ్యక్తంచేస్తున్నాడు. అధికార పార్టీ ఇంకా అభ్యర్థిని ఎంపిక చేయకున్నా తమ అభ్యర్థిని గెలిపించుకుని కారులో కూర్చోబెట్టుకుని పోతానంటుంది.

కాంగ్రెస్‌ ఇతర పార్టీలు కూడా అదే ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి. అయితే తమ గెలుపు ఓటములపై బేరీజు వేసుకుంటున్న ఆ పక్షాలకు కొత్త తలనొప్పి తయ్యారైంది. ఉపాధి కోల్పోయిన వర్గాలు తీవ్ర కోపంతో ఉన్నాయి. తమను అన్యాయం చేసిన ప్రభుత్వానికి బుద్దిచెప్పేందుకు ఎన్నికల బరిలో నిలుస్తామని ప్రకటించాయి. వారి కోపమంతా ప్రభుత్వంపైనే అయినప్పటికీ, అధికార పార్టీపై గెలిచితీరుతామనుకుంటున్న ప్రతి పక్షాలకు వీరి సమస్య కొరుకుడు పడటంలేదు. వీరంతా వందల సంఖ్యలో ఎన్నికల్లో పాల్గొంటే వోట్లు చీలిపోతాయన్న భయం వారిని వెంటాడుతున్నది. రాష్ట్రంలో కొరోనా మొదటి విడుత తీవ్రతరంగా ఉన్నప్పటి నుండి నేటి వరకు ప్రభుత్వం తమను ఏమాత్రం ఆదుకోలేదని ప్రైవేటు లెక్చరర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలలకొద్ది కళాశాలలు మూసివేయడంతో వేతనాలందక, తమ కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదనే అసంతృప్తితో వారున్నారు. ప్రైవేటు పాఠశాల టీచర్లకు మాత్రం రెండు వేల రూపాయలు, రేషన్‌ ‌సరుకులను అందించిన ప్రభుత్వం తమను పూర్తిగా అన్యాయం చేసిందని ఆక్రోషిస్తున్నారు. నెలకు కనీసం కుటుంబానికి పదివేల రూపాయలను అందించాలని అనేకసార్లు చేసిన విజ్ఞప్తిని కూడా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపట్ల వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా తమ విజ్ఞాపన మేరకు కొరోనా నాటినుండి నేటి వరకు లెక్కకట్టి పదివేల రూపాయల చొప్పున తమకు ఉపకారం అందజేయని పక్షంలో రానున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఓటమికి కనీసం వందమంది ప్రైవేటు లెక్చరర్లు బరిలో దిగనున్నట్లు వారు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేశారు.

వీరొక్కరే కాదు అన్యాయంగా, అక్రమంగా, ఎలాంటి హెచ్చరిక లేకుండా బజారున పడేసిన తమను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్స్ ‌డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన సుమారు ఏడు వేల ఆరు వందల మంది పట్ల ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించింది. పద్నాలుగు ఏండ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న వీరు తమ వేతనాలను పెంచాలని ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో గత సంవత్సరం మార్చ్‌లో సమ్మె చేపట్టారు. కాని, కోవిడ్‌ ‌కారణాల వల్ల అదే నెల 20వ తేదీన సమ్మె విరమించినప్పటికీ సంబంధిత అధికారులు డ్యూటీలోకి తీసుకోలేదు. అప్పటి నుండి వారిని నేటి వరకు ఉద్యోగాల్లోకి తీసుకోలేదు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించని పక్షంలో ఉప ఎన్నికల్లో కనీసం వెయ్యి మందిమి నామినేషన్‌ ‌దాఖలు చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎనమిది వందల మంది ఎంపిటీసీలు తాము కూడా నామినేషన్‌ ‌వేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. నిధులు, విధులు కేటాయించ కుండా తమను ఉత్త ఉత్సవ విగ్రహాల్లా ప్రభుత్వం కూర్చోబెడుతున్నదన్నది వారి ఆరోపణ. రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ఎంఎల్‌సి ఎన్నికల్లో విజయానికి తామెంతో కృషి చేసినా తమకు వరుగ బెట్టింది ఏమీలేదని వారు వాపోతున్నారు. కనీసం గ్రామ పంచాయితీ సభ్యుడికి ఉన్న విలువ, గౌరవం కూడా తమకు లేకుండా పోయిందని, ఒక విధంగా తమకు విధులు, నిధులు కేటాయించకుండా అవమానిస్తున్నదని వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించని పక్షంలో ఎనిమిది వందలమంది ఈ ఉప ఎన్నికల్లో నామినేషన్‌ ‌వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎంపిటీసిల ఫోరం ప్రకటించింది. మొత్తం మీద రాజీకీయ పార్టీలకన్నా ఈ సమస్యలిప్పుడు అధికార పార్టీకి తలబొప్పి కట్టించేవిగా తయ్యారైనాయి. ప్రభుత్వం తాత్సర్యం చేస్తే ఇక్కడ కూడా నిజామాబాద్‌ ‌పార్లమెంట్‌ ఎన్నికలో లాగా బ్యాలెట్‌ ‌షీట్‌ ‌పెంచుకోక తప్పదేమో.

Leave a Reply