Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ ‌ప్రభావంతో చెదిరిన అంతర్జాతీయ సంబంధాలు

“కొరోనా ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దేశాల మధ్య వాణిజ్య సంబంధాలే కాకుండా ద్వైపాక్షిక సంబంధాల మీద కూడ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దేశాల మధ్య అనుమానం చాటున శతృత్వం పడగ విప్పుతోంది. అనేక సరిహద్దు దేశాల భద్రత పేరుతో తమ పొరుగు దేశాలను అనుమానించడం ప్రారంభమైంది. కోస్టారికా-నికారుగువా వంటి చిన్న దేశాలు సైతం భద్రతల పేరుతో వైషమ్యాలను సృష్టించుకోవడం కరోనా తీసుకు వచ్చిన నయా ట్రెండు. అంటువ్యాధి యొక్క ప్రారంభ దశలలో అనేక దేశాలు మాస్కులు, వైద్య పరికరాలు, డబ్బును చైనాకు విరాళంగా ఇచ్చాయి. చైనాలో సంక్షోభం స్థిరీకరించబడిన న తర్వాత ఆ దేశం ఇతర దేశాలకు సహాయంగా అటువంటి సహయాన్నే చేయడం ప్రారంభించింది.”

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనా మనిషిని పూర్తిగా అభద్రతాభావ పరిస్థితిలోకి నెట్టేసింది. తన పొరుగు వారిని కూడ విశ్వసించలేని విడ్డూర మానవ సంబంధాలను పరిచయం చేసిన ఈ అంటువ్యాధి అంతర్జాతీయ సంబంధాలను సైతం ప్రభావితం చేసి, దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమైంది. కరోనావైరస్‌ ‌వ్యాధి నిర్ధారణ పరీక్షలు, నివారణల కోసం ప్రపంచ దేశాల మధ్య వైద్య పరమైన సమన్వయలోపాలు తలెత్తాయి. వైద్య పరికరాల ఎగుమతి, దిగుమతులు, ఔషధాల వ్యాపారం, రవాణా, ఆసుపత్రి పరికరాల చుట్టూ ఉద్రిక్తతలు కారణంగా దౌత్య సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కొన్ని దేశాల నాయకులు ఇతర దేశాలు ఈ వ్యాధిని సమర్థవంతంగా ఉద్దేశపూర్వకంగానే వ్యాప్తి చేశాయని, వ్యాధి నివారణలో సామర్థ్యం లోపించి వైరస్‌ ‌యొక్క అనియంత్రిత వ్యాప్తికి కారణమయ్యాయని ఆరోపించారు. లాటిన్‌ అమెరికా మరియు ఆఫ్రికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు కరోనావైరస్‌ ‌వ్యాధిని పరీక్షించడానికి తగినంత అవస్థాపన సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయి. అమెరికా, యూరోపియన్‌ ‌దేశాలు ఆయా దేశాలను కరోనా వ్యాధి వ్యాప్తికి భాధ్యులను చేయడం దేశాల మధ్య సంబందాలను ప్రభావితం చేస్తోంది.

చైనాలోని హుబే ప్రావిన్స్ ‌లో మొదటిసారిగా గుర్తించబడిన ఈ మహమ్మారిని నియంత్రించడంలో చైనా పూర్తిగా విఫలమైందని అమెరికా బాహటంగానే విమర్శనాస్త్రాలు సంధించింది. బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ ‌బోల్సోనారో కుమారుడూ, కాంగ్రెస్‌ ‌సభ్యుడైనా ఎడ్వర్డో బోల్సోనారో చేసిన ట్వీట్‌ ‌చైనాతో దౌత్యపరమైన వివాదానికి కారణమైంది. ‘‘ప్రపంచంలో కరోనావైరస్‌ ‌వ్యాప్తికి మారుపేరు, ఇంటిపేరు చైనా కమ్యూనిస్ట్ ‌పార్టీ కలిగి ఉందని ఆయన చేసిన ట్వీట్‌ ‌దుమారాన్ని రేపింది.దీనికి ప్రతిగా బ్రెజిల్లోని చైనా అత్యున్నత దౌత్యవేత్త యాంగ్‌ ‌వాన్మింగ్‌ ‘‘‌బోల్సోనారో కుటుంబం బ్రెజిల్‌ ‌పాలిట విషంలా పరిణమించిందని’’ రీట్వీట్‌ ‌చేసిన సందేశం రెండు దేశాల మధ్య దూరాన్ని పెంచేలా ఉంది. అయితే కరోనా వైరస్‌ ‌ను అరికట్టడానికి తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకోసం తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించిన చైనా పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాల అస్తవ్యస్తమైన ప్రతిస్పందనలతో తమకు చెడ్డపేరు వచ్చిందని వాపోతోంది. అంతేకాకుండా తనకు వచ్చిన ప్రతికూల స్పందనలను తొలగించుకోవడానికి చైనా 82 దేశాలతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆఫ్రికన్‌ ‌యూనియన్కు సహాయ బృందాలను పంపింది. ‘‘అమెరికా వలె కాకుండా,తాము బాధ్యతాయుతమైన మరియు నమ్మదగిన భాగస్వామి అనే సందేశాన్ని చైనా దూకుడుగా ముందుకు తెస్తోందని ‘‘ యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌విదేశాంగ విధాన చీఫ్‌ ‌జోసెప్‌ ‌బొరెల్‌ ‌వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

