- ఇదే విధానాన్ని పంజాబ్‌లోనూ అమలు చేస్తాం
- కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్‌ను సందర్శించిన పంజాబ్ సిఎం భగవంత్ మాన్
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : నీటి పారుదల రంగంలో తెలంగాణ మోడల్‌గా ఉందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల విధానాన్ని పంజాబ్‌లో కూడా అమలు చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా మర్కుక్ పంపు హౌజ్‌ను, కొండపోచమ్మ సాగర్‌ను సీఎం భగవంత్ మాన్ పరిశీలించారు. తెలంగాణలోని అన్ని వనరులు పంజాబ్‌లోనూ ఉన్నాయన్నారు. అక్కడ కూడా సాంకేతికను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. తెలంగాణలో కాల్వల ద్వారా పంటలు పండించడం పై హర్షం వ్యక్తం చేశారు. పంజాబ్‌లో బావులు, బోర్లతోనే పంటలు ఎక్కువగా పండుతాయన్నారు. పంజాబ్‌లోనూ కాల్వలను నిర్మించి వ్యవసాయానికి సాగునీరు అందిస్తామన్నారు.
దేశ వ్యాప్తంగా రైతులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని సీఎం భగవంత్ మాన్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి అన్నదాతలు దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు కూడా నిర్వహించారని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. అయినా 80 శాతం మంది వ్యవసాయమే చేస్తున్నారని…రైతుల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌ను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
కాళేశ్వరం నుంచి 618 వి•టర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్ ఉన్నదని, 15 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. ఇది 2,85,280 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని వివరించారు. అనంతరం కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్‌ను, తొగుటలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టును సీఎం భగవంత్‌సింగ్ మాన్ సందర్శించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి గురించి తెలుసుకున్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌తోపాటు గజ్వేల్ పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్‌డ్యామ్‌లను పరిశీలించారు. అనంతరం హైదరాబాద్‌కి తిరిగి పయనమయ్యారు.