Take a fresh look at your lifestyle.

‘‘ ‌పట్టింపులేని ప్రజారోగ్యం’’

గోరంత నిర్లక్ష్యం కొండంత  సమస్యకు దారి తీస్తుంది అంటారు పెద్దలు. ఆ ఏమి కాదులే అని  సర్ది పెట్టు కోవటంలోనే పెద్ద ప్రమాదం తలె త్తుతుంది. అదే పరిస్థితి ఇబ్రహీంపట్నం లో కుటుంబ నియంత్రణ క్యాంపులో ఆపరేషన్‌ ‌వికటించి 30 సంవత్సరాల లోపు ఐదుగురు యువతుల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గత  ఆగస్టునెల 25వ తేదీన 34 మందికి ఇబ్రహీంపట్నం లోని ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ  శిబిరం నిర్వహించారు. ఈ కుటుంబ నియంత్రణ శిబిరంలో కొద్ది పాటి నిర్లక్ష్యం  పేదల ప్రాణాలను  హరించి వేసింది. తినడానికి తిండి లేని పరిస్థితిలో, కనీస అవసరాలు తీర్చుకునే స్థాయి కూడా లేని, వైద్య సదుపాయాలు కొనుక్కోలేని అమాయక పేద యువతులు ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ ‌చేయించుకోవాలని, చేయించుకుంటే కొంత ఇన్సెంటివ్‌ అం‌దుతుందని ఆశతో వచ్చి ప్రాణాలర్పించినారు.  పేదల ప్రాణాల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వారి పసిబిడ్డలకు తల్లులను లేకుండా చేసి0ది.   పాలు కూడా మరవని పసిపిల్లల  ఆర్తనాదాలు మిన్నంటాయి. పేదల ప్రాణాల పట్ల అంత చులకనా? శస్త్రచికిత్స  జరిగే ముందు  ప్రతి పరికరం,  ఆపరేషన్‌ ‌థియేటర్‌ ‌లోవాడే ప్రతి  వస్తువును, సర్జరీ డ్రెస్‌, ‌బెడ్షీట్‌  ‌సైతం ప్రతిదీ  స్టెరిలైజ్‌ ‌చేసి వాడాలి, ఇది ప్రాథమిక అంశం. ఇట్టి విషయాన్ని ఆ చికిత్సలో పాల్గొనే సిబ్బంది సిస్టర్‌ ‌నుంచి  డాక్టర్‌ ‌వరకు  ప్రతి వారు సమీక్షించుకోవాలి.

ప్రత్యేక పరిస్థితుల్లో క్యాంప్‌ ‌నిర్వహణ చేస్తున్నప్పుడు పరికరాలను స్టెరిలైజ్‌ ‌చేయకపోవడం ఏమిటి?  ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వైరస్లు, బ్యాక్టీరియాలతో పాటు  కొరోనా, వోమి క్రాన్‌, ‌మంకీ పాక్స్, ‌టమాటో ఫ్లూలాంటి  మహామ్మరిలు  విజృంభిస్తున్న వేళ, సర్జరీకి వాడే   పరికరాలను ముందు జాగ్రత్త చర్యగా స్టెరిలైజ్‌ ‌చేయాల్సిన తరుణంలో అంతులేని నిర్లక్ష్యం వహించడ0 హాస్పిటల్‌ ‌సిబ్బంది మెడికల్‌  ఎథిక్స్ ‌కు విరుద్ధం కూడా.  ఇప్పటికీ అప్రమత్తమై మిగతా వారిని  ఇతర హాస్పటల్లో మెరుగైన వైద్యం కోసం చేర్పించడం  వల్ల  వారి ప్రాణాలు నిలకడగా ఉన్నాయి. ఈ సంఘటన సంభవించి   ఐదుగురి యువతుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిన తర్వాత వైద్యశాఖ అప్రమత్తమై హుటాహుటిన హాస్పిటల్‌ ‌ను సందర్శించి, ఆ సంఘటనపై దర్యాప్తు చేయడానికి కమిటీ వేసినట్టు ప్రకటనలు ఇవ్వడం, కమిటీ రిపోర్టు  తెప్పించుకోవడం  చకచక జరిగిపోయాయి. ప్రతిపక్షాలకు చేతినిండా పని దొరకడం,   స్వపక్షాలు ముఖం చాటేయడం, దానికి సంబంధించిన వారు ఎవరో ఒకరు విచ్చేసి జరిగిన సంఘటన బాధాకరం, మరోసారి జరగనీయకుండా చూడటం మా బాధ్యత అని ఎంతోకొంత దాతృత్వాన్ని చాటి ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోవడం ప్రతి విషాద ఘటన వెనుక ఉన్న ఇతివృత్తం. ఇలా పై పై  చర్యలు తీసుకున్నంత మాత్రాన,   ఎక్స్గ్రేషియా చెల్లించనంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావు..  సంఘటనలు జరగకుండా,  జరుగక ముందే శాఖాపరంగా  తగిన బాధ్యతలు ,రక్షణ చర్యలు చేపట్టాలి.  దర్యాప్తులు  నిజాయితీగా జరపాలి.

నిజానికి ఏ వ్యక్తికైనా వ్యాధి  సంక్రమించినప్పుడు హాస్పిటల్‌ ‌కి  వెళ్లడం సహజం. డబ్బున్న వారైతే ప్రవేటు హాస్పిటల్కు,  బాగా ధనవంతుల అయితే కార్పొరేట్‌  ‌హాస్పిటల్కు, పేదలు సర్కార్‌ ‌హాస్పిటల్‌  ‌మెట్లు ఎక్కడం పరిపాటి. ప్రభుత్వ ఆస్పిటల్లకు వచ్చే సామాన్య జనాల పట్ల సరి అయిన ఆదరణ చూపాలి. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరూ,  సామాన్య ప్రజల పట్ల సామాజిక స్పృహతో వ్యవహరించాలి. వారి  వల్లనే  ఉద్యోగాలు మనుగడలో ఉంటాయని, వారు చెల్లించేటువంటి  పన్నుల ద్వారానే వేతనాలు అందుతున్నాయి అనే విషయాన్ని మర్చిపోరాదు. ఈ దేశంలో   విచిత్రం ఏమిటో ముందు జాగ్రత్త చర్యలకు బదులు,, సంఘటనల తీరుతెన్నుల తర్వాత ప్రభుత్వాలు పౌర సమాజం,   స్పందిస్తుంది. ఎక్స్గ్రేషియా రూపేనా ఖర్చు చేయడం జరుగుతుంది. దానికి బదులుగా సరిపడా నిధులు కేటాయించకపోవడం విడ్డూరం. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారందరికీ  స్టెఫీలో  కోకస్‌ ‌బ్యాక్టీరియా సోకినట్లు గుర్తించారు .లాపెరోస్కోపిక్‌ ‌హోల్‌ ‌రింగ్స్ ‌చుట్టూరా చీము చేరిందని , ఈ లెక్కన సర్జరీలకు ముందే సర్జరీ  జరిగే ఆపరేషన్‌ ‌థియేటర్‌, ‌శస్త్ర చికిత్స పరికరాల అన్నింటిని   ఇథలీన్‌ ఆక్సైడ్తో సరిగ్గా స్టెరిలైజేషన్‌ ‌జరపలేదనే  తెలుస్తుంది.స్టెరిలైజేషన్లో లోపాల వల్లే  మహిళలకు ఇన్ఫెక్షన్‌ ‌గురైనట్లు వైద్య శాఖ కూడా ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. గత నెల 25 తారీకు ఉదయం తొమ్మిదింటికి మహిళలు వచ్చిన, మధ్యాహ్నం 12 గంటల తర్వాత సర్జరీ చేయాల్సిన డాక్టర్‌ ‌వచ్చిన పిదప ఒంటిగంటకు  ఆపరేషన్లు ప్రారంభించి రెండు గంటల కల్లా  34 మందికి సర్జరీ చేయడం జరిగింది.