మరింత వివాదాస్పదంగా కరోనావైరస్‌ ‌మహమ్మారిని యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌సాయుధ దళాలు వ్యాప్తి చేశాయని అమెరికాను నిందించే ప్రయత్నం వేసిన చైనా ప్రపంచ దేశాల ముందు తలవంపులను ఎదుర్కొంటోంది. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని సృష్టించింది. అదేసమయంలో కరోనావైరస్‌ ‌మహమ్మారిని గుర్తించడంలో చైనా చేసిన లోపభూయిష్ట చర్యల వలన జర్మనీ యొక్క అతిపెద్ద టాబ్లాయిడ్‌ ‌వార్తాపత్రికకు 130 బిలియన్‌ ‌యూరోల నష్టం వచ్చిందని, ఇందుకు గాను చైనా తమకు అంతే మొత్తాన్ని చెల్లించాలని జర్మనీ ప్రకటించింది. ఈ చర్య జెనోఫోబియాతో పాటు జాత్యహంకారాన్ని రేకెత్తిస్తుందని చైనా ప్రతిస్పందించింది. చైనా నుండి స్పెయిన్‌, ‌టర్కీ, నెదర్లాండ్స్ ‌దేశాలకు ఎగుమతి చేసిన వేలాది టెస్టింగ్‌ ‌కిట్లు మరియు మెడికల్‌ ‌మాస్క్లు ప్రామాణికంగా లేక లోపభూయిష్టంగా ఉన్నాయని ఆ దేశాలు ప్రకటించాయి.ఇందులో 600,000 ఫేస్‌ ‌మాస్క్లను డచ్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. స్పెయిన్‌ ‌కు ఎగుమతి చేసిన 60,000 టెస్ట్ ‌కిట్లలో సమస్యలు ఉత్పన్నమై రోగ నిర్ధారణ పరీక్షలపై ప్రభావాన్ని చూపింది. టర్కీకి పంపబడిన కొన్ని టెస్ట్ ‌కిట్లు ప్రామాణికంగా లేకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి.

ఇతర దేశాల కోసం ఉద్దేశించిన కీలకమైన సామాగ్రిని ఎగుమతి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నందుకు యునైటెడ్‌ ‌స్టేట్స్ ఇతర దేశాల అధికారులు పరిశీలనలో ఉంది. చివరి నిమిషంలో తమకు దిగుమతి అయ్యే ఫేస్‌ ‌మాస్కులను కొనుగోలు చేయడం ద్వారా ఫేస్‌ ‌మాస్క్ ‌డెలివరీలకు యునైటెడ్‌ ‌స్టేట్స్ అం‌తరాయం కలిగించిందని ఫ్రాన్స్ ‌గ్రాండ్‌ ఎస్ట్ ‌ప్రాంతీయ కౌన్సిల్‌ అధ్యక్షుడు జీన్‌ ‌రోట్నర్‌ ఆరోపించడం రెండు దేశాల మధ్య పొరపొచ్చలను బయటపెట్టింది. ఆ రవాణాకు అనేక రెట్లు ఫ్రాన్సుకు చెల్లించి అమెరికా అధికారులు దానిని కైవసం చేసుకున్నారని ఫ్రెంచ్‌ అధికారులు పేర్కొన్నారు. కెనడా సైతం ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నది. మొదట కెనడా కోసం ఉద్దేశించిన వైద్య సామాగ్రిని యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌కు మళ్లించారనే ఆరోపణలపై దర్యాప్తు చేయమని ఆ దేశ ప్రధాని ఆదేశాలివ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జర్మనీ పోలీసుల కోసం ఉద్దేశించిన 200,000 ఎన్‌ 95 ‌మాస్కులు బలవంతంగా థాయిలాండ్‌ ‌విమానాలలో దారి మళ్లించి యునైటెడ్‌ ‌స్టేట్స్ ఆధునిక పైరసీకి పాల్పడిందని జర్మనీ ఆరోపించడం కలకలం రేపింది.

