గోదారమ్మ..మన మాగాణిలోకి
- రెండు పంటలు పండించుకునే
- శుభదినం ప్రారంభమైంది
- కుడి కాలువ ద్వారా 40వేలు, ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాలు సాగునీరు
- రంగనాయక సాగర్ ప్రధాన కాలువలకు నీరు విడుదల చేసిన
- ఆర్థ్ధిక మంత్రి తన్నీరు హరీష్‌రావు
ఈ రోజు కల, నిజమా అన్నట్లు ఉంది. ఒకనాడు ఈ ప్రాంతంలో కాలం అయితేనే రైతుల కడుపు నిండేది. ఇంత కాలం రైతులు, కరెంట్, కాలం మీద ఆధారపడి వ్యవసాయం చేశారు.. ఇక నుంచి కరెంట్, కాలంతో నిమిత్తం లేకుండా రెండు పంటలు పండించే శుభదినం నేడు ప్రారంభమైందని ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అనందం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు శనివారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. అంతకు ముందు మల్లన సాగర్ ప్రాజెక్ట్ టన్నెల్ నాలుగవ గేట్ ఎత్తి ఈఎన్సి హరిరామ్ నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…రంగానాయక
సాగర్ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల చేయడం మరుపు రాని రోజు అన్నారు. ఈ రోజు కోసం తరతరాలుగా రైతులు ఎదురు చూపులు చూస్తున్నరన్నారు. ఈ రోజు కల, నిజమా అన్నట్లు ఉందని అనంద• వ్యక్తం చేశారు. కాలువల వెంట బిరబిరా గోదారమ్మ పరిగెడుతుంటే, రైతుల కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తున్నయన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్, ఇంజనీర్లకు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంత కాలం రైతులు, కరెంట్, కాలం మీద ఆధారపడి వ్యవసాయం చేసేవారని, ఇక నుంచి కరెంట్, కాలంతో నిమిత్తం లేకుండా రెండు పంటలు పండించే రోజులు వచ్చాయన్నారు. ఒకనాడు ఈ ప్రాంతంలో కాలం అయితేనే రైతులది కడుపు నిండేదని, రైతుల అప్పులతో ఆత్మహత్య చేసుకునే వారని, ఇక నుంచి ఆత్మ హత్యలకు పుల్ స్టాఫ్, కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తీసివేసే రోజులు వచ్చాయన్నారు. 365 రోజుల పాటు రంగనాయక సాగరుకు నీళ్లు వస్తాయి కాబట్టి కరువుకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతున్నామన్నారు. కాలిపోయిన మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లపై రైతులు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవారని, ఇక నుంచి రైతులు ఖచ్చితంగా రెండు పంటలు పండించుకునే శుభదినం నేడు ప్రారంభమైందన్నారు. ప్రధాన కుడి కాలువ ద్వారా 40వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాలు సాగునీరు అందుతుందన్నారు. ప్రాథమికంగా చెరువులు, చెక్ డ్యామ్, కుంటలు, వాగులు, వంకలు వేసవి కాలంలోనే నింపునున్నట్లు తెలిపారు. సిద్ధిపేట వాగు కింద 28 చెక్ డ్యామ్ లు శనిగరం చెరువును కూడా నింపనున్నట్లు వెల్లడించారు. నక్కవాగు, పెద్దవాగు కింద ఉండే చెక్ డ్యామ్‌లకు రంగనాయక సాగర్ ద్వారా నీటిని విడుదల చేస్తామన్నారు. మైనర్, సబ్ మైనర్ కాలువల తవ్వకాలకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి మంత్రి హరీష్‌రావు రైతులకు పిలుపునిచ్చారు. వర్షాకాలం వరకు పిల్ల కాలువలు పూర్తి చేసుకోవాలన్నారు. కాలువలు తవ్వడానికి ఇదే సరైన సమయని పేర్కొన్నారు.
కాల్వల్లో దూకి ఈత కొట్టిన ఏంపీ కొత్త, ఎమ్మెల్యే రసమయి, ప్రజాప్రతినిధులు
ప్రధాన ఎడమ కాలువలో గోదావరి జలాలు ప్రవహిస్తుండటంతో సంబురంతో కాల్వ జలాలను ఏంపీ, ఎమ్మెల్యేలపై చల్లుతూమంత్రి హరీశ్ రావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చిన్నకోడూర్, నారాయణరావు పేట మండల ప్రజాప్రతినిధులు సంబురంతో కాలువల్లో దూకి ఈత కొట్టారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, స్థానికులతో మంత్రి హరీశ్ సెల్ఫీలు దిగి నీళ్లు విడుదలైన సంబురాన్ని పంచుకున్నారు.