- అక్కడికి వెళ్లకుండా ఆంక్షలు ఎందుకు
- పాదయాత్రతో అక్రమాలు బయట పడతయనే అడ్డుకునే యత్నాలు
- మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- హైకోర్టు సూచనల మేరకే నేటి నుంచి యాత్ర : బిజెపి
భైంసాకు ఎందుకు వెళ్లకూడదో టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. భైంసాకు వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? పర్మిషన్ తీసుకోవాలా? భైంసా ఈ దేశంలో, తెలంగాణలో లేదా? అని ప్రశ్నించారు. అసలు భైంసాలో అల్లర్లు సృష్టించింది ఎవరో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. భైంసా అల్లర్లలో గాయపడ్డ వారిని ఆదుకున్నదెవరు? అమయాకుల ఉసురు తీసిందెవరు? పీడీ యాక్ట్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందెవరో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. తాను భైంసాలో పాదయాత్ర చేస్తే ఇవన్నీ బయటకొస్తాయనే భయంతోనే అక్కడికి వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. పాతబస్తీలో పాదయాత్రను ప్రారంభించామని..భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద నుండి పాదయాత్ర చేస్తే అల్లర్లు జరిగాయా? ప్రశాంతంగా యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు కొమ్ముకాస్తుందని… మజ్లిస్ నేతలు చెప్పినట్లు నడుస్తుందన్నారు. కేసీఆర్ ఫ్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదన్నారు.
పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసు కుంటామని.. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ వారికి భరోసా కల్పిస్తామన్నారు. యాత్ర ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించాలనుకున్నాం కానీ..పూజలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు. పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. మొదట సభ నిర్వహించుకోవాలని అనుమతిచ్చి… ఆ తరువాత కుంటి సాకులతో అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 4 విడతలుగా ప్రజాసంగ్రామ యాత్రను ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్దంగా కొనసాగించామని తెలిపారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో పాదయాత్రను అడ్డకునేందుకు యత్నించిందన్నారు. అందుకే హైకోర్టుకు వెళ్లామని..న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తామని బండి సంజయ్ తెలిపారు. అందులో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వెళుతున్నానని బండి సంజయ్ తెలిపారు. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తామని… అక్కడినుండే లాంఛనంగా పాదయాత్రను ప్రారంభిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. భైంసా ప్రజల నుండి బండి సంజయ్‌ను దూరం చేయలేరని చెప్పారు.
హైకోర్టు సూచనల మేరకే నేటి నుంచి యాత్ర : బిజెపి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదోవిడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం ప్రారంభం కావల్సిన పాదయాత్రను మంగళవారానికి వాయిదా వేసినట్లు ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి ప్రకటించారు. హైకోర్టు సూచనల మేరకు సభ, పాదయాత్రను రీషెడ్యూల్ చేసినట్లు చెప్పారు. బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేయడంతో న్యాయస్థానం సూచనల మేరకు సభ నిర్వాహణ, పాదయాత్ర ప్రారంభానికి సమయం లేకపోవడంతో బీజేపీ నేతలు పునరాలోచనలోపడ్డారు. చివరకు బహిరంగ సభతో పాటు పాదయాత్రను మంగళవారం ప్రారంభించాలని నిర్ణయించారు.
కోర్టు సూచనల మేరకే పాదయాత్ర నిర్వహిస్తామని మనోహర్ రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కుటుంబ పాలనను నిలదీస్తూ ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతుండటంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మనోహర్ రెడ్డి ఆరోపించారు. గతంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సభను అడ్డుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఐదో విడత పాదయాత్ర కోసం 10 రోజుల క్రితమే అనుమతి పత్రాలు ఇచ్చినా పోలీసులు సభకు ఒక్క రోజు ముందు పర్మిషన్ రద్దు చేశారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర జరుపు కునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టుకు మనోహర్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు.