Take a fresh look at your lifestyle.

నియంత్రిత సాగుపేరిట నిర్భంద వ్యవసాయమా?

  • విత్తన రాయితీలు కల్పించకుంటే రైతులకు లాభమేంటి
  • సన్నబియ్యాన్ని రేషన్‌షాపులలో అందించే ఏర్పాట్లు చేయాలి
  • పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

రైతును రాజును చేస్తానంటూ నియంత్రిత వ్యవసాయ విధానం పేరిట సిఎం కేసిఆర్‌ ‌రైతులపై నిర్బంద వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నాడని, రైతులకు అందించే విత్తనాలపై రాయితీలనే ఇవ్వకుండా రైతులను లాభాలబాట ఎలా పట్టిస్తాడో చెప్పాలని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, పట్టభద్రుల శాసన మండలి సభ్యులు తాటిపర్తి జీవన్‌ ‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. శుక్రవారం అయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. రైతులు అబ్బురపడేవిధంగా తీపికబురు చెబుతామంటున్నా కేసిఆర్‌ ‌రైతులకు, వినియోగదారులకు లాభంచేకూర్చెవిధంగా సన్నరకం వరిధాన్యాన్ని భారత ఆహార సంస్థ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వమే రూ. 2500లకు కొనుగోలు చేసి మిల్లింగ్‌ ‌చేసిన సన్నబియ్యాన్ని దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తే రైతులకు, వినియోగదారులకు,సామాన్యునికీ మేలుచేసిన వారవుతారని , విధానాన్ని అమలుచేస్తే బాధ్యత గల పౌరుడిగా కేసిఆర్‌ ‌కు పాలాభిషేకం చేస్తానని, ఈదిశలో చర్యలు చేపట్టాలని జీవన్‌ ‌రెడ్డి కేసిఆర్‌కు సవాల్‌ ‌చేశారు.

పత్తి పంట సాగు చేయాలని చెబుతున్న ప్రభుత్వం ప్రైవేటు విత్తన కంపెనీలకు పత్తిని వదిలేసిందని ఆరోపించారు. పండ్ల, కూరగాయల సాగుపై ప్రభుత్వం దృష్టి సారించాలని మెట్ట ప్రాంతాల్లో సూక్ష్మ బిందు సేద్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలనీ సూచించారు. కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుని పండ్ల తోటలు పెంపకానికి గత రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం రూ.230 కోట్ల నిధులు సమకూరిస్తే లక్ష్యాన్నిచేరుకోకపోగా ఆనిధులను వినియోగించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యానవన శాఖలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న 430 మంది ఉద్యోగులను తొలగించడంతో రైతులకు సలహాలిచ్చే వారు లేక పండ్ల తోటలు, సూక్ష్మ బిందు సేద్యం తగ్గిందని, తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని జీవన్‌ ‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి ఐకేపీ, ఫ్యాక్స్ ‌కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్ల నుంచి రైతులకు విముక్తి కలిగిస్తే కేసిఆర్‌ ‌ప్రభుత్వం రైతులను మిల్లర్లకు తాకట్టు పెట్టిందని జీవన్‌ ‌రెడ్డి వివరించారు. రైతులు, అన్నివర్గాల కోసం అబ్బురపడేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏమంచి కార్యక్రమం చేపట్టినా ఒక బాధ్యత గల పౌరుడిగా హర్షిస్తాని జీవన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈసమావేశంలో టిపిసిసి ఆర్గనైజింగ్‌ ‌కార్యదర్శి బండ శంకర్‌, ‌పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు కొత్త మోహన్‌, ‌మాజీ మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌గిరి నాగభూషణం, మున్సిపల్‌ ‌కాంగ్రెస్‌ ‌ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌కల్లెపల్లి దుర్గయ్య, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు దేవేందర్‌ ‌రెడ్డి, గాజుల రాజేందర్‌, ‌బండ భాస్కర్‌ ‌రెడ్డి, మ్యాదరి అశోక్‌, ‌పులి రాము, గంగం మహేష్‌, ‌మున్నా ఉన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!