ఇండియా సైతం మందుల ఎగుమతి విషయంలో అమెరికా హెచ్చరికల బారిన పడింది. భారత ప్రభుత్వం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ‌మెడిసిన్‌ ‌ను అమెరికాకు విడుదల చేయకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌భారతదేశాన్ని హెచ్చరించారు. దీంతో భారతదేశం మందులను ఎగుమతి మీద తాత్కాలికంగా నిషేధాన్ని ఎత్తివేసి, ఆ మందులను అమెరికాకు రవాణా చేయడానికి మార్గం సుగమం చేసింది. 2020 ఏప్రిల్‌ 2‌న, అధ్యక్షుడు ట్రంప్‌ 1950 అమెరికా రక్షణ ఉత్పత్తి చట్టాన్ని ఊటంకిస్తూ కెనడా, లాటిన్‌ అమెరికా దేశాలకు 3 ఎమ్‌ ఉత్పత్తి చేసిన మాస్కుల ఎగుమతులను నిలిపివేసాడు. దీన్ని తీవ్రంగా ఆక్షేపించిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ‌ట్రూడో వైద్య సామాగ్రీ, నిపుణులతో సహా అవసరమైన వస్తుసేవల వాణిజ్యాన్ని పరిమితం చేయడం పొరపాటు అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండ కెనడా ప్రభుత్వం కీలకమైన వైద్య సామాగ్రి కోసం చైనా, ఇతర దేశాల వైపు తిరగడమే కాకుండా ట్రంప్‌ ‌పరిపాలనతో ఈ సమస్య గురించి నిర్మాణాత్మక చర్చను కోరుతున్నారు.

మార్చి నెలలో జర్మనీ వ్యక్తిగత రక్షణ పరికరాల ఎగుమతిని నిషేధించగా, ఫ్రాన్స్ ‌వైద్య పరికరాల ఎగుమతులను పరిమితం చేసింది. దీంతో సంఘీభావం కోసం పిలుపునిచ్చిన ఈ యూ అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంది. వైరస్‌ ‌వ్యాప్తిని నివారించడానికి చాలా స్కెంజెన్‌ ఏరియా దేశాలు తమ సరిహద్దులను మూసివేయడంతో దేశాల మధ్య ప్రతిష్ఠంభన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కరోనా అంటువ్యాధి మీద ఎలా స్పందించాలనే అంశంతో పాటు, ఆర్థిక పతనానికి సంబంధించిన చర్చలు ఉత్తర దక్షిణ యూరోపియన్‌ ‌సభ్య దేశాల మధ్య చీలికను తీసుకువచ్చాయి. 2010లో యూరోపియన్‌ ‌రుణ సంక్షోభంపై ఇదేరకమైన చర్చలు ఈయూ దేశాల మధ్య భిన్న వాదనలకు కారణమయ్యాయి. తొమ్మిది ఈయూ దేశాలు-ఇటలీ, ఫ్రాన్స్, ‌బెల్జియం, గ్రీస్‌, ‌పోర్చుగల్‌, ‌స్పెయిన్‌, ఐర్లాండ్‌, ‌స్లోవేనియా, లక్సెంబర్గ్ – ‌మార్చి 25 న తమ దేశాలు అంటువ్యాధి కోలుకోవడంలో సహాయపడటానికి ‘‘కరోనా బాండ్స్’’ (ఒక రకమైన యూరోబాండ్‌) ‌కొరకు పిలుపునిచ్చాయి. ఉత్తర యూరోపియన్‌ ‌దేశాలైన జర్మనీ, ఆస్ట్రియా, ఫిన్లాండ్‌, ‌నెదర్లాండ్స్ ‌లు ఉమ్మడి రుణం డిఫాల్ట్ అయినప్పుడు వారు దానిని తిరిగి చెల్లించాల్సి వస్తుందనే భయంతో ఈ రకమైన బాండ్లు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బదులుగా, యూరోపియన్‌ ‌స్టెబిలిటీ మెకానిజం నుండి రుణాల కోసం దేశాలు దరఖాస్తు చేసుకోవాలని వారు ప్రతిపాదించారు.

