Take a fresh look at your lifestyle.

కొరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వంపై విమర్శలా ?

  • అప్రమత్తతతోనే కేసుల సంఖ్యను తగ్గించాం
  • ఐసీఎంఆర్‌ ‌నిబంధనల మేరకే పరీక్షలు
  • కొత్తగా 6 కేసులు, మొత్తంగా 1044
  • వైద్య, ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌

కొరోనా విపత్తు సమయంలోనూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కొరోనా నియంత్రణకు అప్రమత్తతతో వ్యవహరించి కఠిన నిబంధనలు అమలు చేసిన కారణంగా రాష్ట్రంలో కేసుల సంఖ్యను తగ్గించగలిగామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం కొత్తగా రాష్ట్రంలో 6 కేసులు నమోదయ్యాయనీ, దీంతో మొత్తం కేసుల సంఖ్య 1044కు చేరుకుందన్నారు. వారిలో 552 మంది చికిత్స పొందుతున్నారనీ, తాజాగా 24 మంది వైద్య చికిత్సలు పొంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 464 మంది డిశ్చార్జి కాగా, 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. రాష్ట్రంలో తక్కువ పరీక్షలు చేస్తున్న కారణంగా తక్కువ కేసులు నమోదవుతున్నాయని చేస్తున్న విమర్శలలో నిజం లేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం కోరోనా బారిన పడి విలవిల్లాడుతున్నాయనీ, ఎలాంటి పరిస్తితినైనా ఎదుర్కునేందుకైనా సిద్ధంగా ఉండేలా సీఎం కేసీఆర్‌ అం‌దరినీ అప్రమత్తం చేశారని పేర్కొన్నారు.

కొరోనా పరీక్షల నిర్వహణలో ఐసీఎంఆర్‌ ‌స్పష్టమైన విధివిధానాలను రూపొందించిందనీ, ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయవద్దని సూచించిందని చెప్పారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు మాత్రమే పరీక్షలు చేయాలనీ, కోరోనా లక్షణాలు లేకుంటే ఇంట్లో ఉంచి చికిత్స అందించాలని నిర్దేశించిందన్నారు. ప్రతిపక్ష నేతలు బాధ్యత లేకుండా అనవసర ఆరోపణలు చేయవద్దనీ, కేంద్రం జారీ చేసిన విధివిధానాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కొరోనా పరీక్షలు ఎక్కడపడితే అక్కడ చేస్తే గందరగోళం తలెత్తి పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందనీ, ఈ కారణంగానే కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంర్‌ ‌మార్గదర్శకాలను రూపొందించిందని వెల్లడించారు. అలాగే, కొరోనా టెస్టులు, వైద్య చికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇచ్చిన పక్షంలో ఆసుపత్రులు బాధితుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందనీ, దీంతో ప్రైవేటు ఆసుపత్రులకు సైతం అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. లక్ష మందికి సైతం వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామనీ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కోరోనా బాధితులు 47 శాతం మంది వైద్య చికిత్సలతో కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. లాక్‌డౌన్‌ ‌కఠినంగా అమలు చేయకుంటే తెలంగాణ మరో కర్నూలు అయ్యేదన్నారు. మర్కజ్‌ ‌కేసులను బయటపెట్టి దేశాన్ని అప్రమత్తం చేశామని గుర్తు చేశారు. తెలంగాణలో 90 శాతం కేసులకు మర్కజ్‌ ‌లింకులే కారణమనీ, కొరోనా మరణాలు దాస్తే దాగేది కావని స్పష్టం చేశారు. మిగతా 22 మందికి కొరోనా పాజిటివ్‌గా ఎలా వచ్చిందో ట్రేస్‌ ‌చేస్తున్నామని సందర్భంగా ఈటల రాజేందర్‌ ‌తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!