“దేశంలో మొబైల్ అనువర్తన రూపకల్పన కోసం అర్హతగల ధ్రువీకృత నిపుణ మానవశక్తి అందుబాటులోకి రాగలదు. మరింత కచ్చితంగా చెప్పాలంటే- అటువంటి సాంకేతిక-ఉన్నత విద్యాసంస్థలు తమ మౌలిక సదుపాయాలను, ఆర్థిక వనరులను మొబైల్ అనువర్తన సంవర్ధక కేంద్రాలకు కేటాయించవచ్చు. తద్వారా వినూత్న ఆలోచనలు, సంబంధిత అనువర్తనాల రూపకల్పన, వాటి సామర్థ్య పరీక్ష-ప్రారంభం తదితరాలను సంఘటితం చేయవచ్చు. ఈ సంవర్ధక కేంద్రాలు సమాచార సాంకేతిక పరిశ్రమ చురుకైన సహకారంతో- ప్రత్యేకించి మొబైల్ అనువర్తన కంపెనీలతో సమష్టిగా అనువర్తనాభివృద్ధి సంబంధిత ఆవిష్కరణలు-వ్యవస్థాపనలను పరివర్తనాత్మకం చేయవచ్చు. అదేవిధంగా ఈ సంయుక్త భాగస్వామ్యం కింద సాంకేతిక-ఉన్నత విద్యా సంస్థల్లో వినియోగంలో లేని మౌలిక వసతులను ప్రయోగశాల లేదా పరీక్షించే సదుపాయాల ఏర్పాటుకు వాడుకోవచ్చు.”
స్వదేశీ అనువర్తనాల రూపకల్పన సాధ్యమైనపుడు వాటిని భారతదేశం కోసం… భారతదేశం చేత… భారతదేశం రూపొందించిన సొంత మొబైల్ అనువర్తనాలుగా చాటుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్వదేశీ మొబైల్ అనువర్తనాల రూపకల్పనకు సంబంధించి సంస్థాగత-పారిశ్రామిక భాగస్వామ్యం ఆవిర్భావంపై విశ్లేషణ దిశగా కింది అంశాలను పరిశీలించవచ్చు:
అ. సమాచార సాంకేతిక/అనువర్తన అభివృద్ధి కంపెనీలతో సంస్థాగత సహకారం: భారతదేశం ఒక ప్రధాన సమాచార సాంకేతిక శక్తి కావడంవల్ల సంబంధిత సంస్థలకుగానీ, సాంకేతిక నైపుణ్య మానవ వనరులు సమకూర్చే సామర్థ్యానికిగానీ కొదవలేదు. అయినప్పటికీ మొబైల్ అనువర్తనాల రూపకల్పన సంబంధిత ప్రత్యేక అంశాల కోసం ఒక సంయుక్త-సహకారాత్మక వ్యూహం రూపొందించుకోవడం అవశ్యం. ఆ మేరకు కంప్యూటర్ అనువర్తనాలు, ఐటీ సంబంధిత కోర్సులు నిర్వహించే ఉన్నత సాంకేతిక-విద్యాసంస్థలు ‘టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో వంటి సమాచార సాంకేతిక దిగ్గజ సంస్థలతో లేదా కేవలం మొబైల్ అనువర్తనాలు మాత్రమే రూపొందించే సంస్థలతో జట్టుకట్టవచ్చు. తద్వారా అనువర్తన రూపకల్పన కోర్సులను సంయుక్తంగా నిర్వహించవచ్చు. ఈ వ్యూహంద్వారా ఉన్నత విద్యాసంస్థలు నిర్వహించే సాంకేతిక కోర్సులలో ఉపాధి ఆవశ్యక నైపుణ్యం పెంపు వంటి అనేక ప్రయోజనాలు ఉండవచ్చు. అలాగే దేశంలో మొబైల్ అనువర్తన రూపకల్పన కోసం అర్హతగల ధ్రువీకృత నిపుణ మానవశక్తి అందుబాటులోకి రాగలదు. మరింత కచ్చితంగా చెప్పాలంటే- అటువంటి సాంకేతిక-ఉన్నత విద్యాసంస్థలు తమ మౌలిక