(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా )
మహిళలు ఆకాశంలో సగం , అవనిలో సగం అంటారు కానీ అవకాశాలలోమృగ్యం.. ప్రపంచ జనాభాలో మహిళలు సగభాగంగా ఉన్నప్పటికీ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో అన్నింటిలోనూ పురుషుడి కంటే స్త్రీ ఎంతో వెనుకబడి ఉంది. సమాజంలోనూ కుటుంబంలోనూ అణచివేతకు, దోపిడికి మరియు పీడనకు గురవుతు0ది. అసమ సమాజంలో భాగంగా స్త్రీ పురుషుల మధ్య అసమానత కొనసాగుతున్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని 1945లో ఏర్పడ్డ ఐక్య రాజ్య సమితి గుర్తించి 1946 జూన్ 21న ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆనాటి నుండి నేటి వరకు స్త్రీ పురుష సమానత్వం పై అవిరళ కృషి చేస్తున్నప్పటికీ లింగ వివక్షత తొలగించబడలేదు. మన దేశం లింగ వివక్షతలో 114వ స్థానంలో, ఆర్థిక స్వావలంబనలో 134వ స్థానంలో మరియు వైద్యంలో స్థానంలో 141వ స్థానంలో ఉంది.
ప్రపంచ దేశాలలో స్త్రీ పురుష వ్యత్యాసం గతంలో ఉన్న 112వ స్థానం నుంచి భారతదేశం 136 స్థానానికి చేరింది. మహిళలపై అత్యాచారాలు, హింస, దాడులు మరియు దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అవకాశాలలో అసమానతలు, బాల్య వివాహాలు బ్రూణ హత్యలు, పరువు హత్యలు, అణచివేత, జోగిని దేవదాసి దురాచారాలు, లైంగిక దాడులకు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. అక్రమ రవాణా, సామ్రాజ్యవాద విష సంస్కృతి లో స్త్రీల వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని దిగజార్చడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా లో 71 శాతం బాలికలు మహిళలు బలవుతున్నారు. ఇప్పటికీ స్త్రీ శ్రామికురాలిగా, పురుషులతో సమానంగా చూడకుండా వివక్షతకు గురవుతుంది. భారతదేశంలో వచ్చే 75 సంవత్సరాలు పూర్తిఅవుతున్న అమృత ఉత్సవాల సమయంలో కూడా, మహిళల రక్షణ భద్రత కోసం రాజ్యాంగం ఎన్నో చట్టాలు చేసినప్పటికీ స్త్రీ పురుష సమానత్వం అందని ద్రాక్ష పండులా మిగిలిపోయింది. అంత మాత్రమే గాక వివక్షతతో కూడిన హింస ప్రవృత్తి రోజురోజుకు పెరిగి పోతుండటం, ఆ హింసకు పాల్పడినవారిని చట్టప్రకారం శిక్షించకుండా ఉదాసీన వైఖరిని ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉండటం వల్ల అత్యంత దారుణంగా వివక్షత విరుచుకు పడుతుంది. వీటిని ఎదుర్కోవడానికి హక్కుల పట్ల అవగాహన చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక రోజును అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి ఐక్యరాజ్యసమితి 19 75 లో ప్రకటించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేపథ్యం:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి ఆవిర్భవించింది. 1908లో తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు హక్కు కోసం న్యూయార్క్ సిటీ లో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేయడం ,ఆ శ్రామిక మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909 లో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని క్లారా జెట్కిన్ కోపెన్హాగన్ జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఉమెన్స్ సదస్సులో ప్రతిపాదన చేయడం, 17 దేశాల నుండి హాజరైన 100 మంది మహిళలు ఏకగ్రీవంగా ఆమోదించటం జరిగింది. 