అసలే అంతంత మాత్రంగా ఉన్న జపాన్‌-‌దక్షిణ కొరియా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మహమ్మారి ఫలితంగా మరింతగా దిగజారాయి. దక్షిణ కొరియా నుండి వచ్చిన వారందరినీ తాము నిర్బంధించడం ప్రారంభిస్తామని జపాన్‌ ‌ప్రకటించిన తరువాత, దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ చర్యను అసమంజసమైన విచారకరమైన విషయంగా అభివర్ణించింది. కరోనా యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌చేత కుట్రపూరితంగా సృష్టించబడిన వైరస్‌ అని ఇరాన్‌ అధికారులు ఒక కథనాన్ని వ్యాప్తి చేయడం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను రెట్టింపు చేసింది. కరోనావైరస్‌ ఒక అమెరికన్‌ ‌జీవసంబంధ దండయాత్ర కావచ్చని ఇరాన్‌ ‌ప్రభుత్వం అమెరికాను నిందించడం రెండు దేశాల మధ్య శతృత్వాన్ని ఇంకా పెంచేలా ఉంది. ఐఆర్జిసి-అనుసంధాన సమాచార నెట్వర్క్లను లోతుగా పరిశీలిస్తే, యునైటెడ్‌ ‌స్టేట్స్ను మాత్రమే కాకుండా,తన సాంప్రదాయ సైద్ధాంతిక శత్రువు ఇజ్రాయెల్ను కూడా దుర్భాషలాడే అవకాశాన్ని కూడా ఇరాన్‌ ‌వదులుకోలేదు. ఇరాన్‌ ‌ప్రజలపై 12 బయోటెర్రరిస్ట్ ‌దాడులు’’ జరిగాయని మునుపటి ఆరోపణలకు అనుగుణంగా, ఇప్పుడు కూడా అదే తరహా ‘‘జియోనిస్ట్ ‌బయోలాజికల్‌ ‌టెర్రరిస్ట్ ‌దాడి’’ జరుగుతోందనే వాదనలను తెరపైకి తెచ్చింది.
చమురు ఉత్పత్తి రంగం మీద కూడ కరోన అనేక రకాలైన ప్రభావిత ఫలితాలను ఉత్పన్నం చేసింది. 2019-20 కరోనావైరస్‌ ‌మహమ్మారి కారణంగా చమురు వినియోగం గణనీయంగా తగ్గినందుకు ప్రతిస్పందనగా, ధరలను మితమైన స్థాయిలో ఉంచడానికి ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో తగ్గుదల కోసం సౌదీ అరేబియా ప్రయత్నించింది. కాని, చమురు ఉత్పత్తిని తగ్గించడానికి రష్యా నిరాకరించినప్పుడు, సౌదీ అరేబియా 2020 మార్చిలో చమురు ధరల యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ ఆర్థిక వివాదం ఫలితంగా 2020 వసంత కాలంలో చమురు ధర పూర్తిగా పడిపోయింది. ఈ చర్య రెండు దేశాల వాణిజ్య రంగం మీద ప్రభావం చూపుతోంది.

కరోనా ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దేశాల మధ్య వాణిజ్య సంబంధాలే కాకుండా ద్వైపాక్షిక సంబంధాల మీద కూడ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దేశాల మధ్య అనుమానం చాటున శతృత్వం పడగ విప్పుతోంది. అనేక సరిహద్దు దేశాల భద్రత పేరుతో తమ పొరుగు దేశాలను అనుమానించడం ప్రారంభమైంది. కోస్టారికా-నికారుగువా వంటి చిన్న దేశాలు సైతం భద్రతల పేరుతో వైషమ్యాలను సృష్టించుకోవడం కరోనా తీసుకు వచ్చిన నయా ట్రెండు. అంటువ్యాధి యొక్క ప్రారంభ దశలలో అనేక దేశాలు మాస్కులు, వైద్య పరికరాలు, డబ్బును చైనాకు విరాళంగా ఇచ్చాయి. చైనాలో సంక్షోభం స్థిరీకరించబడిన న తర్వాత ఆ దేశం ఇతర దేశాలకు సహాయంగా అటువంటి సహయాన్నే చేయడం ప్రారంభించింది. మార్చిలో చైనా, క్యూబా, రష్యాలు కరోనావైరస్‌ ‌నివారణ కోసం సహాయపడటానికి ఇటలీకి వైద్య సామాగ్రితో పాటు నిపుణులను కూడా పంపాయి. ప్రస్తుతం కోవిడ్‌-19 ‌ను ఎదుర్కోవడానికి దేశాల మధ్య విశ్వాసం లోపించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. నమ్మకం కోల్పోవడం మహమ్మారి సమస్యకు పరిష్కారం కాదు. కరోనా వ్యాక్సిన్‌ ‌వచ్చే వరకు ఒక దేశం మరో దేశం పట్ల మునుపటి సంబందాలు నెరపడమే ప్రస్తుతం ప్రభుత్వాల ముందు ఉన్న లక్ష్యం. ఈరోజు కాకున్న రేపైనా వ్యాధి నివారణకు మందు రావడం ఖాయం. అంతవరకు దేశాలు అనుమానాలకు తావివ్వకుండా సంయమనం పాటించడం అలవాటు చేసుకోవాలి.

jayaprakash ankam
జయప్రకాశ్‌ అం‌కం

Leave a Reply