Take a fresh look at your lifestyle.

ఉద్ధండుల మధ్య పోటీ..రసవత్తరంగా ఎంఎల్‌సి ఎన్నికలు

రాష్ట్రంలో తాజాగా జరుగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా సాగనున్నాయి. ఈ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న వారంతా ప్రముఖులే కాదు, ఉద్ధండులు కూడా. కొందరు ప్రధాన పార్టీల పరంగా ఎన్నికల్లో నిలువగా, మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. దీంతో ఎన్నికలపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంటున్నది. మంగళవారంతో ఈ ఎన్నికల నామినేషన్ల పక్రియకు తెరపడింది. ఉపసంహరణ గడువు ముగిసేనాటికి వాస్తవంగా రంగంలో నిలిచేదెవరన్నది తేలనున్నప్పటికీ, ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు మాత్రం తీవ్ర ప్రచార కార్యక్రమంలో మునిగిపోయాయి.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని ఈ ఎన్నికల్లో ఎలాగైనా మట్టి కరిపించాలన్న సంకల్పంతో కాంగ్రెస్‌, ‌బిజెపి లాంటి జాతీయపార్టీలు విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టాయి. అయితే ఈ మూడు పార్టీలు కూడా ఒకదానిపై ఒకటి తీవ్ర ఆరోపణలు చేసుకోవటంతో ఆయాపార్టీల తప్పిదాలు తేటతెల్లమవుతున్నాయి. వాటిని విశ్లేషించుకునే పనిలో పడ్డారిప్పుడు గ్రాడ్యుయేట్‌ ‌వోటర్లు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ నిలుపుకోలేదని కాంగ్రెస్‌, ‌లెఫ్ట్‌పార్టీలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. దశాబ్ధాలుగా కేంద్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్‌ ‌పార్టీ దేశంలోని నిరుద్యోగ సమస్యను తీర్చలేకపోయిందని ఆరోపించిన బిజెపి 2014 ఎన్నికలప్పుడు తమకు అధికారాన్నిస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేకపోయిందంటూ వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌లు ఆరోపిస్తున్నాయి.

మోదీ అధికారంలోకి రావడానికి ముందు దేశంలో నిరుద్యోగత 5.61 శాతం కాగా, ఇప్పుడది 7.1 శాతానికి పెరిగిందన్నది ఆ పార్టీల ఆరోపణ. అంతేగాక మోదీ అధికారం చేపట్టింది మొదలు ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాడని, ఈ సంస్థలను విక్రయించడమో లేదా కార్పొరేట్‌లకు కారుచౌకగా అంటగట్టడమో చేస్తూ, నిరుద్యోగులను మరింత పెంచుతున్నాడంటూ, ఈ రంగ సంస్థలు ఇంకా బతకాలంటే బిజెపిని ఓడించడమే ప్రత్యమ్నాయంగా వామపక్షాలు తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. కాగా, అసలు బిజెపికి ఎందుకు వోటెయ్యాలని టిఆర్‌ఎస్‌ ‌ప్రశ్నిస్తున్నది. కొత్తగా ఏర్పడిన తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవడంలో కేంద్రంలోని బిజెపి సర్కార్‌ ‌పూర్తిగా నిర్లక్ష్యవైఖరిని అవలంబిస్తుండటమే గాక, మతం పేరిట రాజకీయాలు చేస్తున్నదని ఆ పార్టీ నాయకులు బిజెపిపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఐటిఐఆర్‌ ‌ప్రాజెక్టు విషయంలో లేపిన ఆశలను అడియాశలుచేసింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అయితేనేమీ, ఏర్పాటు చేస్తామన్న గిరిజన యూనివర్శిటీ విషయమైతేనేమీ, కొత్తగా మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు విషయంలోనైతేనేమీ తెలంగాణకు చేసిందేమీలేదని టిఆర్‌ఎస్‌ ‌వర్గాలు బిజెపిపై దుమ్మెత్తి పోస్తున్నాయి. వీటిని పక్కకుపెట్టి బిజెపి కూడా తెరాసపై తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తోంది. నీళ్ళు, నిధులు, నియామకాలంపై గొంతెత్తిన టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత ఆ విషయాన్నే మరిచిపోయిందంటూ ఆరోపిస్తోంది.

- Advertisement -

నీళ్ళు జగన్‌కు, నిధలు మెఘా కంపెనీకి, నియామకాలు ఫ్యామిలీకంటూ ఎద్దేవా చేస్తుంది. ఆంధ్ర సర్కార్‌ అ‌క్రమంగా పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టులను నిర్మిస్తుంటే తెలంగాణ సర్కార్‌ ‌నిమ్మకు నీరెత్తినట్లున్నట్లున్నదని బిజెపి నాయకులు విమర్షనాస్త్రాలను గుప్పిస్తున్నారు. పోతిరెడ్డి పాడునుండి జగన్‌ ‌నీళ్ళు తీసుకుపోతున్నా, తుంగభద్ర దగ్గర ఆర్‌డిఎస్‌ ‌కుడికాలువ నిర్మాణం జరుగుతుంటే నీరో చక్రవర్తిలా టిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌వ్యవహారముందంటూ ఆరోపిస్తున్న బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ను ఇలానే కొనసాగిస్తే ఈ రాష్ట్రాన్ని ఆప్పుల కుప్పగా మార్చడం తథ్యమంటుంది.

mlc elections
mlc elections,telangana news,telugu news online,graduate elections

ఇక కాంగ్రెస్‌ ‌పార్టీ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుంది. దశాబ్దాలకాలంగా అధికారంలో ఉన్న ఆపార్టీ ఇతర పార్టీలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకపోతుంది. అయినా పంటి బిగువుతో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నది. అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే ఈ ఎన్నికల సమయానికే ఆ పార్టీపై పిడుగులు పడుతున్నట్లవుతోంది. ఒకరి వెనుక ఒకరన్నట్లు సీనియర్‌ ‌నాయకులు పలువురు పార్టీ వీడిపోతుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉందాపార్టీ. ఇప్పటికే హేమాహేమీలనుకున్న వారంతా ఇతర పార్టీల్లోకి జారుకోగా తాజాగా మరో సీనియర్‌ ‌నాయకుడు శ్రీశైలం గౌడ్‌, ఆ ‌పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, పాల్వాయి హరీష్‌బాబులు పార్టీని వీడగా తాజాగా ఫిరోజ్‌ఖాన్‌ ‌పేరు వినిపిస్తుంది. హర్షవర్ధన్‌రెడ్డి అయితే రెబల్‌ అభ్యర్థిగా హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంఎల్సీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డితో పోటీకి దిగడంతో కాంగ్రెస్‌కు మరింత ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా లెఫ్ట్ ‌పార్టీలు బలపర్చిన జయసాధి రెడ్డి, తెలంగాణ జనసమితి పక్షాన పోటీలో ఉన్న ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌, ‌యువ తెలంగాణనుండి రంగంలో ఉన్న రాణి రుద్రమరెడ్డి, ప్రముఖ విశ్లేషకుడు, మాజీ ఎంఎల్‌సి ప్రోఫెసర్‌ ‌నాగేశ్వర్‌లు తమ స్వంత ఇమేజ్‌తోనే నెట్టుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

-మండువ రవీందర్‌రావు

Leave a Reply