Take a fresh look at your lifestyle.

మేధస్సు ఆర్థికాభివృద్ధికి పునాది..

‘‘‌భారతీయ సంప్రదాయంలో చర్మ సౌందర్యానికి వినియోగించే పసుపుకు సైతం  విదేశీయులు పేటెంట్‌ ‌హక్కులు పొంది, భారతదేశ జ్ఞానాన్ని తస్కరించారు.  ప్రపంచ గణిత మేధావులకు సైతం అర్ధం కాని మహా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ ‌కు ఎందుకు  నోబెల్‌ ‌బహుమతి దక్కలేదు? మన దేశానికి చెందిన గణిత మేధావిని  కనీసం ఆయన మరణానంతరం కూడా మనం భారతరత్న అవార్డునిచ్చి ఎందుకు సత్కరించలేక పోయామో అర్ధం కావడం లేదు.ప్రపంచంలోని మేధావులను, వారి ఆవిష్కరణలను గుర్తించడం, వారి పరిశోధనా ఫలితాలకు పేటెంట్‌ ‌హక్కులకు నివ్వడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. ’’

జ్ఞానం అనేది సాధన వలన లభిస్తుంది. మన మస్తిష్కాన్ని, మనసును ఒక చోట కేంద్రీకరించి, పట్టుదలతో ప్రయత్నిస్తే, జ్ఞానం మన స్వంతమవుతుంది.  ఎలాంటి ప్రయత్నం లేకుండా బుద్ది వికసించదు.మానసిక పరిపక్వత సాధ్యం కాదు.  ఈ ప్రపంచంలో జ్ఞానానికి సరితూగే ధనం లేనే లేదు.  మేధస్సు మానవులకు లభించిన ఒక వరం. ఇతర జీవరాశుల కంటే విభిన్నంగా జీవించాలనే తత్వం, ఆలోచన, విషయసేకరణ, ఆచరణ వంటి విశిష్ఠమైన లక్షణాలు మానవ జాతిలో మెండుగా ఉన్నాయి. ఇతర జీవరాశులకు తెలివి తేటలు లేవు అనుకోవడం కూడా అజ్ఞానం వలన జనించిన భావన మాత్రమే. మనతో మమేకమై జీవించే కోటాను కోట్ల జీవరాశులలో అద్భుతమైన తెలివి తేటలున్నాయి.  సాలె పురుగు క్షణాల్లో నిర్మించుకునే ఒక  రక్షణ  వలయం  ఒక అద్భుతమైన ఇంజనీరింగ్‌ ‌నైపుణ్యాన్ని సూచిస్తుంది. ఇంతటి విచిత్ర మైన సాలె పురుగు రక్షణ నిర్మాణం మానవులకు కూడా సాధ్యం కాని విషయం. పక్షి తన నివాసానికి ఏర్పరచుకునే గూడును ఒక సారి పరిశీలిస్తే ఆ పక్షి యొక్క తెలివి తేటలు, పనితనం అవగతమవుతాయి. వివిధ రకాల జంతువులు తమను తాము ఇతర బలమైన జంతువుల నుండి కాపాడు కోవడానికి, ఆహారం కోసం ఎన్నో వ్యూహాలను సిద్ధం చేసుకుంటాయి. మొక్కలకు కూడా ప్రాణం,స్పందించే గుణం ఉందన్న విషయం భారతీయ శాస్త్రవేత్త జగదీష్‌ ‌చంద్రబోస్‌ ఏనాడో నిరూపించాడు. తమకు ఆపద వస్తుందనుకున్న సమయంలో కొన్ని కొన్ని జాతుల మొక్కలు తమ రక్షణ వ్యూహాలను అమలు చేస్తాయి. పాములు, తేళ్ళు, తాబేళ్ళు వంటి జీవులు ఆపద సమయంలో ఎలా తమను తాము కాపాడు కోవడానికి ప్రయత్నిస్తాయో మనకు విదితమే. అయితే జీవరాశులన్నీ తమ మనుగడ కోసం ఎంత వరకు అవసరమో,అంత వరకే తమ శతృవుల పట్ల జాగరూకత వహిస్తాయి.
