Take a fresh look at your lifestyle.

అతివలకు అన్ని సమస్యలే

మహిళా మణులు తమ హక్కుల గురించి చర్చించుకునే రోజు.తాము సాధించిన విజయాలను స్మరించుకునే రోజు. తమ పట్ల వివక్ష ను నిర్భయంగా ప్రశ్నించే రోజు ‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం.’’ సమాజంలో మహిళ అనేక రకాలుగా హింసకు గురి అవుతున్నది. వివక్ష అనేది సర్వసాధారణం అయింది. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటున్నారు కానీ వివక్ష జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రోజు రోజుకి పెరిగిపోతుందే తప్ప తగ్గడంలేదు.ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం పురుషుల కన్నా స్త్రీలు 63 కోట్లకుపైగా తక్కువ. మన దేశంలోనూ స్త్రీ, పురుష లింగ నిష్పత్తి నానాటికి తగ్గిపోతున్నది .లింగ ని ష్పత్తిలో సమానత్వం కోసం ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం ‘‘2030 నాటికి భూమిపై సగం సగం’’అనే థీమ్‌ ‌ను ప్రకటించింది. అంటే లింగ నిష్పత్తిలో సమానత్వం సాధించేందుకు ఇంకా 14 సంవత్సరాలు పడుతుంది.

ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌ 2017‌లో విడుదల చేసిన 144 దేశాల స్త్రీ పురుష సమానత్వ సూచీలో భారత్‌ 108 ‌వ స్థానంలో ఉండడం మనను కలవరపెట్టే విషయం.లింగ వివక్ష మరియు భృణ హత్యల కారణంగా గత 50 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14.26కోట్ల మంది మహిళలు జనాభా లెక్కల నుండి అదృశ్యమై పోయారని అందులో ఒక్క భారతదేశం నుండే 4.58 కోట్ల మంది ఉన్నారని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ప్రపంచ జనాభా నివేదిక 2020 లో తెలిపింది.అభివృద్ధి సూచిక లో మహిళలు అట్టడుగున ఉన్నారు. భారత్‌ ‌లో ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలే ఉన్నారని 2011 జనాభా లెక్కలు తేల్చి చెప్పాయి .పురుషులతో సమానంగా పని చేసినను వేతనాల్లో స్త్రీలు 19 శాతం తక్కువ సంపాదిస్తున్నారు .కరోనా నేపథ్యంలో మహిళలపై వివక్ష మరింత పెరిగిపోయింది. ఇప్పటికే పురుషులతో పోలిస్తే దాదాపు అన్ని రంగాల్లోనూ ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న మహిళల శాతం మరింత తగ్గిపోయింది.2019 డిసెంబర్లో 9.15%ఉన్న వర్క్ ‌పార్టిసిపేషన్‌ ‌రేట్‌ ‌ఫర్‌ ఉమెన్‌ 2020 ఆగస్టు కు వచ్చేసరికి 5.8 శాతానికి తగ్గిపోయినట్లు సర్వేలు చెబుతున్నాయి.

పురుషులతో పాటు మహిళలకు సరైన అవకాశాలు కల్పిస్తున్న దేశాలలో ఆర్థికాభివృద్ధి రేటు 13 శాతం ఎక్కువగా ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికల ద్వారా తెలుస్తున్నది .మేధాశక్తి ,నైపుణ్యాల పరంగా స్త్రీల శక్తియుక్తులను వినియోగించుకునే విషయంలో కూడా మనం వెనుకబడి ఉన్నాం .అసంఘటిత రంగాల్లో కూడా మహిళలు శ్రమ దోపిడీకి గురి అవుతున్నారు.ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 40 శాతానికి పైగా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. కొన్ని తరాలుగా వారు వ్యవసాయ రంగంలో ఉంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు బలం అవుతున్నారు. అయినా కూడా ఈ రంగంలో పురుషులు పొందుతున్న వేతనాల కన్నా స్త్రీలు పొందుతున్న వేతనాలు చాలా తక్కువ.

కాబట్టి మహిళా రైతులకు సంబంధించి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం కలదు .దీనితోపాటు ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరుగాల్సిన అవసరం కలదు. పంచాయతీరాజ్‌ ‌వ్యవస్థలో మహిళా రిజర్వేషన్‌ ఉన్ననూ పెత్తనమంతా పరోక్షంగా వారి కుటుంబ సభ్యులదే ఉంటున్నది .పదవులు అలంకారప్రాయంగా మాత్రమే ఉంటున్నాయి.చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు కలగానే మిగిలిపోయింది. మహిళలకు రాజకీయ నాయకులు గా పట్టం కట్టిన దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉంటున్నాయి. ముఖ్యంగా మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో మహిళా ఉద్యోగుల కెరీర్‌ ‌డెవలప్మెంట్‌ ‌పై లింగపరమైన వివక్ష అధికంగా ఉన్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి .దానితో పాటుగా కుటుంబ సభ్యులకు అందించే సేవల కారణంగా ప్రతి పది మందిలో ఏడుగురు మహిళలు తమ కెరీర్‌ ‌లో ముందడుగు వేయలేకపోతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నవి.

