- యూనివర్సిటీలు ప్రోత్సహించాలి..ఈ-కామర్స్ విద్యపై దృష్టి పెట్టాలి
- జాతీయ వెబినార్‌లో గవర్నర్ తమిళి సై
అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. యూనివర్సిటీలు పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. విద్యార్థులలో ఉద్యోగ నైపుణ్యాలతో పాటు, ఎంటర్ప్రెన్యూరియల్ నైపుణ్యాలు కూడా పెంపొందించాలని డాక్టర్ తమిళి సై అన్నారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘‘జాతీయ విద్యా విధానం 2020 : కామర్స్ బిజినెస్ ఎడ్యుకేషన్ దృక్పథాలు’’ అన్న అంశంపై నేషనల్ వెబినార్‌లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020 భారతదేశంలోని విద్యా వ్యవస్థను 21వ శతాబ్దం అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దడానికి రూపొందించారని తెలిపారు.
ఆత్మ నిర్బర్ భారత్‌గా ఎదగాలంటే ఉన్నత విద్యా వ్యవస్థలో ఉత్కృష్టత, విద్యార్థులలో నైపుణ్యాలు అత్యంత ఆవశ్యకమని డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. భారతదేశంలో ఈ కామర్స్ బిజినెస్ చాలా వేగంగా ఎదుగుతుందని, ఈ విస్తరణలో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఈ- కామర్స్ విద్యపై కూడా దృష్టిసారించి భవిష్యత్ నాయకులను తయారు చేయాలని గవర్నర్ సూచించారు. మారుతున్న వాణిజ్యము, వ్యాపారం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవాలని గవర్నర్ సూచించారు.
హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్‌గా, అలాగే ఫార్మస్యూటికల్ హబ్‌గా ఎదుగుతున్నదని, ఇదే కోవలో కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ రంగాలలో కూడా ఒక హబ్‌గా ఎదగాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ దిశగా కృషి సాగాలన్నారు. ప్రాక్టికల్ ఓరియంటెడ్, కేస్ స్టడీ పద్ధతులలో, ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడం ద్వారా విద్యార్థులను కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ రంగాలలో భవిష్యత్తు లీడర్‌గా తీర్చిదిద్దాలని డాక్టర్ తమిళిసై పిలుపునిచ్చారు.