 పశుపక్ష్యాదుల్లో లేని అవలక్షణం మనిషిలో స్వార్థం,అసూయ రూపంలో ఏర్పడడం మానవ మేధస్సుకు కళంకం. అవసరం లేకపోయినా దురాశతో తోటి మానవులను పీడించుకు తినడం, భూప్రపంచం ఉన్నంత వరకు బ్రతికేయాలనే దుగ్ధతో తరతరాలకు తరగని సంపదను కూడ బెట్టే ఒక అనైతిక ప్రక్రియలో భాగంగా స్వజాతి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించడం మానవ మేధస్సుకు పట్టిన గ్రహణం.ఈ ధోరణి మారాలి. మన ఆలోచనలు సమాజానికి ఉపయోగ పడాలి. ప్రతిభ వ్యక్తిగత గుర్తింపుకు,గౌరవానికి తోడ్పడంలో ఎలాంటి తప్పు లేదు. ఫలితం మాత్రం సమాజానికి ఉపయోగపడాలి.  అయితే ఒకరి ఆలోచనలను, ప్రతిభను మరొకరు బలవంతంగా లాక్కునే గత కాలం పద్ధతి మారాలి. మేధో మధన ఫలాలు ప్రపంచాన్ని ఆర్ధికంగా ముందుకు తీసుకు రావాలి.మానవ మస్తిష్కంలో  ఏర్పడిన ఆలోచనలకు,ఆసక్తికి సాధన తోడైతే దానికి ప్రయోగాత్మక పరిశీలనా దృక్ఫథం రంగరిస్తే వెలువడిన అమూల్యమైన సంపద జ్ఞానం. అలాంటి జ్ఞానం ఎన్నో మలుపులు తిరిగి,ఎన్నో అధ్యయనాలకు దారితీసి, ఎంతో మంది మేధావుల మస్తిష్కాలకు పదును పెడితే, ఎన్నో చర్చలు మేధో మధనం తర్వాత ఒక మహత్తరమైన ఆవిష్కరణకు రూపకల్పన జరుగుతుంది. అది ప్రపంచానికి,దేశానికి ఎంతో ఉపయుక్తకరమైన అంశంగా రూపం సంతరించుకుంటుంది. ఒక సకారాత్మక దృక్పథంతో  కార్యసాధన చేస్తే, మానవ మేధస్సు  ఒక అద్భుతమైన ఉత్పత్తిని సమాజానికి అందిస్తే అదే నిజమైన ఆస్తి. అదే ప్రపంచానికి నిజమైన వారసత్వ సంపద. జ్ఞానం నుండి వెలువడ్డ ఇలాంటి సంపదను మేధో సంపదగా అభివర్ణించవచ్చు.  పూర్వకాలంలో  తెలివితేటలను కొంతమందికే పరిమితం చేసేవారు. మేధావులు తమ తెలివి తేటలను ఇతరులకు పంచే వారు కాదు. కేవలం తమ కుటుంటాలకే పరిమితం చేసేవారు. కొంత మంది తెలివితేటలను ఈ సమాజం బలవంతంగా అణచివేసి ఆనందించింది.
ఇలాంటి అసూయ వలన అనర్ధాలే తప్ప సమాజానికి మేలు జరగలేదు. ఈ సత్యాన్ని  గ్రహించి పలు దేశాలు తమ ప్రజల ఆలోచనలను,తెలివి తేటలను చాలా తెలివిగా వినియోగించుకుని, ఇతర దేశాల మేధస్సును  కూడా దొంగిలించి, అది తమ దేశాల గొప్పతనం గా ప్రచారం సాగించడం చూశాం. ఇలాంటి క్రమంలోనే భారత దేశం తమ విలువైన మేధో సంపత్తిని విదేశాలకు దారాదత్తం చేసింది. తెరవెనుక తతంగాన్ని గుర్తించలేక, తమ మేధా సంపత్తిని బాహ్య ప్రపంచానికి తెలపడంలో విఫలమైనది. మేధో సంపత్తి హక్కుల పేరుతో భారతీయ మేధస్సు చౌర్యానికి గురైనది. భారతీయ సాంప్రదాయాల్లో నిక్షిప్తమైన అనేక శాస్త్రీయ ఆలోచనలు మూఢ నమ్మకాల ముసుగులో మూలన పడిపోతే, వాటిని తెలివిగా ఒడిసి పట్టుకుని పేటెంట్‌ ‌హక్కులు సంపాదించి, వాటి ఫలితాలను తిరిగి ప్రపంచ దేశాలకు అమ్ముకుని, ఆర్ధికంగా ఎదుగుతున్న దేశాలను చూసి చేష్ఠలుడిగి నిలబడ్డ అసహాయత చాలా కాలం కొనసాగింది.