మొత్తం మూడు సెట్ల లాప్రోస్కోపిక్‌ ఎక్విప్మెంట్‌ ‌వాడారు. ఒక సర్జరీ తర్వాత 20 నిమిషాలు ఎక్యుప్మెంట్ను స్టెరిలైజ్‌ ‌చేయాలి. ఆరోజు మూడు నుంచి నాలుగు నిమిషాలు మాత్రమే  స్టెరిలైజ్‌ ‌చేయడానికి టైమ్‌ ‌దొరికింది. నిబంధనల  ప్రకారం  శస్త్ర చికిత్స జరిగే ప్రాంతం, ఆపరేషన్‌ ‌థియేటర్ను  ముందుగానే ఫార్మలిన్‌ ‌కెమికల్‌ ‌తో ఫ్యుమిగేషన్‌  ‌చేయాలి. సర్జరీకి ముందే లాప్రోస్కోపిక్‌ ‌పరికరాల అన్నింటిని ఇథలిన్‌ ఆక్సైడ్‌ ‌తో  శుభ్రం చేసి స్టెరిలైజేషన్‌ ‌చేయాలి. శస్త్రచికిత్సలో పాల్గొనే డాక్టర్‌,  ‌నర్సులు  మరియు ఆపరేషన్‌ ‌థియేటర్‌ అసిస్టెంట్లు శుభ్రంగా చేతులు కడుక్కుని  గ్లౌజులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ సక్రమంగా జరిగిన పరిస్థితులు లేవు. దీంతో  ఐదుగురి మహిళల ప్రాణాల రూపేనా  మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై  మానవ హక్కుల కమిషన్‌ ,   ‌జాతీయ మహిళా కమిషన్‌ ‌కూడా తీవ్రంగా స్పందించాయి.  ఇలా ఉండగా మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రంలో  అనారోగ్యంతో బాధ పడుతున్న బాలుని  చికిత్సకోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తే, డాక్టర్లు లేకపోవడంతో ఎవరు పట్టించుకోక ఆస్పత్రి బయటనే  విగత జీవిగా మారాడు.

అస్సాంలో  ఒక గర్భిణీ స్త్రీ నొప్పులతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే,  అక్కడి  గైనకాలజీ డాక్టర్‌  ‌సరిగ్గా పరీక్షించు కుండానే ఆపరేషన్‌ ‌చేసి, పిండం అభివృద్ధి చెందలేదని మళ్లీ లోపల పెట్టి కుట్లు వేయడం జరిగింది…  చెయ్యి విరిగిందని   చికిత్సకు వస్తే బాలుడి ప్రాణం  పోయిన ఘటన  వరంగల్‌ ఎం‌జీఎం ఆస్పత్రిలో చోటుచేసుకోవడం విషాద కరం. ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక చోట ప్రజారోగ్యంపై నిర్లక్ష్యపు నీడలు   అలుముకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశాయి ..  కొన్ని రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులు ,అపరిశుభ్రత పరిసరాలు దోమలవృద్ధి,కలుషితమైన నీరు మొదలైన వాటి వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు  ప్రతి ఇంట్లో ఒంటి నొప్పులు ,వైరల్‌ ‌ఫీవర్‌ ‌లతోపాటు డెంగ్యూ ,మలేరియా , టైపాడ్‌ ‌బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది.

రోగుల తాకిడితో ప్రభుత్వ గ్రామీణ వైద్యుల ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.  విష జ్వరాలు  విపరీతం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు సరిపోవడం లేదు .వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. కాలానుగుణంగా వచ్చే వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతున్నారు.  వాటిని తట్టుకోవడానికి ప్రజా ఆరోగ్యాన్ని పటిష్టంచేయాలి.ప్రతి వానాకాలంలో దోమల నివారణకు చేపట్టవలసిన కార్యక్రమాల అమల్లో శ్రద్ధ లేకపోవడం, నీరు నిల్వ ఉన్న  ప్రాంతంలో నాఫ్తాలిన్‌  ‌గోలీలు వేయడం, కిరోసిన్‌ ‌పిచికారి చేయడం,  ఇండ్లల్లో దోమల మందు పిచికారి చేయడం, మారుమూల గిరిజన ప్రాంతాలలో  దోమతెరలు పంపిణీ చేయడం లాంటివి సక్రమంగా నిర్వహించడం లేదు. దోమకాటు ద్వారా సంభవించే మలేరియా , డెంగ్యూ ,  చికున్‌ ‌గన్యా వ్యాధులు భారత్లోనే అధికం. ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషకుల ప్రకారం ప్రపంచంలోని మొత్తం డెంగ్యూ కేసులలో 34%, మలేరియా కేసుల్లో 11 శాతం ఇండియాలోనే నమోదవుతున్నాయి. కలుషితమైన నీటిని తాగడం వల్ల భారత్‌ ‌లో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది.ప్రభుత్వ ఆసుపత్రులు అధునాతన సౌకర్యాలతో,  అన్ని రకాల లాబరేటరీల, డయాగ్నస్టిక్‌ ‌సెంటర్ల వసతులు కల్పించాలి.  వైద్య సిబ్బందిని,  డాక్టర్లను , నర్సులను తగినంతగా నియమించాలి. కానీ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల వైద్య సౌకర్యాలు సామాన్యులకు ఆశించినంతగా ఆశాజనకంగా అందడం లేదు. తక్షణమే సరిపడా నిధులు కేటాయించి ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేయాలి.