సదుపాయాలను, ఆర్థిక వనరులను మొబైల్ అనువర్తన సంవర్ధక కేంద్రాలకు కేటాయించవచ్చు. తద్వారా వినూత్న ఆలోచనలు, సంబంధిత అనువర్తనాల రూపకల్పన, వాటి సామర్థ్య పరీక్ష-ప్రారంభం తదితరాలను సంఘటితం చేయవచ్చు. ఈ సంవర్ధక కేంద్రాలు సమాచార సాంకేతిక పరిశ్రమ చురుకైన సహకారంతో- ప్రత్యేకించి మొబైల్ అనువర్తన కంపెనీలతో సమష్టిగా అనువర్తనాభివృద్ధి సంబంధిత ఆవిష్కరణలు-వ్యవస్థాపనలను పరివర్తనాత్మకం చేయవచ్చు. అదేవిధంగా ఈ సంయుక్త భాగస్వామ్యం కింద సాంకేతిక-ఉన్నత విద్యా సంస్థల్లో వినియోగంలో లేని మౌలిక వసతులను ప్రయోగశాల లేదా పరీక్షించే సదుపాయాల ఏర్పాటుకు వాడుకోవచ్చు.ఈ సదుపాయాలను మొబైల్ అనువర్తనాల పరిశోధన-అభివధ్ధి రంగం కోసం కూడలి కేంద్రాలుగా వినియోగించవచ్చు. ఇటువంటి ఉన్నత విద్య-సాంకేతిక సంస్థలలో ఐటీ పరిశ్రమల సహకారంతో మొబైల్ అనువర్తన రూపకల్పనకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన సర్టిఫికేషన్ కోర్సులను అందించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీటిని తమ బిఇ/బిటెక్/బిఎస్సీ వంటి సాధారణ అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి సాంకేతిక కోర్సులతో కలపవచ్చు. దీనివల్ల ద్వంద్వ ప్రయోజనాలుంటాయి… మొదటిది- మొబైల్ అనువర్తన ప్రత్యేక కోర్సు అభ్యసించిన తాజా పట్టభద్రులతో కూడిన మానవ శక్తి అందుబాటులోకి రావడం. రెండోది- ప్రాంగణ నియామకాల కోసం అపార ఉపాధి సామర్థ్యం పెంచగల సాంకేతిక కోర్సుల సంఖ్య పెరగటం.
ఆ. రంగాలవారీ నైపుణ్యాభివృద్ధి మండళ్లతో సహకారం: ఐటీ-ఐటిఈఎస్ రంగాలవారీ నైపుణ్య మండలి (SSC NASSCOM) అధిక డిమాండ్గల వృత్తులను గుర్తించింది… కంపెనీలలో అధికశాతం నియామకాలకు వీలున్న ఉద్యోగ పాత్ర పోషించేవిగా వీటిని పేర్కొనవచ్చు. ఈ మేరకు రంగాలవారీ నైపుణ్యమండలి అధిక డిమాండ్గల వృత్తులుగా గుర్తించిన చతుర్భుజిలో “ఐటీ సేవలు, బీపీఎం, ఇఆర్ అండ్ డి, ఎస్పీడీ” ఉన్నాయి. ఈ చతుర్భుజంలోని ఐటీ సేవల పరిధిలోనూ ‘అనువర్తన అభివృద్ధి’కి అధిక నైపుణ్యంగల మానవశక్తి అవసరమని గుర్తించబడింది. ఎన్ఎస్క్యూఎఫ్ (NSQF) 7, 8 స్థాయులలో ఐటీ సేవల ఉప-రంగానికి సంబంధించి అనేక ఉద్యోగ పాత్రలను ఎస్ఎస్సి ఇప్పటికే సిద్ధంచేసింది. అందువల్ల మొబైల్ అనువర్తన రూపకర్తలకు ఎన్ఎస్క్యూఎఫ్ 5, 6, 7 స్థాయులలో ఐటీ సేవల కింద ఉద్యోగపాత్ర పోషించగల అర్హతలు అత్యావశ్యకం. ఆ మేరకు డిప్లమా, అడ్వాన్స్డ్ డిప్లమా, మొబైల్ అనువర్తన అభివృద్ధి ప్రత్యేకతతో బీవోఏసీ స్థాయి ధ్రువీకరణ పత్రం వంటివి ఉండాలి. తదనుగుణంగా రంగాలవారీ నైపుణ్య మండలి ప్రతిపాదిత ఉద్యోగపాత్రలకు అభ్యర్థులు తగిన అర్హత పొందగలిగేలా ఉన్నతవిద్య-సాంకేతిక సంస్థలు తమ ప్రస్తుత కోర్సులను పునఃసమీకృతం చేయాలి. అందుకోసం సంబంధిత విద్యాసంస్థల నియంత్రణ మండళ్లు, చట్టబద్ధ సంస్థల ఆమోదం పొందాలి. ఈ విధమైన సహకారంవల్ల ఉపాధిహామీ కోర్సుల నిర్వహణకు తోడ్పడటమేగాక ఎస్ఎస్సీ, ఉన్నత విద్యా సంస్థల నుంచి తగు ధ్రువీకరణతో నిపుణ, సుశిక్షిత కార్మికశక్తిని రూపొందించడంలో చోదక పాత్ర పోషించగలవు. సదరు ఎన్ఎస్క్యూఎఫ్ స్థాయి కార్యక్రమాలను విద్యార్థులు అభ్యసిస్తే ఎస్ఎస్సితోపాటు సంస్థల నడుమ ప్రతిభ ప్రదాన బదిలీకి అనుమతితో ప్రత్యేక శిక్షణ తరగతులకు హాజరై తదుపరి కోర్సులకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఈ ఏర్పాటుతోనూ ద్వంద్వ ప్రయోజనాలుంటాయి. మొదటిది… ధ్రువీకరణతోపాటు ఉపాధి లేదా స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యం ఉంటుంది. రెండోది… ఈ విద్యార్థులు ప్రత్యేక కోర్సులద్వారా తమ నైపుణ్యానికి మరింత మెరుగులు దిద్దుకోవచ్చు. తద్వారా ఉన్నత విద్యద-సాంకేతిక విద్యా సంస్థలలో కొన్ని నిర్దిష్ట పై తరగతుల గ్రాడ్యుయేట్ (యూజీ)/ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల తదుపరి సంవత్సరం తరగుతులకు హాజరయ్యే మార్గం అందుబాటులోకి వస్తుంది.
యూజీసీ ఆన్లైన్ (కోర్సులు లేదా ప్రోగ్రామ్‌లు) నిబంధనలు-2018 ఆధారంగా సంబంధిత నియమాలను పాటిస్తూ, నియంత్రణ ప్రాధికార సంస్తల నుంచి తగు అనుమతి పొంది ఎస్ఎస్సి సహకారంతో ఉన్నత విద్య-సాంకేతిక సంస్థలు మొబైల్ అనువర్తన రూపకల్పనపై సహకార ఆన్లైన్ ప్రోగ్రామ్‌లను రూపొందించగలవు. ఆన్లైన్ ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు చతుర్భుజ విధానాన్ని పాటించడం తప్పనిసరి. ఇందులో క్వాడ్రాంట్-I కింద ఈ-ట్యుటోరియల్స్; క్వాడ్రంట్-II కింద ఈ-కంటెంట్; క్వాడ్రంట్-Ill కింద వెబ్ వనరులు, క్వాడ్రంట్- IV కింద సెల్ఫ్ అసెస్మెంట్ భాగంగా ఉంటాయి. దీని ప్రకారం, మొబైల్ అనువర్తనాల రూపకల్పనలో ఆన్లైన్ ప్రోగ్రామ్‌లు, కోర్సులను అందించడంపై నిర్ణయానికి ముందు ఉన్నత విద్య-సాంకేతిక సంస్థలు పైన పేర్కొన్న నాలుగు క్వాడ్రాంట్ల విధానం సాధ్యాసాధ్యాలపై అధ్యయనాలు, సన్నద్ధతను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.
ఇ. సంస్థాగత ఆవిష్కరణాత్మక పద్ధతులు: విద్యార్థులకు మద్దతునివ్వడం కోసం అనేక ఉన్నతవిద్య-సాంకేతిక సంస్థలు మొబైల్ అనువర్తన చట్రాన్ని ప్రత్యేకించి కోవిడ్-19 పరిస్థితుల నడుమ చురుగ్గా వాడుతున్నాయి. ప్రస్తుత దిగ్బంధ కఠిన సమయంలో విద్యాసంస్థలు విద్యార్థులకు ఆన్లైన్ బోధన కోసం “గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్”వంటి దృశ్య-శ్రవణ మాధ్యమ అనువర్తనాలపై పూర్తిగా ఆధారపడ్డాయి. ఇందులో భాగంగా ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం తన విద్యార్థులకు డిజిటల్ పాఠ్యాంశాలు అందించేందుకు వినూత్నంగా పరిమిత స్థాయిలో సొంత మొబైల్ అనువర్తనం వాడటాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను. ఈ మేరకు సదరు “ఇగ్నో ఈ-కంటెంట్ యాప్”ను 5,00,000 ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోగా, దీనికి 3.9 రేటింగ్ లభించింది. విశ్వవిద్యాలయం దీన్ని ఆవిష్కరించిన తర్వాత ఒక్క 2019లోనే విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో 70వేల మందికిపైగా దీనిద్వారా డిజిటల్ పాఠ్యాంశాలను డౌన్లోడ్ చేసుకోవడమే ఈ యాప్ విజయవంతం కావడానికి కారణం. విశ్వవిద్యాలయం అందించే ఈ డిజిటల్ సారాంశం దేశంలో ఎవరికైనా అందుబాటులో ఉండటం ఇంకా ఆసక్తికరమైన అంశం. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ప్రవేశాలు, అసైన్మెంట్ల సమర్పణ, వాటి మూల్యాంకనంసహా తన విద్యార్థులకు సమగ్ర మద్దతు ఇచ్చేవిధంగా తనదైన ప్రత్యేక మొబైల్ అనువర్తనం రూపకల్పనకు విశ్వవిద్యాలయం ప్రస్తుతం కృషిచేస్తోంది.
ఈ. ఉన్నత విద్యా సంస్థలకు అవకాశాలు: విద్యార్థులకు ఆన్లైన్ మద్దతు దిశగా సవాళ్లను అధిగమించడం కోసం దేశీయ సంస్థాగత దృశ్య-శ్రవణ మాధ్యమ అనువర్తనం రూపొందించడానికి తమ వనరులను కేటాయించే అవకాశం ఇప్పుడు దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు లభించింది. మరోవైపు విద్యాసంస్థలన్నిటికీ ప్రస్తుతం ఒక సమగ్ర మొబైల్ అనువర్తనం తక్షణ, ప్రధాన అవసరం కాబట్టి, అందులో కింది అనువర్తనాలను కూడా జోడించవచ్చు.
ఎ. ఈ-లెర్నింగ్, ఈ-ట్యుటోరియల్స్ కోసం దృశ్య-శ్రవణ మాధ్యమ అనువర్తనం
బి. ముందుగా రికార్డ్ చేసిన దృశ్య-శ్రవణ పాఠ్యాంశాలతో కూడిన ఈ-కంటెంట్.
