Take a fresh look at your lifestyle.

సబ్బండ వర్గాల ‘సౌలత్’ కోసం సమీకృత కలెక్టరేట్లు ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను నివారించడమే లక్ష్యంగా ఉమ్మడి 10 జిల్లాలను ,రెండు జోన్లను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా సబ్బండ వర్గాల  సౌకర్యం కోసం 33 జిల్లాలుగా 37 రెవెన్యూ డివిజన్లతో 607 మండలాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జోనల్, మల్టి జోనల్ వ్యవస్థల స్థానంలో రెండు మల్టీ జోన్లు, ఏడూ కొత్త జోన్ల వల్ల ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉండే ప్రజలకు, ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా  సీఎం.కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో పండగ వాతావరణం ఏర్పడింది. కొత్త జోనల్ వ్యవస్థను రూపొందించే సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సూచనలను కూడా పరిగణలోకి తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డి’ లోని (1) & (2) క్లాజ్ ల కింద దాఖలు పడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ -2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది. సవరించిన ఉత్తర్వుల వల్ల కామాటి నుండి ఆర్డీఓ వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కే విధంగా కేసీఆర్ చొరవ తీసుకోవడం. అదే జెట్ స్పీడ్ తో  దేశంలో ఎక్కడలేని విధంగా ఒక్కసారిగా  కుంభ జాబ్ మేళా 91,142 భర్తీకి మార్గం సుగమం అయ్యింది.వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రాలకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా..  శితిలావస్థలో ఉన్న  భవనాల స్థానంలో మరియు  కొత్త జిల్లాల  కలెక్టరేట్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మించి  ప్రారంభించి పాలన సాగిస్తున్నారు.దీంతో ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా అటూ,ఇటూ వెళ్లనవసరం లేకుండా, నయా పైసా ఖర్చులేకుండా అన్ని పనులను ఒకేచోట పూర్తిచేసుకునేందుకు బృహాత్తరమైన కార్యాచరణ చేపట్టి సృజనాత్మక ఆలోచనతో పేదల పాలిట దేవుడైనారు.

 ప్రజా సంక్షేమం ,అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ సేవలన్నీ సింగిల్ విండో పద్ధతిలో ఒకేచోట అందుబాటులో ఉండేలా సమీకృత కలెక్టరేట్ల నిర్మించారు.ఒక్కో కలెక్టరేట్ నిర్మాణానికి రూ.50-60 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు.పచ్చటి ప్రాంగణాలు, సాధ్యమైనంత తక్కువ విద్యుత్తు వినియోగంతో ఆ భవన సముదాయాలన్నీ పర్యావరణహితంగా ఉండేలా,గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చర్యలు చేపట్టారు.29 జిల్లాల్లో రూ.1,581.62 కోట్ల వ్యయంతో జిల్లా అధికారుల సమీకృత భవన సముదాయాలు,మరో రూ.206.44 కోట్లతో 24 జిల్లాల్లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఆర్వోలు, ఇతర జిల్లా స్థాయి అధికారుల నివాస క్వార్టర్లను నిర్మిస్తున్నారు. సిద్దిపేట, కామారెడ్డి, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జనగామ, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్నగర్, జగిత్యాల, వికారాబాద్ జిల్లాల్లో ఇప్పటికే కలెక్టరేట్లను ప్రారంభించారు.తాజాగా రాష్ట్రంలో మరో మూడు  మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కలెక్టరేట్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.స్థానిక అవసరాలు, భూమి లభ్యత ఆధారంగా ఒక్కో ఐడీవోసీ సముదాయాన్ని డిజైన్ చేశారు.మొత్తం 29 ఐడీవోసీల్లో 18 సముదాయాలను 1.39 లక్షల చదరపు అడుగుల చొప్పున విస్తీర్ణంలో, మిగిలిన 11 సముదాయాలను 1.59 లక్షల చదరపు అడుగుల చొప్పున విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.24 జిల్లాల్లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారుల క్వార్టర్ల నిర్మాణాన్ని చేపట్టగా..12 జిల్లాలో పనులు పూర్తయ్యాయి.మరో 10 జిల్లాల్లో నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. మిగిలిన 2 జిల్లాల్లో ఇంకా పనులు చేపట్టాల్సి ఉన్నది.ఆదిలాబాద్ ,వరంగల్ జిల్లాల  కలెక్టరేట్ భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు.హైదరాబాద్, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఇదివరకే కలెక్టరేట్ భవనాలు ఉన్నాయి. రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణే లక్ష్యంగా ,ప్రజా సంక్షేమానికి పట్టం కట్టేందుకే కొత్త జిల్లాలు,మండలాలు దానికి తగ్గట్టుగా సమీకృత కలెక్టరేట్లతో పాలన ప్రజల గుమ్మల్లోకి వచ్చిందనే సంతోషం ప్రతి జిల్లాలో విరాజిల్లింది.

ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కొన్ని జిల్లాల్లో చిమ్మని సికట్లో 200 కిలోమీటర్లకు పైగా వెళ్లాల్సి వచ్చేది.రవాణా సౌకర్యం సరిగ్గా జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వర్ష కాలంలో పొద్దాకనే  చుక్కలు అగుపడేవి. పట్టణం పోయిన పెద్దయిన ఇంకా రాలేదని సందెకాడ దీపం అంట్టించి ఎదురుచూస్తుండేది. రాను, పోనూ కల్సి మూడు రోజుల పని చెడిపోయేది.కనీసం మండలానికి వెళ్లాలన్న 20 నుండి 30కిలోమీటర్ల ప్రయాణం తప్పేది కాదు. రెక్కాడితే కాని డొక్కాడని శ్రామిక జీవితాలకు ప్రయాసగా మారింది. ఈ కష్టాలను ఉద్యమ సమయంలో క్షుణ్ణంగా పరిశీలించిన  సీఎం. కేసీఆర్ పాలన సంస్కరణల్లో భాగంగా ప్రజల అవసరాల, ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసి, ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రజలు ముంగిట పాలకులను నిలబెట్టినారు. కొత్తగా ఏర్పడ్డ జోనల్ వ్యవస్థ వల్ల గతంలో కంటే అదనంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని నిరుద్యోగులు భావిస్తున్నారు.అదే విధంగా  కొన్ని శాఖల్లో రాష్ట్ర స్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారానే భర్తీ చేయడంతో ఉద్యోగ వర్గాల నుండి సానుకూలత వచ్చింది. తన 40ఏండ్ల రాజకీయ రంగంలో పరిపాలించుటకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశంతో సబ్బండ వర్గాలకు అగ్రపీఠం వేసినారు.సమీకృత కలెక్టరేట్ల వలన ప్రజల వద్దకు పాలన  అందించి ,ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు జవాబుదారిగా చేయడంలో కొత్త ఒరవడి సృష్టించారు.సరిక్రొత్త ఆవిష్కరణలకు  కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ చరిత్రలో మిగిలిపోయారనేది జగద్విదితం.

 

డా.సంగని మల్లేశ్వర్,

విభాగాధిపతి, జర్నలిజం శాఖ,

కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,

సెల్-9866255355

Leave a Reply