Take a fresh look at your lifestyle.

బ్రిటిష్‌ ‌కాలం నాటి చట్టం ఇంకా అవసరమా?

“స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న బ్రిటిష్‌ ‌వలసపాలన కాలం నాటి,ప్రజాస్వామ్య దేశంలో హక్కులను కాలరాస్తున్న ఐ పి సి సెక్షన్‌ 124ఏ (‌రాజద్రోహం)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానం ఆ సెక్టన్‌ ఎం‌త దుర్వినియోగం అవుతుందో పేర్కొంటుంది.ఎప్పుడో బ్రిటిష్‌ ‌పాలన కాలంలో వారి వలస పాలనను కాపాడుకునేందుకు,స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేయుటకు తెచ్చిన రాజద్రోహ చట్టం 75 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో సజీవంగా ఉండడమే కాకుండా విపరీతంగా (98%) దుర్వినియోగం కావడం ప్రజాస్వామ్య విధానాలకు గొడ్డలిపెట్టు.”

దేశంలో కొరోనా మొదటి దశ కాలం నుంచి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియామకం అయిన తరువాత న్యాయశాఖ క్రియాశీలత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం సుప్రీంకోర్టుకు ప్రతిపాదనలు పంపించేటప్పుడు సామాజిక వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని,అణగారిన వర్గాలు, దళితులు, మహిళలు, మైనారిటీలకు తగిన ప్రాతినిధ్యం అవసరమని హైకోర్ట్ ‌ప్రధాన న్యాయమూర్తుల వీడియో కాన్ఫరెన్స్ ‌సమావేశంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొనడాన్ని బట్టి న్యాయ వ్యవస్థలో సామాజిక వైవిధ్యాలేమిని సుప్రీంకోర్టు గుర్తించినట్లయింది.ఈ మధ్యనే మరో తీర్పులో సోషల్‌ ‌మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ ‌చేశారని 2015లో రద్దైన, ప్రస్తుతం అమలులోలేని ఐటి చట్టంలోని సెక్షన్‌ 66ఏ ‌ప్రకారం కేసులు పెట్టడమేమిటని తీవ్రంగా వ్యాఖ్యనించింది. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న బ్రిటిష్‌ ‌వలసపాలన కాలం నాటి,ప్రజాస్వామ్య దేశంలో హక్కులను కాలరాస్తున్న ఐ పి సి సెక్షన్‌ 124ఏ (‌రాజద్రోహం)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానం ఆ సెక్టన్‌ ఎం‌త దుర్వినియోగం అవుతుందో పేర్కొంటుంది.ఎప్పుడో బ్రిటిష్‌ ‌పాలన కాలంలో వారి వలస పాలనను కాపాడుకునేందుకు,స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేయుటకు తెచ్చిన రాజద్రోహ చట్టం 75 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో సజీవంగా ఉండడమే కాకుండా విపరీతంగా (98%) దుర్వినియోగం కావడం ప్రజాస్వామ్య విధానాలకు గొడ్డలిపెట్టు.స్వాతంత్య్ర అనంతర ప్రారంభ కాలంలో దేశ విభజన నేపథ్యంలో విచ్ఛిన్నకార శక్తులున్న సందర్భంగా ఆ చట్టాన్ని కొనసాగించి ఉండవచ్చు.కానీ ఇంత దుర్వినియోగం కాలేదు.ఆ ఉద్దేశంతోనే అయ్యిండొచ్చు.