1911లో ఆస్ట్రియా ,డెన్మార్క్ ,జర్మనీ,స్విట్జర్లాండ్ దేశాలలో నిర్వహించారు. అందుకే దీనిని అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా గుర్తించాలి. కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, హక్కులను సాధించే దిశగా పోరాటాలు చేయడం ఈ దినోత్సవం వెనుక కారణం.. ప్రతి ఏటా ఐక్యరాజ్యసమితి ఏదో ఒక ఇతివృత్తాన్ని తీసుకునే భాగంగా ఈ ఏడాది” సుస్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం” అంటే రేపటి మహిళలు అని చెప్పవచ్చు .వివిధ రంగాలలో మహిళలు బాలికలు సాధించిన విజయాలు సహకారాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
112 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉంటున్నప్పటికీ నవ నాగరిక మానవ సమాజంలో ఆధునికత పేరుతో శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న పరిణామక్రమంలో సామ్రాజ్యవాద విష సంస్కృతి వల్ల స్త్రీల పరిస్థితి కడు దయనీయంగా మారింది. స్త్రీ పురుష సమానత్వం లేక లింగ వివక్షత ఎక్కువయింది. స్త్రీ పురుష సమానత్వం కోసం రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి హక్కులను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. ఫలితంగా స్త్రీల పట్ల చులకన భావం పెరిగిపోయింది. ఆధిపత్య కుల వర్గ పితృస్వామ్య భావజాలం రోజురోజుకు పెరిగిపోయి పరువు హత్యలు, స్త్రీలపై హింస లు దారుణంగా జరుగుతున్నాయి. అత్యాచారానికి గురైన మహిళలకు న్యాయం చేయడంలో నేటి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. కంచె చేను మేసిన చందంగా పాలకవర్గాల ప్రజాప్రతినిధులు స్త్రీల పై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ధరించే దుస్తుల పైన, వస్త్రధారణపై ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భం హిజాబ్ ఉదంతం ద్వారా కనిపిస్తుంది. కొన్ని వర్గాలకు చెందిన మహిళలను అసభ్యకరమైన యాప్ లను రూపొందించి అవమానకరంగా కామెంట్లు, ఫోటోల ద్వారా వేధించడం ప్రజాస్వామిక విలువలను, మహిళలగౌరవాన్ని మంట కలపడమే. ఇలా గత కొన్ని ఏళ్లుగా మహిళల ఉనికికి ప్రమాదాన్ని సూచించే ఎన్నో విషయాలు జరుగుతున్నాయి.
స్త్రీ పురుష సమానత్వం కోసం లింగ వివక్షత ను తొలగించడానికి ఐక్యరాజ్యసమితి ప్రపంచ సంఘీభావ ఉద్యమం చేపట్టింది. ఇది లింగ సమానత్వం కోసం చేపట్టిన ఉద్యమం. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 2014 సెప్టెంబర్ 20న ప్రారంభించింది. ఈ ఉద్యమానికి ”he ఫర్ she”అని పేరు . లింగ వివక్షతకు ఆర్థికపరమైన అసమానతలు, సామాజిక అసమానతలు, ఆరోగ్య పరమైన అసమానతలను మరియు విద్యాపరమైన అసమానతలు ప్రధాన కారణంగా ఉంటాయి. స్త్రీలకు ఆర్థిక విషయాల్లో భాగస్వామ్యం లేకపోవడం, పురుషులతో పాటు అన్ని రకాల పనుల్లో భాగస్వాములు అయినప్పటికీ సమాన వేతనం అందడం లేదు. మార్క్స్ ఎంగెల్స్ ప్రకారం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ లేదు. వరకట్నం, హింస, బాలికల మహిళల అక్రమ రవాణా, లైంగిక దాడులు, బ్రుణ హత్యలు , అద్దె గర్భం వంటి సామాజిక అసమానతలు, టీకాలు అందుబాటులో లేకపోవడం, వివిధ రకాల ఆరోగ్య పరమైన అసమానతలు, పాఠశాలలు సరిపోయేంతగా లేకపోవడం, మహిళా ఉపాధ్యాయుల కొరత, పాఠ్య ప్రణాళికల లో లింగ పక్షపాత వైఖరి, బాలికల పట్ల తల్లిదండ్రుల పక్షపాత వైఖరి వంటి విద్యాపరమైన అసమానతలు రాజ్యమేలుతున్నాయి. వీటికి ప్రధాన కారణం పితృస్వామ్య సమాజం, పుత్ర ప్రాధాన్యత .
