Take a fresh look at your lifestyle.

తిరగబడిన ఎర్రకోట వ్యూహం

రైతు శ్రమను, భూములను, వ్యవసాయ ఉత్పత్తులను, వాటి మార్కెట్‌ ‌ను కార్పొరేట్ల కు ధారాదత్తం చేస్తున్న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టి 70 రోజులు దాటింది. అసంఘటిత రంగంలో ఉన్న రైతులు, రాజకీయ పార్టీల ప్రత్యక్ష అండదండలు లేకుండా ఇంతకాలం తమ నిరసన సాగించడం అసాధారణం. చెక్కుచెదరని రైతుల దీక్షకు కారణమైన రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం సమీక్షించాల్సిందిపోయి, అందుకు భిన్నమైన వైఖరి ఎంచుకుంది. దేశ వనరుల దోపిడికి  ప్రయత్నిస్తున్న కార్పొరేట్ల కు వ్యతిరేకంగా పోరాడుతున్న  దేశానికి అన్నం పెట్టే రైతులను, సరిహద్దు సైనికులుగా పంపే పంజాబ్‌ ‌సిక్కులను దేశ ద్రోహులుగా ముద్రించే పనికి పూనుకుంది. కందకాలు, ముళ్ళకంచెలు, బారికేడ్లు, రహదారిపై ఇనుప మేకులతో దేశ రాజధానిని సరిహద్దు ప్రాంతంగా మార్చింది. తమ దేశ ప్రజల పైనే యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకున్నది.

చట్టాల రద్దు తప్ప మరే ప్రతిపాదన తమకు అంగీకారం కాదని పలు దఫాలుగా జరిగిన చర్చలలో రైతు సంఘాల నాయకులు అనేకసార్లు తేల్చి చెప్పారు. రహదారులనే గ్రామాలుగా, ట్రక్కులనే నివాసాలుగా మలుచుకొని రైతులు సాగిస్తున్న ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది.  ప్రభుత్వ వర్గాలు, కార్పొరేట్లు తమకు వ్యతిరేకంగా సమీకృతమవుతున్న వర్గాలను చూసి ఆందోళన చెందుతున్నాయి. తేలికగా  ముగిసిపోయే సాధారణ నిరసనగానే ప్రభుత్వం మొదట్లో భావించింది. రోజులు, వారాలుగా, వారాలు నెలలుగా మారడం, 11 దఫాలుగా జరిపిన చర్చలు ఫలితమివ్వకున్నా, రైతులు పట్టు వీడక ఈ నిరసన ఇలాగే సాగించేందుకు సిద్ధమయ్యేసరికి ప్రభుత్వంలో వణకు మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా రైతులకు మద్దతు పెరుగుతున్నా  రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని శాశ్వత పరిష్కారానికి ప్రయత్నించే బదులు ఢిల్లీ సరిహద్దుల నుంచి ఖాళీ చేయించే విషయం మీదే దృష్టి సారించింది. ఒక వైపు చర్చలు జరుపు తూనే ఉద్యమ విచ్ఛిన్నానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఎర్రకోట వ్యూహం విజయవంతం అవుతుందని ఆశించిన కీలక అధికార ద్వయానికి  రైతుల చేతిలో భంగపాటు తప్పేట్లులేదు.

ఉద్యమ విచ్ఛిన్నత జరిగిన ప్రయత్నాలు:
రైతులు ఢిల్లీ శివార్లలోని టిక్రి, సింఘు, ఘాజీపూర్‌ ‌ప్రాంతాల్లోకి భారీగా తరలివచ్చి, సాగు చట్టాల రద్దు చేసే వరకు ఇళ్లకు తిరిగి వెళ్లేదే లేదని స్పష్టం చేసినా, కేందప్రభుత్వం రైతులను, వారి ఆకాంక్షలను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నది. ఉద్యమం పట్ల ప్రజలలో వ్యతిరేకతను పెంచేందుకు సంకల్పించారు. రైతుల, రైతు సంఘాల,  మద్దతుదారుల వాదన ముందు  భక్తుల ప్రచారాలు నిలవ లేక,  రైతులలో సంఘ విద్రోహ శక్తులు జొరబడ్డారని, ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదులు ఉన్నారని, దేశద్రోహానికి పాల్పడే అవకాశముందని ఆరోపించి నిరసనల అణచివేతకు ప్రణాళిక వేసి విఫలమైంది.

