Take a fresh look at your lifestyle.

దళిత సాధికారత మూన్నాళ్ళ పథకాలతో సాధ్యమేనా?

తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 15 లక్షలకు పైగా దళిత కుటుంబాలున్నాయి.  దళితులందరూ కూడా నామమాత్రపు చర్యలు కాకుండా నిజమైన దళిత సాధికారతను కోరుకుంటున్నారు. దళిత సాధికారత అంటే సామాజికంగా సాంస్కృతికంగా ఆర్థికంగా రాజకీయంగా మిగతా వర్గాలతో సైతం అభివృద్ధి చెందడమే. అంతేకానీ రాష్ట్రంలోని ఏ దళిత యువకుడు కూడా ప్రభుత్వం ఇచ్చే  ఉచితాల కొరకు  పాకులాడే దీనస్థితిలో లేరు.  మరి దళితులు కోరుకుంటున్న నిజమైన సాధికారత, ఆత్మగౌరవం తెలంగాణ ముఖ్యమంత్రి  మూన్నాళ్ళ ముచ్చటైన పథకాలతో సాధ్యమవుతుందా అంటే దళిత సమాజం అంతా సాధ్యం కాదు అనే విషయాన్ని వ్యక్తం చేస్తుంది.  మూన్నాళ్ళ  ముచ్చట అని ఎందుకన్నానంటే ముఖ్యమంత్రి  ఏ పథకమైనా అద్భుతమైన ఉపన్యాసం తో చక్కటి ఉదహారణలతో ఆర్భాటం చేసుకుంటూ పథకాలను ఆరంభిస్తాడు, అర్ధాంతరంగా ముగిస్తాడు. ఈరోజు కాదు ఉద్యమ ప్రస్థానం మొదలు నేటి వరకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుందాం.. రేపటి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళిత వ్యక్తే అవుతాడు.  కేసీఆర్‌ ‌మాట అంటే అంతే, మాట తప్పితే తల నరుక్కుంటా అని ప్రగల్భాలు పలికాడు. రాష్ట్రంలోని దళిత విద్యార్థులు,మేధావులు, యువకులు ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసి పడ్డారు, రాత్రింబవళ్లు కష్టపడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, పోలీసు కేసులు పెట్టుకున్నారు ఏది కాదు రాష్ట్ర సాధన కోసం సర్వం చేశారు కానీ ముఖ్యమంత్రి తీరు ‘‘వాగు దాటే వరకు ఓడ మల్లన్న వాగు దాటినాక బోడ మల్లన్న’’ అన్న చందంగా ఉంటుంది.

ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మరొక  హామీ సైతం ఇచ్చారు. తన మాటలు  నమ్మిన దళితులు గుండుగుత్తగా వోట్లు వేసి తెరాస ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు.  అప్పుడు కొత్త విషయాన్ని తెరమీదకు తెచ్చి రాష్ట్రం ఇప్పుడే ఏర్పడింది అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, మిగతా రాష్ట్రాలతో పోటీ పడాల్సిన అవసరం ఉంది,  ఎవరు కూడా మన వైపు వేలెత్తి చూపి ఇదిగో ఇందుకే తెలంగాణ వద్దు అన్నాం అనే సందర్భం రాకూడదు. అందుకోసమే  నేను ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేస్తానని మాయమాటలు, నంగనాచి కబుర్లు చెప్పి ముఖ్యమంత్రి పీఠాన్ని  అధిష్టించారు. దళితులకు 3 ఎకరాల విషయంలో కూడా దళితులు వ్యవసాయం చేసి సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ది కావాలని,  అసెంబ్లీ లో సైతం లక్ష కుటుంబాలకు వెంటనే మూడెకరాల భూమిని అందిస్తామని అద్భుతంగా ప్రారంభించి అర్ధాంతరంగా కేవలం 6 వేల కుటుంబాలకు మూడెకరాల భూమి ఇచ్చి రాష్ట్రంలో భూమి లేదు అని కొత్త కథలు చెబుతూ ఆ పథకాన్ని కూడా ముగించాడు. దళితులు కూడా ముఖ్యమంత్రి ప్రకటనల అసలు రూపం తెలుసుకొని తమకు తాముగా వివిధ రంగాల్లో నిలదొక్కుకోవడానికి   ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలో మళ్ళీ ఒక నాడు 125 అడుగుల అంబేద్కర్‌ ‌విగ్రహాన్ని నిర్మిస్తానని అదేవిధంగా అంబేడ్కర్‌ ‌జయంతిని ఘనంగా అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఆ హామీని కూడా అటకెక్కించారు మళ్లీ సాక్షాత్తు  రాష్ట్రం సాకారమైన ఏడు సంవత్సరాల తర్వాత అంటే సాక్షాత్తు 84 మాసాలు గడిచిన తర్వాత ముఖ్యమంత్రి కి దళితులు మళ్లీ గుర్తొచ్చారు. ఆ వెంటనే అఖిల పక్ష సమావేశం నిర్వహించి దళితుల అభివృద్ధి కొరకు 1000 కోట్లు కేటాయించాం అని చెప్పి  అంతే కాకుండా హుజురాబాద్‌ ‌లో  పైలెట్‌ ‌ప్రాజెక్టుగా దళిత బంధు- ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అనే పథకం ద్వారా దళితులను అభివృద్ది చేస్తామని ప్రకటించి  దళిత బంధు అనే పథకాన్ని ఆర్భాటంగా ఆరంభించారు కానీ ఇదంతా దళితుల అభివృద్ది కోసం  కాదు కేవలం హుజురాబాద్‌ ‌లోని 40 వేల 292 వోట్ల కొరకు మాత్రమే ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకంగా చూస్తున్నారు.

ఇవి చాలవన్నట్లు నిన్న మొన్న మళ్ళీ కొత్తగా రాబోయే సంవత్సరం సంబంధించి వైన్‌ ‌షాప్‌ ‌టెండర్లలో పదిశాతం టెండర్లు దళితులకు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం  ఆ వెంటనే కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని కలవడం ధన్యవాదాలు తెలపడం ఇదంతా కూడా దళిత విద్యార్థులు యువకులు గమనిస్తున్నారనే విషయాన్ని  ప్రజా ప్రతినిధులు గుర్తుంచుకోవాలి. దళితులు ఇటువంటి పథకాలను కోరుకోవడం లేదు నిజమైన దళిత సాధికారతను కోరుకుంటున్నారు తమ కాళ్లమీద తాము నిలబడే విధంగా తమ సామర్థ్యం తమ నైపుణ్యాల ద్వారానే సమాజంలో తాము గుర్తింపబడే విధంగా ఎదగాలని కలలు కంటున్నారు అందుకొరకు కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించే విధంగా తన  మనవడు చదువుకున్న పాఠశాల స్థాయికి సమానంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ఇంజనీరింగ్‌ ‌కళాశాలలు, మెడికల్‌ ‌కళాశాల ఏర్పాటు చేసి చదువుకునే అవకాశం కల్పించాలని మరియు వాస్తవంగా దళితుల ఇంటిలో నుండి డబ్బులు పంపే  పరిస్థితులు దళిత కుటుంబాల్లో లేనందున పరిస్థితులకనుగుణంగా స్కాలర్షిప్లను ఇవ్వాలని మరియు చదువు ముగియగానే చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించుకునే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లను సమయానికి విడుదల చేయాలని కోరుకుంటున్నారు. తద్వారా దళితులు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్‌ ఆఫీసర్లు,  ఐపీఎస్‌ ఆఫీసర్లు, శాస్త్రవేత్తలుగా తమ నైపుణ్యాల ద్వారా సమాజంలో గుర్తింపబడతారు. కొంత మందికి ఉద్యోగాలు చేయడం కంటే ఉద్యోగాలు ఇవ్వడానికి ఆసక్తి ఉంటుంది. అటువంటి యువకులకు ఎస్సీ,  ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌  ‌ద్వారా రుణాలను దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ సమయానికి నిధులు విడుదల చేసి వారిని ఆర్థికంగా ఎదిగే విధంగా సహకరించాలని దళిత సమాజం కోరుకుంటుంది.  తద్వారానే దళిత సాధికారత సాధ్యమవుతుందని .. ఆర్థికంగా సాంస్కృతికంగా సామాజికంగా రాజకీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోగలరు. ఇలా దళిత సాధికారత సాధించిన మరుసటి నాడు దళితులే 3 ఎకరాల భూమిని కొనుక్కోగలరు.. వివిధ రంగాల్లో నిష్ణాతులు కాగలరు.. ప్రభుత్వానికి పన్నుల రూపంలో సైతం 10 లక్షలకు పైగా చెల్లించే విధంగా విజయం సాధించగలరు మరియు అంబేద్కర్‌ ‌విగ్రహాలనే కాదు అంబేద్కర్‌ ‌లాంటి మేథావులను సైతం నిర్మాణం చేసుకోగలరనీ  అంతేకాకుండా రాజ్యాధికారంలో సైతం భాగస్వామ్యమై, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మిగతా వర్గాలతో సైతం జీవించగలుగుతారు, అంతేగాని ఎన్నికలు వచ్చినప్పుడల్లా పథకాలను ప్రకటించి వాటిని సైతం పూర్తి చేయకుండా పదే పదే దళిత సమాజాన్ని అవమానపరచడం సబబు కాదని  ముఖ్యమంత్రి కి దళిత సమాజం హితవు పలికుతుంది. లేనియెడల దళిత సమాజం ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని హెచ్చరిస్తుంది.
–  జవ్వాజి దిలీప్‌,ఎం‌టెక్‌, ‌జెఎన్టీయు కూకట్‌పల్లి,
సామాజిక కార్యకర్త,7801009838.

Leave a Reply