1966లో కేదారీనాథ్‌ ‌కేసులో సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టివేయకుండా పరిమితులు మాత్రమే విధించింది.కానీ తర్వాత కాలంలో కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో,యూపీఏ ప్రభుత్వ హయాంలో, ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఆ చట్టం పూర్తిగా దుర్వినియోగం అయ్యింది. కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా సందర్భాల్లో సెక్షన్‌ 124ఏ ‌ని దుర్వినియోగం చేశాయి. ప్రస్తుతం ఈ చట్ట దుర్వినియోగం పరాకాష్టకు చేరింది.ఈ చట్టం ద్వారా పెడుతున్న కేసులు ప్రస్తుతం 25% పెరిగాయని, దానిలో 98% ఎటువంటి ఆధారాలు లేని, కోర్టులో నిలబడలేని కేసులని తెలుస్తుండడాన్ని బట్టి చూస్తే ఆ చట్టం ఎంత కుట్రపూరితంగా ఉపయోగిస్తున్నారో, ప్రజాస్వామ్య హక్కులను ఎలా కాలరాస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మన దేశాన్ని ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటాం,కానీ మనలాంటి ప్రజాస్వామ్య దేశాలైన బ్రిటన్‌, ‌స్కాట్లాండ్‌, ‌దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌, ఇం‌డోనేషియా లాంటి దేశాల్లో ప్రస్తుతం ఈ చట్ట ఛాయలే లేవు. అమెరికా, ఫ్రాన్స్, ‌జర్మనీ, ఆస్ట్రేలియాలలో ఈ చట్ట స్వరూపమే పూర్తిగా వేరు.ఆయా ప్రజాస్వామ్య దేశాల్లో ఈ చట్టాలు లేకపోవడాన్ని, వాటి స్వరూపాలు పూర్తిగా వేరుగా ఉండడాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాం? రాచరిక, నియంతృత్వ, మతపరమైన దేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్‌, ‌సుడాన్‌, ‌సెనెగల్‌, ‌టర్కీ లాంటి దేశాల్లో మాత్రమే ఇటువంటి చట్టాలు ఉన్నాయి.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ పౌరులమైన మనం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలను ఆదర్శంగా తీసుకుందామా లేక రాచరిక ,నియంతృత్వ, మతపరమైన దేశాలను ఆదర్శంగా తీసుకుందామా తేల్చుకోవాలి.భారతదేశ ప్రజాస్వామ్యానికి తలమానికమైన, భావప్రకటన స్వేచ్ఛను ప్రసాదించే ఆర్టికల్‌ 19(1) (ఏ)‌ను, సమానత్వాన్ని కల్పించే ఆర్టికల్‌ 14 ‌ను, జీవించే హక్కును ప్రసాదించే ఆర్టికల్‌ 21 ‌ని కాలరాస్తున్న బ్రిటిష్‌ ‌వలస పాలన కాలం నాటి ఈ చట్టం ఇప్పటికీ ఎవరి ప్రయోజనాల కోసం కోనసాగించాలి? టాడా, పోటాలాంటి చట్టాలు ఎలా దుర్వినియోగం అయ్యాయో అనుభవపూర్వకంగా తెలిసిన తర్వాత కూడా ఈ చట్టం కొనసాగింపు అవసరమా? కార్యనిర్వాహక వర్గానికి ఎటువంటి బాధ్యత లేని ఈ చట్టాల వల్ల అభాగ్యులు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటునారో ప్రతేక్షంగా చూస్తున్న ఈ చట్టాన్ని కొనసాగిద్దామా?ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడే సంఘాలపై, జర్నలిస్టుల పై, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులపై, పర్యావరణ కార్యకర్తల పై చివరకు రైతులపై ఈ చట్టాలను ఉపయోగిస్తున్నారంటేనే ఎంత దుర్వినియోగం అవుతుందో చెప్పవచ్చు.

మొత్తం చట్టమే రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు అటార్నీ జనరల్‌ ఈ ‌చట్టాన్ని రద్దు చేయకుండా మార్గదర్శకాలు కోరడం ఎంతవరకు సమంజసం? పిచ్చోని చేతిలో రాయిలా మారిందని, రంపం ఇచ్చి చెట్టును మాత్రమే కోయమంటే మొత్తం అడవినే నిర్మూలిస్తే ఎలా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఘాటైన వ్యాఖ్యలు చేసిన కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు పట్టించుకోవా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రభుత్వాలు గుర్తించాలి.ఈ చట్టం పై ఇప్పటికే సమాజంలో విస్తృతంగా చర్చ జరిగింది, జరుగుతూనే ఉంది.ఇక మిగిలింది పార్లమెంటులో మాత్రమే. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ చట్టంపై పార్లమెంట్‌ ‌లోపల చర్చ జరగాలి. ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఆదర్శమని చెప్పుకుంటున్న మన దేశంలో ఇటువంటి చట్టాలకు తావులేదని వెంటనే రద్దు చేయాలి. ఆ దిశగా పార్లమెంటులో చర్చ జరుగుతుందని ఐపీసీ సెక్షన్‌ 124ఏ ‌రద్దు అవుతుందని ఆశిద్దాం.

– జుర్రు నారాయణ యాదవ్‌,
‌మహబూబ్నగర్‌, 9494019270.

Leave a Reply