సాగు చట్టాలు సంవత్సరం పాటు తాత్కాలికంగా నిలుపుదల చేసి, అధ్యయనానికి ఒక కమిటీ వేస్తామంటూ తామే కేసు వేయించి, తామే రాసిన తీర్పును సుప్రీంకోర్టు ద్వారా చదివించి రైతులను ఖాళీ చేయించాలనే  అటు కేంద్రం,  అత్యున్నత న్యాయస్థానం భంగపాటుకు గురయ్యాయి. సాగు చట్టాలను సమర్దించిన వ్యక్తులతో సుప్రీంకోర్టు సూచించిన కమిటీ ఆమోదయోగ్యం కాదని, చట్టాల తాత్కాలిక నిలుపుదలను తాము అంగీకరించమని రైతులు  చెప్పారు. సుప్రీంకోర్టు సూచనను కూడా తిరస్కరించిన వెంటనే కేంద్రం 18 నెలలపాటు చట్టాల అమలు వాయిదా వేస్తామని ప్రకటించింది.  రైతులను సముదాయించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతూనే  రైతుల, సంఘాల మధ్య వైరుధ్యాలకు, చీలికలకు కేంద్రం ప్రయత్నించింది. కార్పొరేట్ల, పాలక వర్గాల సేవలో తరిస్తూ,  పత్రికా ధర్మానికి తిలోదకాలిచ్చిన ఒక వర్గం (ప్రధాన) మీడియా, కేంద్రానికి మద్దతుగా నిలవగా, సోషల్‌ ‌మీడియా ద్వారా రైతులు తిప్పికొట్టి, ఉద్యమానికి కొంతైనా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి కలిగించారు.

- Advertisement -

బెడిసికొట్టిన ఎర్రకోట వ్యూహం:
గణతంత్ర దినాన రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ‌పరేడ్‌ ‌లో జరిగిన సంఘటనలు వాంఛనీయం కాదు. పరేడ్‌ ‌సందర్భంగా నిర్దేశించిన మార్గాన్ని వదిలి ఎర్రకోట వైపు మళ్లడం, ఎర్రకోటపై రైతు జెండా ఎగరవేయడం, పోలీసులపై తిరగబడడం వంటి సంఘటనలను చూపి, రైతులను ఉగ్రవాదులుగా ప్రభుత్వం చేస్తున్న వాదనకు బలం చేకూర్చే అంశాల ప్రచారం మొదలైంది.  రైతు సంఘాల నాయకులు సకాలంలో సమయస్ఫూర్తితో స్పందించి కుట్రను ఛేదిృచడంలో విజయవంతం అయ్యారు. రైతు పెరేడ్‌ ‌సందర్భంగా స్థానికులు పూలవర్షంతో స్వాగతిస్తున్న సంఘటనలను వదిలి,  ఒక గుంపు చేసిన అల్లర్లనే ప్రధాన మీడియాలో చూపెట్టడాన్ని, పోలీసులు రైతు వ్యతిరేక ప్రచారాన్ని బహిర్గతం చేయడంలో రైతు నాయకత్వం సఫలమైంది. దీంతో అధికార ద్వయం, అంబానీ- ఆదానీల కార్పొరేట్‌ ‌ద్వయం తాము తీసుకున్న గొయ్యిలో తామే పడ్డట్లయింది.

హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రభుత్వం:
ఎర్రకోట వ్యూహం తిరగపడడంతో రైతు నేతలపై దేశద్రోహం కేసులు నమోదు చేసి,  రైతులకు అండగా నిలిచిన సోషల్‌ ‌మీడియా నియంత్రణకు ఇంటర్నెట్‌ ‌నిలిపివేయడం, సోషల్‌ ‌మీడియా ఖాతాలను స్తంభింపచేసే అప్రజాస్వామిక విధానాలకు ప్రభుత్వం పాల్పడుతున్నది.  అంతర్జాతీయంగా కార్పొరేట్‌ అనుకూల వర్గాల మద్దతు స్వీకరిస్తూ, రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సెలబ్రిటీలపై  దేశ అంతర్గత వ్యవహారం అంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

సుదీర్ఘంగా సాగిన   షాహీన్‌ ‌బాగ్‌ ‌నిరసన కోవిడ్‌ ‌కారణంగా అర్థంతరంగా ముగిసినట్లే ఇది కూడా అని పాలకులు భావిస్తే అది అత్యాశే అవుతుంది. ఎందుకంటే కూలీలను, కార్మికులను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను, చివరికి పోలీసులు సైనికులను కూడా తమ వైపు తిప్పుకొనే సామర్ధ్యం రైతు ఉద్యమానికి ఉందన్న వాస్తవాన్ని ఇప్పటికైనా గ్రహించాలి.

మానుకోట ‘స్ఫూర్తి’.

Leave a Reply