- మరోమారు అసంతృప్త నేతల రహాస్య భేటీ
- ఓ వైపు పదాధికారుల సమావేశం… మరోవైపు అసమ్మతి సమావేశం
- హద్దు మీరితే చర్యలు తప్పవన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర : తెలంగాణ బీజేపీలో రాజుకున్న అసమ్మతి చిచ్చు ఆరడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా గతంలో రహాస్య సమావేశాలు నిర్వహించిన బీజేపీ నేతలు మంగళవారం మరోమారు సమావేశమయ్యారు. బీజేపీ పదాదికారులు సమావేశం జరుగుతున్న కరీంనగర్‌లోనే అసమ్మతి నేతలు కూడా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో బండి సంజయ్ ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. తమ కంటే రాజకీయాలలలో జూనియర్ అయిన బండి తమను అసలు పట్టించుకోవడం లేదనీ, అధికార పార్టీపై పోరాటంలో భాగంగా తమను కలుపుకుని పోవడం లేదంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
అయితే, అసమ్మతి నేతల సమావేశం వ్యవహారాన్ని బండి అధిష్టానం దృష్టికి తీసుకుపోవడంతో ఆ వ్యవహారం అప్పట్లో సద్దుమణిగినట్లు కనిపించింది. మరోవైపు, అసమ్మతి నేతలు బండి వ్యవహరాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు. అయితే, ఈ విషయంపై కిషన్ రెడ్డి అసమ్మతి నేతలకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. తాజాగా, బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్‌లో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగుతున్న సమయంలోనే అసమ్మతి నేతలు మరోమారు రహాస్య భేటీ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇదే సమావేశంలో పార్టీలో అసమ్మతి వ్యవహారాన్ని ఎట్టి పరిస్తితుల్లోనూ సహించేదని లేదని బండి సంజయ్ హెచ్చరించారు.
బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ అనీ, ఎంతటి సీనియర్ నాయకులైనా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏ పార్టీలోనైనా కొందరు నిత్య అసమ్మతి వాదులు ఉంటారనీ, వారు పని చేయకపోగా పనిచేసే వాళ్లపై అక్కసు వెళ్లకక్కుతూ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరిస్తారని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వొస్తుందనీ, ఇలాంటి సమయంలో కొద్ది మంది అసమ్మతి నేతల మాటలు నమ్మి వెళితే నేతలు, కార్యకర్తల రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందనీ, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్బంగా బండి సంజయ్ హెచ్చరించారు.