Take a fresh look at your lifestyle.

మహిళల హక్కుల పట్ల అవగాహన అవసరం

నేడు అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేకదినం
ఆధునిక సమాజంలో గృహ హింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు నానాటికీ అధికం అవుతున్నాయి . అత్మనూనతా భావానికి లోనై స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోవడం కొనసాగుతూ ఉన్నాయి. వీటిన్నింటినీ అరికట్టే ప్రయత్నములో 1999 డిసెంబరు 17 వ తేదీన ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని చేసి, ప్రతి ఏడు నవంబరు 25 న స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీ హింసా వ్యతిరేక దినముగా పాటించాలని ఈ తీర్మానించింది. అనాదినుండీ అబలలుగా ముద్ర వేయ బడిన ఆడవారికి అడుగు వేస్తే ఆపద.. గడియ గడియకో గండం.. అనుక్షణం ఆందోళన.. మహిళలపై అణచివేతలు  కొనసాగు తుండడం నిత్యకృత్యాలే అవుతున్నాయి. మహిళలకు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించినా వాటిపై సరైన అవగాహన లేకపోవడం, కనీసం వాటి గురించి తెలియక పోవడంతో అతివలు మరింత అన్యాయాలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా ఆచరణలో సాధ్యం కాని పరిస్థితి. పుట్టక ముందే భ్రూణ హత్యలు, పుట్టిన తర్వాత వివక్షలు, మగువల జీవితాలను నరక ప్రాయం చేస్తున్నాయి. తమపై వివక్షను, వేధింపులను ఎదుర్కోవడానికి వారు ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసు కోవాల్సిన అవసరం ఉంది.

అందులో భాగంగా భారతీయ శిక్ష స్మతి లోని కొన్ని ప్రధాన సెక్షన్‌ ‌లు సెక్షన్‌ 100 ‌ప్రకారం ఆత్మరక్షణ కోసం, ఒక వ్యక్తి మీద దాడి చేస్తే సదరు వ్యక్తి చనిపోయినా మీకు శిక్ష పడదు. 166(బి) సెక్షన్‌ ‌ప్రకారం.. బాధితురాలికి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రి లో చికిత్స ఇవ్వకపోతే సంబంధిత సిబ్బంది, యాజ మాన్యం మీద కేసు వేయవచ్చు. 228(ఏ) సెక్షన్‌ ‌ద్వారా లైంగిక దాడికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు, ఫొటోలు ప్రచురించ కూడదు. అలా చేసిన పక్షంలో సదరు సంస్థపై చర్యలు తీసుకోవచ్చు. 354 సెక్షన్‌ ‌ప్రకారం – స్త్రీ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, అవమాన పర్చినా, అనుమతి లేకుండా ఫొటో, వీడియో తీసినా ఈ సెక్షన్‌ ‌కింద ఫిర్యాదు చేయవచ్చు. 376 సెక్షన్‌ ‌కింద..  మహిళల అనుమతి లెకుండా  సెక్సులో పాల్గొంటే అది అత్యాచారంగా భావించి అది చట్టరీత్యా నేరం అవుతుంది. ఒకవేళ మైనర్‌ ‌బాలిక ఆమె ఇష్ట ప్రకారమే చేసినా పురుషుడినకి %•••••% చట్టం క్రింద సుమారు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష. భార్య ఉండగా.. మరో పెళ్లి చేసుకుంటే 494 సెక్షన్‌ ‌ప్రకారం అతని మీద కేసు నమోదు చేయవచ్చు. కేసు రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. 498(ఏ) సెక్షన్‌- ఓ ‌వివాహితను ఆమె భర్త కానీ, భర్త బంధువులు కానీ అదనపు కట్నం కింద ధన, వస్తు, ఆభరణాలు అడిగితే ఈ సెక్షన్‌ ‌ప్రకారం శిక్షార్హులు.  గృహినులను శారీర కంగా, మానసికంగా,  హింసించినా, అందుకు ప్రేరేపించినా, ప్రోత్సహించినా గృహ హింసా చట్టం కింద కేసు వేయ వచ్చు. కనీసం మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించ బడుతుంది.