సి. అసైన్మెంట్లు/ట్యుటోరియల్స్ కోసం ఈ-అసెస్మెంట్
డి. ఈ-రిజిస్ట్రేషన్/అడ్మిషన్
ఇ. సహాధ్యాయుల మధ్య ఆదానప్రదానానికి ఈ-ఫోరమ్
ఎఫ్. ఆన్లైన్ పరీక్షలు
అదేవిధంగా ఉన్నత విద్యాసంస్థలు మొబైల్ అనువర్తన ఆధారిత అభ్యాస నిర్వహణ వ్యవస్థను రూపొందించుకుంటే మరింత పరివర్తనాత్మకంగా ఉంటుంది. ప్రతి కోర్సుకు సంబంధించి ప్రవేశపూర్వ దశ కౌన్సెలింగ్ నుంచి తుది ఉత్తీర్ణత ధ్రువీకరణ పొందేవరకూ ప్రతి విద్యార్థి అభ్యసన చక్రాన్ని పర్యవేక్షించగలిగేదిగా ఈ వ్యవస్థ రూపొందాలి. ఇటువంటి భవిష్యద్దార్శనిక మొబైల్ అభ్యసన అనువర్తనాలకు ఇటు ఉన్నత విద్యలోనేగాక అటు ప్రాథమిక స్థాయిలోనూ బోధన-అభ్యసన స్వరూపం మొత్తాన్నీ పరివర్తనాత్మకంగా మార్చేయగల అపార సామర్థ్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో సువిశాల భారతదేశం, అందులో అపార విస్తృతిగల విద్యారంగం దృష్ట్యా విద్యాసంబంధ మొబైల్ అనువర్తనాల డౌన్లోడ్ సంఖ్య, వాటి చురుకైన వినియోగం ఏ స్థాయిలో ఉంటాయో ఒక్కసారి ఊహించండి. అప్పుడు మనం ఈ మొబైల్ అభ్యసన అనువర్తనాలకు- ప్రజాస్వామ్య విద్యా అనువర్తనాలుగా, అందరికీ సమానంగా విద్యనందించగల శక్తిసామర్థ్యాలున్న సాధనాలుగా పునర్నిర్వచనం ఇవ్వాల్సి ఉంటుందేమో!
ఉ. డిజిటల్ అంతరం భర్తీ: దేశంలో ఇంటర్నెట్ వ్యాప్తిని 50 శాతం నుంచి పెంచేదిశగా డిజిటల్ అంతరాన్ని భర్తీచేయగల దేశీయ, వినియోగదారుహిత మొబైల్ అనువర్తనాలను రూపొందించడం చాలా ముఖ్యం. ఈ విషయంలోనూ ఐటీ సంస్థల సహకారంతో విద్యాసంస్థలు కీలక పాత్రను పోషించవచ్చు. ఆ మేరకు కింద పేర్కొన్న అంశాల సంబంధిత డిజిటల్ అంతరాన్ని పూరించగల మొబైల్ అనువర్తనాలను రూపొందించవచ్చు.
