అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పదవిని స్వీకరించిన నెల రోజుల్లోనే తన అధికారాన్ని దిటవు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన అంతర్జాతీయ శక్తిగా ఎదిగేందుకు భారత్ సాగిస్తున్న యత్నాలను అభినందించారు. ఆర్థిక రంగంలో, రక్షణ రంగంలో శరవేగంగా ఎదిగేందుకు భారత్ సాగిస్తున్న యత్నాలకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. శుక్రవారం నాడు ఆయన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కి ఫోన్ చేసి చైనా అనుసరిస్తున్న నిర్బంధ విధానాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరోక్షంగా ఆయన భారత్ ని సమర్ధిస్తూనే ఈ హెచ్చరిక చేసినట్టు కనిపిస్తోంది. చైనా అనుసరిస్తున్న విధానాలను నిరంతరం పరిశీలించేందుకు త్వరలోనే ఒక టాస్క్ ఫోర్స్ ను బిడెన్ ఏర్పాటు చేయనున్నట్టు పెంటగాన్ ప్రకటించింది. చైనా ఇటీవల కాలంలో సరిహద్దు ప్రాంతాల్లోకి చొచ్చుకుని వెళ్ళడం,ఇతర దేశాల భౌగోళిక పరిసరాలను ఆక్రమించడం వంటి అంశాలను కొనసాగిస్తున్న దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు బిడెన్ ఈ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. చైనా అగ్రరాజ్యానికి దీటుగా అన్ని రంగాల్లో దూసుకుని పోయేందుకు చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు కానీ, పొరుగున ఉన్న దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే రీతిలో చర్యలు తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించడమే బిడెన్ ఉద్దేశ్యమై ఉంటుంది.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాదిరిగా చైనాపై పబ్లిగ్గా ఆరోపణలు, వ్యాఖ్యలు చేయకుండా అధికారికంగా చర్యలు తీసుకోవాలని బిడెన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో అధ్యక్షుడు మారిన తర్వాత విదేశాంగ విధానంలో మార్పులు రావడం సహజం.అయితే, మౌలికంగా ఆ దేశం అనుసరిస్తున్న విధానాల్లో మాత్రం ఎటువంటి మార్పు వుండదు. చైనా విషయంలో ట్రంప్ కొంత అతిని ప్రదర్శించి తాను చులకన కావడమే కాకుండా, అమెరికా పట్ల తేలిక భావం ఏర్పడేట్టు చేశారు. ఇప్పుడు బిడెన్ దిద్దుబాటు చర్యల ద్వారా అమెరికాకు అన్ని దేశాల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభించేట్టు చర్యలు తీసుకుంటున్నారు. ట్రంప్ ప్రవేశపెట్టిన ట్రావెల్ బ్యాన్ వల్ల ఇస్లామిక్ దేశాల్లో అమెరికా పట్ల గుర్రు పెరిగింది.దానిని సరిచేసేందుకు బిడెన్ ఆ బ్యాన్ ని ఎత్తివేశారు.అలాగే, మెక్సికో తో సరిహద్దు గోడ నిర్మాణం విషయంలో కూడా ట్రంప్ నిర్ణయాన్ని తిరగతోడారు. అమెరికా పట్ల అన్ని దేశాల్లో జుగుప్స, అసూయ కలగకుండా చూసేందుకు బిడెన్ చర్యలు తీసుకుంటున్నారు. హెచ్ -1 బి వీసాల విషయంలో సరళతరంగా వ్యవహరిస్తామని చెప్పినప్పటికీ, గ్రీన్ కార్డుల వ్యవహారం తేలే వరకూ దానిని పక్కన పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, పాలనా యంత్రాంగంలో ప్రవాస భారతీయులకు పెద్ద పీట వేసి భారతీయుల సేవలను గరిష్టంగా వినియోగించుకునేందుకు ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
హాంకాంగ్, తైవాన్ ల పై ఆంక్షలు, దాడులకు తెగబడటాన్ని బిడెన్ తప్పు పట్టినట్టు తెలుస్తోంది. జిన్ పింగ్ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు చైనా రాజ్యాంగంలో చాలా మార్పులు చేశారు. హాంకాంగ్, తైవాన్ లపై ఆంక్షలు ప్రకటించడం, టిబెటన్లపై ఆంక్షలు విధించడం అందులో కొన్ని. అంతేకాకుండా హాంకాంగ్ లో జిన్ పింగ్ కి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. అలాగే, తైవాన్ లో కూడా తైవాన్ అధ్యక్షురాలు బహిరంగంగానే తమ అంతరంగ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చైనాని హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య భద్రత, కోవిడ్ -19 నియంత్రణ, వ్యాక్సిన్ సరఫరా, మొదలైన అంశాలపై జిన్ పింగ్ తో బిడెన్ మాట్లాడినట్టు వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా అనుసరిస్తున్న విధానాలపైనే,ముఖ్యంగా డ్రాగన్ కు కళ్ళెం వేసే అంశంపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. తైవాన్ విషయంలో చైనా అనుసరిస్తున్న దూకుడును అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలో సెంకాకు దీవుల విషయంలో చైనా అనుసరిస్తున్న చొరబాటు ధోరణి పట్ల తీర ప్రాంతంలోని దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చైనాకు బ్రేక్ వేయడానికి జపాన్, ఆస్ట్రేలియా., దక్షిణ కొరియా వంటి దేశాలతో బిడెన్• మాట్లాడారు.
భారత్ పట్ల చైనా అనుసరిసతున్న దుందుడుకు విధానానికి కళ్ళెం వేయడానికి బిడెన్• చేసిన హెచ్చరిక ఫలించినట్టుగా కనిపిస్తోంది. లడఖ్ తూర్పు ప్రాంతంలోని గాల్వాన్ లో చైనా తన సేనలను ఉపసంహరించుకోవడం గుణాత్మకమైన మార్పు. అలాగే, దలైలామా వారసుని ఎంపిక విషయంలో చైనా జోక్యం చేసుకోవడాన్ని కూడా అమెరికా వ్యతిరేకిస్తోంది.ఇది పూర్తిగా టిబెటన్ల్ అంతర్గత వ్యవహారమని అమెరికా స్పష్టం చేసింది. దలైలామా విషయంలో చైనా ఇప్పటికీ ధూర్తంగా వ్యవహరించడాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది. చైనాతో వాణిజ్యం విషయంలో ట్రంప్ మాదిరిగా చీటికీ మాటికీ తగవులు పెట్టుకోకుండా దృఢంగా వ్యవహరించాలని బిడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద అమెరికాలో కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు,వేస్తున్న అడుగులు భారత్ కి అనుకూలంగానే ఉన్నాయి. వాటిని భారత్ పూర్తిగా వినియోగించుకోవాలి. ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్ కి సన్నిహితుడన్న అభిప్రాయం అమెరికన్లలో బలపడింది. దానిని చెరిపి వేసుకునేందుకు చర్యలు తీసుకోవల్సి ఉంది. అమెరికా అనుసరిస్తున్న విధానాల్లో రాగల రోజులలో పెను మార్పులు సంభవమని అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.