- వీణవంక ఆత్మీయ సదస్సులో మంత్రి హరీష్ రావు
గత ప్రభుత్వాలు ముదిరాజులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ మాత్రం మత్స్యకారుల అభివృద్ధి కోసం రూ. వెయ్యి కోట్లు ఇచ్చారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. రైతుబీమా తరహాలో మత్స్యకారులకు కూడా రూ. 6 లక్షల బీమా పాలసీ తీసుకొస్తామని మంత్రి హరీష్ రావు హామి ఇచ్చారు. వీణవంకలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ముదిరాజ్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. మత్స్యకారుల కోసం సీఎం కేసీఆర్ మోటార్ సైకిళ్లతో పాటు రూ. 150 కోట్ల విలువ చేసే లగేజ్ ఆటోలు పంపిణీ చేశామని తెలిపారు.
రూ. 65 కోట్లతో హైదరాబాద్, జిల్లా కేంద్రాలకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వెహికిల్స్ ఇచ్చామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని మండలాలకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వెహికిల్స్ ఇస్తామని హరీష్ రావు హామి ఇచ్చారు. రూ. 75 కోట్లతో మత్స్యకార భవనాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. 609 జీవో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. చెరువులు, కుంటలపై మత్స్యకారులకే హక్కు కల్పించేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఇక్కడ అధునాతన చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే..ముదిరాజులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన వాహనాలకు ఉచితంగా పెట్రోల్ ఇప్పించాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.