- Advertisement -

కోవిడ్‌ ‌మహమ్మారి తో పురుషులతో పాటు మహిళలు కూడా ఉపాధి కోల్పోయారు .పురుషులు ఏదో విధంగా తిరిగి ఉపాధి పొందగలిగినా మహిళలు మాత్రం తిరిగి ఉపాధి పొందడంలో వెనుకబడి పోయారు .కోవిడ్‌ ‌వలన ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య లక్షల్లో ఉండగా వారిలో ఎక్కువ మంది మహిళలే అని చెప్పవచ్చు ఉద్యోగ ,ఉపాధి రంగాల్లో మహిళల సంఖ్య తగ్గిపోవడానికి ఇప్పటికీ కొనసాగుతున్న వివక్ష, తగిన భద్రత లేకపోవడం ,పనిచేసే ప్రదేశాల్లో వేధింపులు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు .మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు తీసుకు వచ్చిన వారిపై దాడులు, అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.ముఖ్యంగా గృహహింసకు బలవుతున్న మహిళల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న ట్లు సర్వేలు తెలుపుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు నాలుగింట ఒక వంతు కు పైగా గృహ హింసను ఎదుర్కొంటున్నారు. దాదాపు 30 శాతం మంది మహిళలు గృహహింస తో బాధపడుతున్నారు.

లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో లింగ ఆధారిత గృహహింస గణనీయంగా పెరిగిందని పలు స్వచ్ఛంద సంస్థల సర్వేలో తేలింది. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఆర్ధికపరమైన అంశాలు, కుటుంబంలో పని ఒత్తిడి మొదలైన వాటితో కూడా గృహహింస పెరిగిపోయింది. ఒకవైపుఇంటిపని మరోవైపు ఉపాధి, ఉద్యోగ కార్యకలాపాలతో అవిశ్రాంతంగా పాల్గొంటున్న మహిళలు అదేస్థాయిలో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మహిళలు ఉద్యోగ, వ్యాపారాల్లో కీలకంగా మారినను వాళ్లకు ఇంటిపని ,భర్త ,పిల్లలు వృద్ధుల సంరక్షణ బాధ్యతలు తప్పడం లేదు. వారు ఉద్యోగం చేసిన ఇంటి భారం తగ్గడం లేదు. వీటన్నిటితోపాటు రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అకృత్యాలు కడు శోచనీయం. వారికి వీధిలో,బడిలో కళాశాలలో ,పనిప్రదేశాల్లో, స్నేహితుల మధ్య ,బంధువుల ఇంట్లో, కొన్ని సందర్భాల్లో సొంత ఇంట్లో కూడా రక్షణలేని పరిస్థితులను మనం చూస్తున్నాం. ఆడపిల్లలపై జరిగే అకృత్యాలకు అంతు లేదు .రోజుల పసిపాప మొదలుకొని 80 సంవత్సరాల వృద్దుల వరకు ఎవరికీ రక్షణ లేని పరిస్థితులను మనం చూస్తున్నాం. పరిస్థితులకు తగు విధంగా స్పందించే విధంగా పోలీస్‌ ‌వ్యవస్థను సన్నద్ధం చేయవలసిన అవసరం కలదు.

మహిళలకు అవకాశం ఇస్తే ఏ స్థాయిలో ముందుకు వెళ్తారో పి టి ఉష మొదలుకొని మాలావత్‌ ‌పూర్ణ వరకు అనేక మంది మహిళలు నిరూపించారు .ఆధునిక మహిళలు సామాజిక అభివృద్ధి యందు తమదైన ముద్ర వేస్తూ ముందుకు పోతున్నారు. యుద్ధ విమానాల పైలెట్లు మొదలుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నో రంగాలలో అద్భుతమైన సేవలందించడం మనం చూస్తున్నాం.హింస ,లైంగిక వేధింపులు, అత్యాచారాలు,అవిద్య వంటి సమస్యల నుండి మహిళ లను బయటకు తీసుకు వచ్చిన నాడే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యం అవుతుంది .అన్ని రంగాల్లో మహిళలను మరింతగా ప్రోత్సహించి సాధికారత కల్పించినప్పుడే సమ సమాజం ఆవిష్కృతమవుతుంది అని చెప్పవచ్చు.

pulluru venugopal
పుల్లూరు వేణుగోపాల్‌
9701047002

Leave a Reply