లింగ సమానత్వం ఎందుకు??
ప్రపంచంలో సగ భాగంగా ఉన్న మహిళలు, మొత్తం పని నిర్వహణలో మహిళా భాగస్వామ్యం 2/3 వంతు. మొత్తం ఆదాయ సంపాదనలో మహిళా భాగస్వామ్యం1/10 వంతు, ప్రపంచంలో మొత్తం నిరక్షరాస్యత లో మహిళా భాగస్వామ్యం 2/3 వంతు. మొత్తం ఆస్తులు ఉన్న వారిలో ప్రపంచవ్యాప్తంగా మహిళా భాగస్వామ్యం 1/100 వంతు. దేశ అభివృద్ధికి వెన్నెముక అయిన ఉత్పత్తి రంగంలో మహిళల స్థానం తగ్గుతూ ఉండటం ఆందోళనకరం. భారత్లో మొత్తం కార్మికుల్లో21% మాత్రమే మహిళలు ఉన్నారు. ఆసియా ఖండం లోని అతి పెద్ద ప్రభుత్వ రంగ మైన రైల్వేస్ లో 7 శాతం మహిళలు మాత్రమే, ఇప్పటివరకు న్యాయ శాఖ లో భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి పదవులను అలంకరించిన 47 మంది లో ఒక్కరు కూడా మహిళ లేకపోవడం, 25 మంది ఆర్.బి.ఐ గవర్నర్ లలో ఒక మహిళ కూడా లేకపోవడం, రాజకీయ రంగంలో 12శాతం మహిళా ప్రతినిధులు ఉండటం, మరో ముఖ్య రంగమైన మీడియాలో కూడా అతి తక్కువగా మహిళలు పనిచేస్తుండటం లింగ వివక్షత కి నిదర్శనం. లింగ వివక్షత ను ఎదుర్కొనుటకు రాజ్యాంగం ఆర్టికల్ 14, 15(1),15(3), 16 మరియు 23 ప్రకారం ప్రాథమిక హక్కులను పొందు పరచడంజరిగింది. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే 15 ప్రకారం లింగ పరంగా ఏ పౌరుడిని ,పౌరురాలీని వివక్షతకు లోను చేయొద్దు. ఆర్టికల్ 16 రాజ్యంలోని హోదా లోనైనా ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం ఉండాలి, ఆర్టికల్ 23 వెట్టిచాకిరి దేవదాసి వ్యవస్థ నిషేధం అని చెబుతోంది. వీటితో పాటు ఆదేశ సూత్రాలు ,ప్రాథమిక విధులు , సతీ సహగమన నిషేధ చట్టం, వితంతు పునర్వివాహ చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం, వర కట్ననిషేధ చట్టం వంటి రాజ్యాంగ పరమైన రక్షణలు కల్పించబడ్డాయి. అయినను స్త్రీల స్థితి గతులు, స్త్రీ పురుష సమానత్వం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. చట్టాలు చేయడం లో ఉన్న ఆతురత వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ దుస్థితికి కారణం.
ఒక దేశ ప్రగతికి అభివృద్ధిని అంచనా వెయ్యాలంటే ఆ దేశంలో నివసించే స్త్రీల స్థితి గతుల ఆధారంగా అంచనా వేయాలి అంటారు. కనుక స్త్రీ పురుషసమానత్వాన్ని సాధించడానికి, రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి పీడన లేని బతుకుల కోసం, వివక్షల అంతం కోసం గొంతెత్తి నినదించి, పిడికిళ్లు ఎత్తి పోరాడి విజయం సాధించిన అప్పుడే మహిళా దినోత్సవానికి సార్థకత, ఆ దిశగా మహిళలు సంఘటితమై పోరాట పటిమతో హక్కులను సాధించుకుంటారని , వారిఉద్యమాలకు, నిరసనలకు మరియు పోరాటాలకు ప్రజాస్వామిక వాదులు, పౌర సమాజం , మేధావులు చేయూతను ఇయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.