• డిజిటల్ అక్షరాస్యత: చదవడం/రాయడంలో ప్రాథమిక పరిజ్ఞానం అందించే మొబైల్ అనువర్తనాలు ప్రయోజనకర ఉపకరణాలు కాగలవు. ఆ మేరకు భారత డిజిటల్ అక్షరాస్య పౌరులుగా నిర్ధారించి, ధ్రువీకరణ ప్రదానం చేసే సంబంధిత సంస్థలు/శాఖలకు ఈ అనువర్తనాలను జోడించాలి;
• డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత: బ్యాంకులు, ఆర్థిక సంస్థల సంబంధిత సమాచారం, జన్‌ధన్ ఖాతాల నిర్వహణ, క్రెడిట్/డెబిట్ కార్డు సౌకర్యాల వినియోగం, యూపీఐ ఆధారితంసహా ఆన్లైన్ చెల్లింపులు తదితరాలపై దేశంలోని జనాభాకు అవగాహన కల్పించే మొబైల్ అనువర్తనాలను కూడా రూపొందించవచ్చు. వీటిపై ఇచ్చే కసరత్తులను విజయవంతంగా పూర్తిచేసినట్లు మూల్యాంకనం చేసిన తర్వాత ‘డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత’ ధ్రువీకరణ పత్రం కూడా జారీచేయవచ్చు. ఇటువంటి అనువర్తనాలు రైతులకు, సంఘటిత-అసంఘటిత కార్మికులకు ఎంతో సహాయకారులు కాగలవు.
• అభ్యసనపూర్వ గుర్తింపు: ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం (పీఎంకేవీవై) కింద అభ్యసనపూర్వ గుర్తింపు (RPL) అంటే- అధికారిక/ అనధికారిక/సమాచారాధారిత అభ్యసనంద్వారా ఒక వ్యక్తికిగల వివిధ నైపుణ్యాలు, పరిజ్ఞానం, అనుభవంపై అంచనాగా పరిగణించాలి. పీఎంకేవీవై కింద ఐదంచెల ఆర్పీఎల్ అంటే:- చలనశీలత: నైపుణ్యంగల… ధ్రువీకరణలేని అభ్యర్థుల చలనశీలత సంబంధ కార్యకలాపాలు; కౌన్సెలింగ్- పరీక్షకు ముందు తనిఖీ: ఉద్యోగపాత్రకు తగిన ముందస్తు పరిజ్ఞానం, నైపుణ్యం అంచనావేసే పరీక్ష; పునశ్చరణ: నిర్దిష్ట అంశంలో 6 గంటలపాటు శిక్షణ, ఇందులో 4 గంటలపాటు సాఫ్ట్ స్కిల్స్, 2 గంటలపాటు వ్యవస్థాపన అంచనా పద్ధతులు భాగంగా ఉంటాయి. తుది మూల్యాంకనం: కీలక, కీలకేతర జాతీయ వృత్తిగత ప్రమాణాలు (NOS), ధ్రువీకరణ, మార్కుల జాబితా, చెల్లింపు; పీఎంకేవీవై ఆర్పీఎల్ ధ్రువీకరణ పత్రం జారీ, మార్కుల జాబితా, చెల్లింపులను ఒకే మొబైల్ అనువర్తనంలో ఇమిడిస్తే డిజిటల్/ఆన్లైన్ ఆర్పీఎల్ సాధన సుగమం అవుతుంది.
భారత్‌లో ఉన్నత-సాంకేతిక విద్యాభ్యాసానికి బలమైన మౌలిక వసతులున్నాయి. తదనుగుణంగా నైపుణ్యం, సాంకేతిక మానవశక్తి నిండిన ప్రతిభగల యువతరం సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దీంతో మన దేశం అద్భుత యువశక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇవన్నీ సహకార చట్రంతో ఏకమైతే మనకు నాణ్యత నిండిన దేశీయ మొబైల్ అనువర్తనాలు సమృద్ధిగా అందుబాటులోకి వస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. ఇవి మన జీవితంలోని అన్ని అంశాలనూ ఏకీకృతం చేస్తూ మరింత సామాజిక-సాంస్కృతిక, విద్యాసంధానంవైపు నడిపిస్తాయి. సంస్థాగత-పారిశ్రామిక సహకార కృషితో ఈ గమ్యాన్ని మనం చేరుకోగలం. అలాగే అటు ఉన్నత విద్యాసంస్థలకు, ఇటు సమాచార సాంకేతిక పరిశ్రమలకు ఇది ఉభయతారకం కాగలదనడంలో అతిశయోక్తి లేదు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు,
ఉప కులపతి
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