Take a fresh look at your lifestyle.

ఆసక్తికరంగా హస్తిన ఎన్నికలు

Interestingly delhi elections 2020దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాషాయ జంఢా ఎగురవేయాలన్న దృఢ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న భారతీయ జనతాపార్టీత దేశ రాజధానిలోనే పార్టీని గెలిపించుకోలేకపోయింది. ప్రపంచ దేశాల్లో మోదీ ఇమేజ్‌ ‌పెరిగిందని చెప్పుకుంటున్నా ఢిల్లీ ప్రజలు మాత్రం ఆమ్‌ ఆద్మీ వైపే మొగ్గు చూపడం విశేషం. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇక్కడ అధికారం చేపట్టినప్పటి నుండీ కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీకి ఎన్నడూ సహకరించలేదు. కేజ్రీవాల్‌ ‌ప్రభుత్వాన్ని ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఆడుకుంది. అయినా దేశ రాజకీయాల్లో ఓ కొత్తతరహా ఆలోచనతో ఏర్పడిన ఆమ్‌ ఆద్మీపార్టీ అనేక ఒడిదొడుకుల మధ్య అయిదేళ్ళు పూర్తిచేసుకోగలిగింది. ఇప్పుడు మరోసారి ప్రజల తీర్పుకోసం ఢిల్లీ సమాయత్తం అవుతున్నది. తాజాగా ఢిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ సత్తా చాటుకునే పనిలో పడ్డాయి. ఫిబ్రవరి ఎనిమిదిన జరిగే ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆప్‌కు, బిజెపికి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనుకుంటున్నారు. ఇటీవల కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుంటూ వొచ్చింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఒకటి రెండు రాష్ట్రాల్లో విజయం సాధించినా ఆ తర్వాత బిజెపిపై ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న క్రేజ్‌ ‌తగ్గిందనడానికి నాలుగైదు రాష్ట్రాలను ఆ పార్టీ చెయ్యిజార్చు కోవడమేనంటున్నారు. అయినా కేంద్రంలో సంఖ్యాపరంగా ఆపార్టీ పటిష్టంగా ఉండటంతో ఇటీవల కాంగ్రెస్‌ ‌కాలం నుండి పెండింగ్‌లో ఉన్న అనేక బిల్లులను ఆ పార్టీ నెగ్గుకు రాగలిగింది. కాని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశం ముందుకు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సి వంటి అంశాలు వివాదగ్రస్తంగా మారాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వీటిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

దేశ రాజకీయాలకు కేంద్రమైన ఢిల్లీలో జవహర్‌లాల్‌ ‌నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్దుల ఆందోళన ఉద్రిక్తంగా మారిన ఈ సమయంలోనే ఢిల్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రెండవసారి కేంద్రంలో అధికారం చేపట్టిన భారతీయ జనతాపార్టీ గతంలోకన్నా ఇప్పుడు పటిష్టంగా ఉంది. అలాగే కేజ్రీవాల్‌ ‌కూడా పాలనలో తనదైన వరవడిని చూపించడం ద్వారా నిన్నటివరకు ప్రశాంతపాలన సాగిస్తున్నారు. మొహల్లా క్లినిక్‌ల పేరున బస్తీ దవాఖానాల తెరిచి నిరుపేదలకు వైద్యాన్ని ఆప్‌ ‌ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అలాగే విద్య, వైద్య సేవల పేరున కార్పొరేట్‌ ‌దోపిడీ నుంచి సామాన్యులను కాపాడే పథకాలను రచించింది. ప్రభుత్వ పాఠశాలలను, రవాణా సదుపాయాలను మెరుగుపర్చింది. ముఖ్యంగా మహిళకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కలిగిస్తూ ఆప్‌ ‌తీసుకున్న తాజా నిర్ణయం మహిళాలోకాన్ని ఆకట్టుకుంది. అలాగే విద్యుత్‌ ‌రాయితీలు లాంటి పలు అంశాలు ఆ పార్టీని ఈసారి తిరుగులేని మెజార్టీతో గెలిపిస్తుందనుకుంటున్నారు. కేజ్రీవాల్‌ ‌ప్రవేశపెడుతున్న జనాకర్షక పథకాలకు ధీటైన పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు కేజ్రీవాల్‌ను ఢీకొట్టగలిగే వ్యక్తికోసం బిజెపి అన్వేషిస్తోంది. గత ఎన్నికల్లో ఆప్‌ ‌నుండి విభేదించి వొచ్చిన ఐపిఎస్‌ ‌మాజీ అధికారి, ఫైర్‌‌బ్రాండ్‌గా పేరున్న కిరణ్‌బేడీని బిజెపి పోటీగా నిలిపినా లాభం లేకుండాపోయింది. ఇప్పుడు అలా ప్రజలను ఆకట్టుకునే వ్యక్తులెవరున్నారా అని ఆ పార్టీ గాలిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఢిల్లీ ప్రజలను ఆకర్షించే విధంగా ఇప్పటికే ఆ పార్టీ ఆస్తుల రెగ్యులరైజేషన్‌ ‌చట్టాన్ని పార్లమెంట్‌ ఆమోదంతో తీసుకురాగలిగింది. దీనివల్ల ఢిల్లీ నగరంలో చాలాకాలంగా అక్రమంగా నిర్మించుకున్న వారి కట్టడాలను రెగ్యులరైజ్‌ ‌చేసుకునే అవకాశం ఏర్పడింది. అయితే ఇది కొందరికి మాత్రమే ఉపయోగపడే అంశం కావడంతో మిగతా ప్రజలను బిజెపి ఏవిధంగా ఆకట్టుకుంటుందన్నది ప్రశ్న.

ఏది ఏమైనా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి కేజ్రీవాల్‌ ‌కొరకరాని కొయ్యగా మారాడు. ప్రతీ విషయంలో కేంద్రంతో ఆయన ఘర్షణ పడక తప్పడంలేదు. ఈ లాంటి పరిస్థితిలో ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి డెబ్బై స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి ఎనిమిదిన ఎన్నికల అనంతరం పదకొండవతేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఫలితాలపైనే ఇప్పుడు అందరిదృష్టి కేంద్రీకృతమై ఉంది. 2015లో జరిగిన ఎన్నికల్లో 67 స్థానాలను గెలుచుకున్న ఆమ్‌ ఆద్మీపార్టీ ఈసారి ఎన్ని స్థానాలను గెలుచు కుంటుందన్న లెక్కలేసుకుంటున్నారు. అలాగే కేవలం మూడు స్థానాలనే ఆనాడు గెలుచుకున్న బిజెపి ఈసారి ఢిల్లీ అసెంబ్లీలో పట్టు సాధిస్తుందా లేదా అన్న చర్చ కూడా జరుగుతుతోంది. తాజాగా జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి ఢిల్లీలోని ఏడు లోకసభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఇప్పటికే తన ప్రభావాన్ని చూపించింది. క్రమేణ ఆ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందనడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తున్నది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఢిల్లీ ప్రజలు అదే వైఖరిని అవలంభిస్తారా, గతంలో లాగా ఆమ్‌ ఆద్మీ పార్టీకే జై అంటారా అన్నది రాజకీయవర్గాల్లో ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

Tags: delhi elections 2020 results live, bjp vs aap party, congress vs bjp, lok sabha elections

Leave a Reply