Take a fresh look at your lifestyle.

ఇం‌తటి అసాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు అవసరమా…..

రాష్ట్రంలో భానుడి భగభగ ఒకవైపు, కొరోనా కష్టాలు మరోవైపుండగా మరోసారి రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటున్నది. మే నెల మరో పదిహేను రోజులుండగానే ఎండల తీవ్రత మొదలైంది. దానికి తోడు రెండవ దశ కొరోనా రాష్ట్రాన్నే కాదు యావత్‌ ‌దేశాన్ని వణికిస్తున్నది. మొదటిసారిగా వైరస్‌ ‌వ్యాపించినప్పుడు ఆలస్యంగానైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆంక్షలిప్పుడు లేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఆంక్షలను సడలించాల్సి వొచ్చినట్లు చెబుతున్న ప్రభుత్వాలు తమ రాజకీయ సభలు, సమావేశాల్లో ఎలాంటి నిబంధనలను పాటించకపోవడం కూడా ఒక కారణమవుతున్నది. బళ్ళు, గుళ్ళు మూయించి, రాజకీయ సభలు, సమావేశాలను మాత్రం ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా నిర్వహిస్తున్నారు. కొరోనా ఉండగానే రాష్ట్రంలో రెండు ఉప ఎన్నికలు, జిహెచ్‌ఎం‌సీ, రెండు పట్టభద్రుల ఎంఎల్‌సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

ఇప్పుడు దేశంలో రెండవ దశ వైరస్‌ ‌తీవ్రంగా ప్రబలుతున్నది. గంటల వ్యవధిలోనే వందల నంఖ్యలో కొత్తకేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఇరవై నాలుగు గంటల్లోనే రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతే, తెలంగాణ రాష్ట్రంలో గంటల వ్యవధిలోనే వందలసంఖ్యలో నమోదవుతున్నాయంటేనే రెండవ దశ వైరస్‌ ‌ప్రభావం ఎంతతీవ్రంగా ఉందన్నది అర్థమవుతున్నది. వైరస్‌ ‌పేషట్లను తీసుకునే హాస్పిటళ్ల కొరత, ఆక్ష్సిజన్‌, ‌వెంటిలేటర్ల కొరత ఒక వైపు అయితే, వ్యాధి నివారణకోసం గత కొద్దిరోజులుగా అమలుచేస్తున్న వ్యాక్సిన్‌కు కూడా ఇప్పుడు కొరత ఏర్పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు పేషట్లసంఖ్య పెరుగుతుంటే ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో బెడ్స్ ‌కొరత కొట్టవొచ్చినట్లు కనిపిస్తున్నది. చివరకు చేసేదేమీలేక రాష్ట్ర రాజధానిలోని గాంధీ హాస్పిటల్‌ను మొత్తంగా కోవిద్‌ ‌పేషంట్లకోసం ప్రభుత్వం కేటాయించక తప్పని పరిస్థితి. అయినా స్వయంగా హాస్పిటల్‌ ‌సూపరింటెండెంటే హాస్పిటల్‌కు కోవిడ్‌ ‌బాధితుల రాక ఎక్కువగా ఉందని, ప్రజలు అత్యవసరమయితేనే హాస్పిటల్‌కు రావాలని సూచించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే పాలకులకు, రాజకీయనాయలు ఏమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల సంగ్రామానికి నాంది పలికింది. ఒక పక్క రెండవ దశ కోవిడ్‌ ‌తీవ్రంగా ఉంది.

గాలిద్వారా త్వరితగతిన విస్తరిస్తున్నదని శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. మనుషులపై దీని ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుందంటున్నారు. అయినా రాష్ట్రంలో రెండు కార్పొరేషన్‌ ఎన్నికలతోపాటు, అయిదు మున్సిపాల్టిలకు ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ‌సిద్ధపడింది. పోలీసు సిబ్బందికి, ఉద్యోగులకు, పలువురు ఐఏఎస్‌ అధికారులు ఇప్పటికే ఈ వైరస్‌ ‌ప్రభావానికి గురైనారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, ‌మహబూబాబాద్‌ ఎంఎల్‌ఏ ‌మాలోతు కవిత ఈ వ్యాధిన పడ్డారు. తాజాగా సీనియర్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌నాయకుడు, మాజీ మంత్రి చందూలాల్‌ ‌కొరోనా కారణంగానే మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, నిన్నటివరకు రెండు ఎంఎల్సీ ఎన్నికల ప్రచారసభలు, ఇటీవల నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల కోలాహాలం, ఇప్పుడు మున్సిపల్‌ ‌రణక్షేత్రం ప్రభుత్వ నిబంధనలను ప్రభుత్వమే తుంగలో తొక్కినట్లవుతున్నది.

ఇలాంటి స్థితిలో మున్సిపల్‌ ఎన్నికలు ఇప్పుడే నిర్వహించాలని నిర్ణయించడంపై పలు విమర్శలొస్తున్నాయి. కాంగ్రెస్‌, ‌బిజెపి నాయకులు మరికొంతకాలం వీటిని వాయిదావేస్తే బాగుండేదంటున్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు షబ్బీర్‌ అలి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఈ విషయంలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు కూడా. అయినా గురువారం ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల కావడం. శుక్రవారం నోటిఫికేషన్‌ ‌రావడం కూడా జరిగిపోయింది. అప్పుడే రెండు కార్పొరేషన్‌, అయిదు మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతున్నది. ఇంతటి విపత్కర, అసాధారణ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం అవసరమా అన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి.

Leave a Reply