509 సెక్షన్‌ – ‌మహిళ లతో అవమానంగా మాట్లాడినా, సైగలు చేసినా, అసభ్యకర వస్తువులను ప్రదర్శించినా ఈ చట్టం ప్రకారం శిక్షకు అర్హులు. ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యకరంగా పాటలు పాడుతూ, శబ్దాలు చేస్తూ ఎవరైనా ఇబ్బంది పెడితే సెక్షన్‌ 294 ‌ప్రకారం వారిపై ఫిర్యాదు చేయవచ్చు. కనీసం మూడు నెలలకు తగ్గకుండా వారికి జైలుశిక్ష, లేదా కొంత జరిమానా వేయవచ్చు.  ఉద్దేశ పూర్వకంగా ఎవరైనా మహిళను వెక్కిరించినా, అనుకరించినా, వారిపై సెక్షన్‌ 354(‌డీ) ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నిందితులకు 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. పనిచేసే ప్రదేశాల్లో  తోటి ఉద్యోగులు గానీ, బాస్‌ ‌గానీ ఆఫీసు పనుల్లో అలుసుగా తీసుకొని సెక్సువల్‌ ‌కాంటాక్ట్ ‌కోసం ఇబ్బంది పెడితే 2013 వేధింపుల చట్టం ప్రకారం ఫిర్యాదు చేయ వచ్చు. ఒకరి ఫొటోను మార్ఫింగ్‌ ‌చేసి వారి శరీరాలకు ముఖాన్ని అతికించి ఇబ్బంది కరంగా ఇంటర్నెట్‌లో షేర్‌ ‌చేస్తున్న సంఘటనలలో  సెక్షన్‌ 499 ‌ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.

నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష పడవచ్చు. ఒక మహిళను దౌర్జన్యంగా, బల ప్రయోగం వల్ల తన శరీరంపై ఉన్న దుస్తులను తీసివేసినా, ఆ వ్యక్తికి సెక్షన్‌ 354(‌బీ) ప్రకారం 3నుండి7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. 13/2013 సవరణల చట్టం ద్వారా ఈ సెక్షన్‌ అదనంగా చేర్చబడింది. ఒక మహిళ, విద్యార్థినికి సంబం ధించిన రహస్య వ్యక్తిగత ఫొటోలు తీయడం, వీడియోలు తీసి వాటిని ఇతరులకు పంపించినా 354(సీ) సెక్షన్‌ ‌కింద ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. వ్యభిచారానికి, 18 ఏళ్లలోపు బాలికను కొనుగోలు చేసినా సెక్షన్‌ 373 ‌ప్రకారం పదేళ్ల జైలుశిక్ష విధించడంతో పాటు జరిమానా విధిస్తారు. బాలికను వ్యభిచారానికి మారేందుకు ప్రోత్సహించినా, ప్రలోభ పెట్టినా సెక్షన్‌ 366(ఏ) ‌కింద పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించ బడుతుంది. నిండు గర్భిణిని చంపాలనే ఉద్దేశంతో చేపట్టిన ఒక చర్య పర్యవసానంగా ఆమె చనిపోతే నేరస్థుడిపై సెక్షన్‌ 316 ‌ప్రకారం ప్రాణహరణం కింద, నేరం మోప బడుతుంది. ఆమె మరణించడానికి బదులుగా గర్భంలోని శిశువు మరణిస్తే 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. ఒక బృందంలోని సభ్యులు ఒక మహిళపై లైంగిక దాడి చేసిన సందర్భాల్లోనూ వారిలో ప్రతి వ్యక్తి నేరానికి పాల్పడి నట్లే పరిగణించ బడుతుంది. సెక్షన్‌ 376-‌బీ కింద ప్రతి ఒక్కరికీ 20 ఏళ్లు తగ్గకుండా జీవితఖైదు శిక్ష విధిస్తారు. 13/2013 సవరణ చట్టం ద్వారా ఈ సెక్షన్‌ ‌సవరించబడింది.

స్త్రీ, బాలికను గానీ తన ఇష్టానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తిని వివాహం చేసుకునేందుకు బలవంతంగా అంగీకరించాలని ఒత్తిడి తేవడం, ఆ స్త్రీని అపహరిస్తే బలవంతంగా వివాహం చేసుకునే సెక్షన్‌ 366 ‌కింద పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా పడుతుంది. ఇలాంటి చట్టాల ఎన్నో గురించి మహిళలు అవగాహన కలిగి ఉండాలి. అలాగే  సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్త్రీల పట్ల బాధ్యతగా ప్రవర్తించాలి. సాటి మనుషులుగా మహిళలకు సామాజిక బాధ్యతగా సహకరించాలి.
–  రామ కిష్టయ్య సంగన భట్ల…
    9440595494

Leave a Reply