Take a fresh look at your lifestyle.

పుస్తక పఠనం మస్తిష్క వికాస సాధనం…!

(నేడు ‘అంతర్జాతీయ బాలల పుస్తక దినం’)

పుస్తకం హస్తభూషణమే కాదు, మేధో వికాస సాధనం కూడా. పుస్తకాలు విజ్ఞాన గనులు. పుస్తక పఠనమే జ్ఞాన సమపార్జనకు ఉత్తమ మార్గం. పిల్లలు, పెద్దలు పుస్తక పఠనాన్ని విధిగా అలవాటు చేసుకోవాలి. చిరుప్రాయంలోనే పిల్లల్లో పఠనాసక్తిని పెంచడానికి బాలల కోసమే రచించబడిన పుస్తకాలు ఉపయోగపడతాయి. బాలల్లో ఊహాశక్తిని పెంచడం, విజ్ఞాన సమపార్జన, వ్యక్తిత్వ వికాసం, వినోదాల విందు వడ్డించడం, మేధో విస్తృతి మరియు వివేక సంపదలను ప్రసాదించే శక్తివంతమైన నేస్తం పుస్తకమని మరువరాదు.

ఆసక్తికరమైన పంచరంగుల బాలల పుస్తకాలను పిల్లలకు అందుబాటులో ఉంచి, వారిలో పఠనాసక్తిని జాగృతం చేయడం మనందరి కర్తవ్యంగా భావించాలి. పుస్తక పఠనంతో మ్నెదలైన బాలలు విజ్ఞాన సమపార్జన యాత్రలో రేపటి బాధ్యతగల నైపుణ్య సంపద కలిగిన పౌరులుగా నిర్మింపబడతారనే సదుద్ధేశంతో 1967 నుంచి ప్రతి ఏటా 02 ఏప్రిల్‌ ‌రోజున ‘అంతర్జాత బాలల పుస్తక దినం’ ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ‘ఇంటర్నేషనల్‌ ‌బోర్డ్ ఆన్‌ ‌బుక్స్ ‌ఫర్‌ ‌యంగ్‌ ‌పీపుల్‌’ ‌సంస్థ సౌజన్యంతో బాలల పుస్తకాల రచయిత ‘హాన్స్ ‌క్రిస్టియన్‌ ఆం‌డర్సన్‌’ ‌పుట్టిన రోజున బాలల పుస్తక వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుట జరుగుతుంది.

అంతర్జాతీయ బాలల పుస్తక దినం వేదికగా బాలల పుస్తక రచయితలను గుర్తించడం, పిల్లల్లో పుస్తక పఠనాసక్తిని రగల్చడం, విద్యసమపార్జన, వ్యక్తిగత మానసికాభివృద్ధి, మెదడుకు వ్యాయామం, పారిభాషక పదకోశవృద్ధి, సంతులిత ఆలోచనలు జనింపజేయడం, సహానుభూతి మేల్కొలపడం, ఊహాశక్తిని విస్తరించడం, మానవీయ విలువల పరిచయం చేయడం, ప్రపంచ వింతలు/విడ్డూరాలను అవగాహన పరచడం లాంటి కార్యక్రమాలను బాలల కోసం నిర్వహించాలి. ఆసక్తికర, ఆనందానుభూతుల విషయ విందులను చిన్నారులకు వడ్డించే సామర్థ్యం బాలల పుస్తకాలకు మాత్రమే ఉంటుంది. పిల్లల కథల, కార్టూన్ల, డ్రాయింగ్‌ ‌పుస్తకాలను చదవడానికి పిల్లలు మక్కువ చూపుతారు. ఈ పుస్తక పఠనం అలవాటుగా మారుతూ, శారీరక ఎదుగుదలతో పాటు మానసిక సమతుల వికాసం జరుగుట ఫలిస్తుంది.

అంతర్జాతీయ బాలల పుస్తక దినం-2021 నినాదంగా ‘పద సంపదల సంగీతాలు (ది మ్యూజిక్‌ ఆఫ్‌ ‌వర్డస్)’ అం‌శం తీసుకోబడింది. పుస్తకాల్లో దాగిన విజ్ఞాన వినోదాలను చిన్నారులు అర్థం చేసుకోవడానికి ప్రధాన ఉపకరణాలుగా బాలల పుస్తకాలు నిలుస్తున్నాయి. చిరుప్రాయంలోనే పిల్లలకు బాలల పుస్తకాలను అందుబాటులో ఉంచి, పఠనాసక్తిని జాగృత పరచాలి. ఉపాద్యాయుడు, విద్యార్థి, పుస్తకం మరియు పెన్ను ఏకమైతే ప్రపంచ తలరాతను మార్చగల ఆయుధాలని గుర్తుపెట్టుకోవాలి. నేటి బాలలు రేపటి బాధ్యతగల పౌరులుగా ఎదిగి, దేశాభివృద్ధికి దోహదపడటానికి ఏకైక మార్గం పుస్తక పఠన అలవాటు మాత్రమే అని తల్లితండ్రులు గమనించాలి.

burra madhusudhan reddy
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply