72 నకిలీ పాస్‌పోర్టు గుర్తింపు..పోలీసుల ప్రమేయంపై ఆరా
హైదరాబాద్, మార్చి 1: బోధన్ పాస్‌పోర్టుల కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. దేశానికి అక్రమంగా వొచ్చిన బంగ్లాదేశీయులు తప్పుడు చిరునామాలు, ధ్రువీకరణలతో పాస్‌పోర్టులు పొందడాన్ని కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. స్థానికుల సహకారంతో…ఇప్పటి దాకా మొత్తం 72 పాస్‌పోర్టులను విదేశీయులు తప్పుడు ఆధార్, ఇతర ఐడీ కార్డులతో పొందారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంకా ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయం ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ప్రతీ పాస్‌పోర్టు క్లియరెన్స్‌కు స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) పోలీసులు రూ.పది వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.
అయితే, ఇంత తక్కువ మొత్తానికే పాస్‌పోర్టుల జారీకి సహకరిస్తారా? అన్న అనుమానాలు పోలీసుశాఖలో తలెత్తుతున్నాయి. కచ్చితంగా దీని వెనక పెద్ద రాజకీయ నేతలే ఉండి ఉంటారని, వారి అభయం, ఒత్తిడి కారణంగానే ఎస్బీ పోలీసులు ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బోధన్ ప్రాంతంలో పాస్‌పోర్టుల జారీలో అక్రమాలు కొత్త విషయమేమి కాదు. గతంలోనూ ఇక్కడ కొందరు రాజకీయ నాయకులపై ఇలాంటి కేసులు నమోదవడం గమనార్హం. అందుకే ప్రస్తుతం వెలుగుచూస్తోన్న దొంగపాస్‌పోర్టుల వ్యవహారంలోనూ పోలీసులు ఏమైనా రాజకీయ లింకులున్నాయా అని ఆరా తీస్తున్నట్లు సమాచారం. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన అబూసలేం పాస్‌పోర్ట్ కూడా ఉమ్మడి ఆంధప్రదేశ్ నుంచి జారీ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది.
నకిలీ పత్రాలు సమర్పించి కర్నూలు జిల్లా నుంచి దొంగపాస్పోర్టు సంపాదించిన కేసులో అబూసలేంకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇక బోధన్ కేసు విషయానికి వొస్తే సగానికి పైగా నిందితులు విదేశీయులు. వీరంతా దేశంలోకి అక్రమంగా ప్రవేశించారు. కేసులో ఎస్బీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ చేసే సమయంలో కనీస నిబంధనలు పాటించకుండా..పూర్తిగా దరఖాస్తుదారుల పక్షం వహించడం చూసి దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు. ఎనిమిది పాస్‌పోర్టులు ఏకంగా ప్రార్థనామందిరం చిరునామాతో ఉండటం చూసి దర్యాప్తు అధికారులు విస్మయం చెందినట్లు తెలిసింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పోలీసులు పట్టుకున్న బంగ్లాదేశీయుల్లో కొందరికి భారత్‌లో నేరచరిత్ర ఉంది.
సాధారణంగా ఎస్బీ పోలీసులు పాస్‌పోర్టు విచారణ సమయంలో దరఖాస్తుదారుల వేలిముద్రలు తీసుకుంటారు. వాటిని ‘పాపిలాన్’ అనే అత్యాధునిక సాప్ట్‌వేర్‌లో పోల్చి చూస్తారు. దేశవ్యాప్తంగా ఏమూలన నేరచరిత్ర ఉన్నా.. ఈ సాప్ట్‌వేర్‌లో కేవలం 10 సెకండ్లలో తెలిసిపోతుంది. అలాంటిది విదేశీయులు, పైగా పాత నేరస్థులు అని తెలిసినా…ఈ విషయాన్ని దాచిపెట్టి పాస్‌పోర్టులు పొందేందుకు సహకరించే సాహసం చేశారంటే.. తెరవెనక రాజకీయశక్తుల ఒత్తిడి తప్పక ఉండి ఉంటుందన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి.