- నిరంతరంగా శ్రమిస్తున్న భారత బృందాలు
- భారత్ ఆర్మీ సేవలను కొనియాడిన టర్కిష్ మహిళ
- భూకంప శిథిలాల్లో అప్పుడే పుట్టిన బిడ్డ..చనిపోయిన తల్లి…
- పాపను దత్తత తీసుకునేందుకు ప్రజల పోటీ
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 10 : తుర్కియే, సిరియా దేశాల సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం ఎంత నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 20వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వేలాది మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. భూకంపం ధాటికి విలవిల్లాడుతున్న ఆ రెండు దేశాలకు ప్రపంచదేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ఈ దీనస్థితిని గమనించిన భారత్.. ఆ రెండు దేశాలకూ సాయం చేసేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ’ఆపరేషన్ దోస్త్’ పేరిట సహాయక చర్యలు అందిస్తోంది. ఇందులో భాగంగా మందులు, ఇతర వైద్య పరికరాలు, సిబ్బందిని అక్కడికి పంపింది. సందర్భంగా భారత సైన్యం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తోంది.
ఈ తరుణంలో ఇండియన్ ఆర్మీ మనసుల్ని హత్తుకునే ఫోటో ఒకటి షేర్ చేసింది. కృతజ్ఞతతో కూడిన టర్కిష్ మహిళ.. సహాయక చర్యల్లో ఉన్న భారత మహిళా సైనికురాలిని హత్తుకుని.. ముద్దు పెట్టింది. ఈ ఫొటో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ ’వి కేర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నారు. ఆర్మీ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ’వారు యద్ధం కోసమే కాదు. సొంత దేశ ప్రజలను.. అవసరమైతే ఇతర దేశాలను రక్షించేందుకు ముందుంటారు. బిగ్ కుడోస్ టు టీమ్’ అంటూ రాసుకొస్తున్నారు.
భూకంప శిథిలాల్లో అప్పుడే పుట్టిన బిడ్డ..చనిపోయిన తల్లి…పాపను దత్తత తీసుకునేందుకు ప్రజల పోటీ తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం రెండు దేశాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ప్రభావిత ప్రాంతాల్లో ఎటుచూసినా విషాద దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. అయిన వాళ్లను కోల్పోయిన వారి ఆక్రందనలతో ఆ ప్రాంతాలు మార్మోగుతున్నాయి. కొన్ని దృశ్యాలైతే హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. కొందైరే పుట్టుకతోనే కుటుంబాన్ని కోల్పోతున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సిరియాలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో జిండేరిస్ ప్రాంతం ఒకటి.
అక్కడ భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. కుప్పకూలిన ఓ భవనం శిథిలాల నుంచి అప్పుడే పుట్టిన పసికందును సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భూకంపం వచ్చిన కాసేపటికి ఆ బిడ్డ తల్లికి పురిటి నొప్పులు వచ్చాయి. బిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి చనిపోయింది. ఆ పాప తండ్రి, నలుగురు తోబుట్టువులు కూడా శిథిలాల కింద చతికిపోయి ప్రాణాలు వదిలారు. సహాయక చర్యల్లో భాగంగా శిథిలాలను తొలగిస్తున్న సమయంలో చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నెమ్మదిగా మట్టిని, రాళ్లను తొలగించి ఆ పసికందును సురక్షితంగా బయటకు తీసి సపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.