దేశంలో 70 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రిలపై ఆధార పడుతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు చికిత్స పేరిట ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయి . దీంతో అప్పులపాలవుతున్నారు. వైద్య ఖర్చుల వల్ల ప్రతి ఏడాది ఆరు కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి  నెట్టివేయబడుతున్నారు . దేశంలో ప్రజల ఆరోగ్యం మీద వ్యాపారం విపరీతంగా మారిపోతుంది. 2022 సంవత్సరానికి 372 మిలియన్‌ అమెరికన్‌ ‌డాలర్ల అనగా 29 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరగనుందని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. దీనిని బట్టి వైద్యం ఎంత ఖరీదు అయిందో అర్థం చేసుకోవచ్చు.రాష్ట్రంలో గానీ దేశంలో గాని ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టంగా లేదు.   ప్రజలను ఆదుకోవాల్సిన రీతిలో  ఆదుకోవడం లేదు.  కోవిడ్‌ ‌కల్లోలంలో ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన పడకలు, ఆక్సిజన్‌ ‌వసతులు, సిబ్బంది, మందులు లాంటివి సరిపడా లేకపోవడం వల్ల వేలాది మంది పిట్టల  వలె రాలిపోయారు. ప్రతి ఒక్కరికి గాంధీ హాస్పిటల్‌ ‌లో  వైద్య సౌకర్యాలు అందిస్తామని ఒకవైపు చెబుతూనే, మరోవైపు పాలకవర్గాలు అధునాతనమైన సౌకర్యాలు గల ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు.  సామాన్యుల ఆరోగ్యానికి ప్రభుత్వాలు ప్రత్యేకమైన చర్యలు  ఏమి చేపట్టకపోవడంతో, వివిధ రకాల జబ్బులతో  బాధపడుతున్న రోగులు వైద్యం చేయించుకోలేక ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించడం, అక్కడ వారికి సరైన వైద్యం అందించే  పరిస్థితులు, డాక్టర్ల  కొరత ఉండటంతో  ఆరోగ్యశ్రీపథకం ద్వారా అందే మొత్తం సరిపోకపోవడంతో  సీఎంఆర్‌ఎఫ్‌ ‌కులైన్లు కడుతున్నారు. అవి కూడా సకాలంలో అందక  ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు ఆరోగ్య రంగంపై బడ్జెట్‌ ‌కేటాయింపులు తగ్గించాయి. ఇతర దేశాల వలె ఆరోగ్య బీమా సౌకర్యం కూడా పెద్దగా లేదు.

ప్రభుత్వ ఆస్పత్రులలో డాక్టర్లు ఇతర సిబ్బంది నియామకాలు లేక ఖాళీలు ఉండడంతో, ఉన్నవారిపై ఒత్తిడి,భారం పెరగడంతో జరగరాని అనర్ధాలు జరుగుతున్నాయి.  పాలక పెద్దలు  ప్రజా సంక్షేమమే  మా ధ్యేయమంటూ, ప్రజల ఆరోగ్యం పట్ల  శ్రద్ధ, బాధ్యత వహించి పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు  అనారోగ్యంతో విలవిలలాడుతున్నారు. వివిధ వ్యాధులతో కోట్లాది మంది ప్రజలు దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వాలు రాజకీయ క్రీడలో తలమునకలు కావడం విచారకరం. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రులను  బలోపేతం చేసి, ఆరోగ్య రంగానికి ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులు  ఐదు రెట్లు పెంచి , అన్ని రకాల వ్యాధులను డెంగ్యూ టైపాడ్‌ ‌లతో సహా  ఆరోగ్య శ్రీ లో చేర్చి ఉచితంగా   వైద్య సదుపాయం అందించాలి. విద్య వైద్యం ప్రైవేట్‌ ‌రంగం చేతిలోకి పోయాక సాధారణ ప్రజలకు అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.  మొత్తం184 దేశాల్లో ప్రజారోగ్య సంరక్షణ  విషయంలో భారత్‌ 147‌వ స్థానంలో వుంది.ఉచిత వైద్యాన్ని,విద్యను సక్రమంగా అందించిన అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితం అవుతుంది, అప్పుడే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని  పాలకవర్గాలు గ్రహించి, ఆ దిశగా ప్రజల సంక్షేమం కోసం పాటు పడతాయని   ఆశిద్దాం….

image.png
తండ సదానందం
టి పీ టీ  ఎఫ్‌ ‌రాష్ట్ర కౌన్సిలర్‌, ‌మహబూబాబాద్‌.

Leave a Reply