మన దేశంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో ప్రపంచాన్ని అబ్బుర పరిచారు. కాని వారి కృషికి తగిన గుర్తింపు లభించలేదు.  ప్రాచీన నాగరికతకు పుట్టినిల్లు భారతదేశం. సైన్స్ అం‌టే ప్రపంచానికి తెలియని రోజుల్లో చరకుడు, సుశృతుడు వైద్య శాస్త్ర రంగంలో అనేక ఫలితాలను ప్రపంచానికి అందించారు.  క్రీ.పూర్వమే సుశృతుడు తొలి శస్త్ర చికిత్స చేసి ఆశ్చర్య పరిచాడు. ఆయన అద్వితీయమైన వైద్య పరిజ్ఞానానికి గౌరవంగా  మెల్‌ ‌బోర్న్ ‌లో సుశృతుని విగ్రహం నెలకొల్పబడింది.  కాని మన దేశంలో వారికి లభించిన గౌరవం ఏమిటి? కనీసం వారి పేరైనా నేటి భారతీయ యువతకు, విద్యావంతులకు తెలుసా?  భారతీయ సంప్రదాయంలో చర్మ సౌందర్యానికి వినియోగించే పసుపుకు సైతం  విదేశీయులు పేటెంట్‌ ‌హక్కులు పొంది, భారతదేశ జ్ఞానాన్ని తస్కరించారు.  ప్రపంచ గణిత మేధావులకు సైతం అర్ధం కాని మహా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ ‌కు ఎందుకు  నోబెల్‌ ‌బహుమతి దక్కలేదు? మన దేశానికి చెందిన గణిత మేధావిని  కనీసం ఆయన మరణానంతరం కూడా మనం భారతరత్న అవార్డునిచ్చి ఎందుకు సత్కరించలేక పోయామో అర్ధం కావడం లేదు.
ప్రపంచంలోని మేధావులను, వారి ఆవిష్కరణలను గుర్తించడం, వారి పరిశోధనా ఫలితాలకు పేటెంట్‌ ‌హక్కులకు నివ్వడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. వ్యాపారాభివృద్దికి,నాణ్యతకు వివిధ రకాల ట్రేడ్‌ ‌మార్క్  ‌లను ప్రకటించడం, పేటెంట్‌, ‌కాపీ రైట్‌ ‌చట్టాల పట్ల  అవగాహన కలిగించడానికి ప్రతీ ఏటా ఏప్రిల్‌ 26 ‌వ తేదీన ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం జరుపుకుంటున్నాం. వరల్డ్ ఇం‌టిలెక్చ్యువల్‌ ‌ప్రోపర్టీ ఆర్గనైజేషన్‌,’ WIPO’ 1970 ‌వ సంవత్సరంలో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. స్విట్జర్లాండ్‌ ‌లోని జెనీవాలో డబ్ల్యు. ఐ.పి.ఓ. ప్రధాన కార్యాలయ ముంది.మేధా సంపత్తికి సంబంధించిన  విలువను చాటి చెప్పి, దాని  విధానాలను వివరించడం, సేవలను, సహకారాన్ని అందించాలనే సదుద్దేశ్యంతో నెలకొల్పిన ఈ అంతర్జాతీయ సంస్థ  మేధావుల ఆలోచనలను ఆర్ధిక రూపంలోకి మార్చి,తద్వారా ప్రపంచంలోని ప్రజలకు ఉపకరించే విధంగా ఆర్ధిక నిర్మాణానికి సరికొత్త రూపకల్పన చేయాలి.
image.png
సుంకవల్లి సత్తిరాజు,
(సామాజిక విశ్లేషకులు),
సంగాయగూడెం,తూ.గో.జిల్లా( ఆం.ప్ర) 9704903463.

 

Leave a Reply