Take a fresh look at your lifestyle.

తిరోగమనంలో నవనాగరికం

ఎక్కడ నాగరిక ప్రస్థానం ఆరంభమైనదో తిరిగి అక్కడికే  చేరుకునే అత్యంత దారుణమైన పరిస్థితిని మానవులు కొని తెచ్చుకోవడం విడ్డూరం. కొండల్లో, కోనల్లో, అడవుల్లో జంతువులను వేటాడి,పచ్చి మాంసాలను భుజించి,ఆకులు,అలాలను ఆహారం గా స్వీకరిస్తూ మూగ సైగలు,వింత శబ్దాలు మనుషుల మధ్య  అనుసంధాన ప్రక్రియగా  ఉన్న నాటి అనాగరిక కాలం గతించి,నాగరిక ప్రపంచం రూపుదిద్దుకున్న నేటి తరుణంలో మనిషి తిరిగి ఆదిమానవ సంస్కృతి వైపు ఆసక్తి చూపడం అత్యంత బాధాకరం.

మనం నాగరిక ప్రపంచంలో అనాగ రికంగా జీవిస్తున్నాం. ఇదే ఆధునికమని భ్రమి స్తున్నాం.ఆ భ్రమలో పడి మనం కూర్చున్న కొమ్మను మనమే నరక్కుంటున్నాం. సంస్కారమనే శోభతో విరాజిల్లే నాటి కాలం నశించింది… చెట్టుకొమ్మపై సుఖనిద్ర పోవాలనే చేటు కాలం దాపురించింది. వినయవిధేయతలు, గౌరవ మర్యాదలనే పుట్టుకతో వచ్చిన కవచకుండలాల వంటి ఆభూషణాలను త్యజించి, మతిలేని గతితప్పిన అలంకారాలతో నగ్న సంస్కృతిని తలపించే  పాశ్చాత్య మూసలో విహరిస్తుంది యువత.చదువులు పట్టాలకోసమే కాని ప్రతిభకు పనికిరావు. విద్యావంతులంటే ఒకప్పుడు అంతా గౌరవించేవారు.ఇప్పుడు విద్య కు విలువ లేదు…విద్యావంతులకు ఎలాంటి గౌరవమూ లేదు.

ఇది మన స్వయంకృతాపరాధం.వ్యసనాలతో భ్రష్టుపడుతున్న యువత మెదళ్ళలో అసభ్యత అనే బురదపేరుకు పోయి, ఆటవికమనే బీజాలు మొలకెత్తి, సకల అవలక్షణాలతో కూడిన బురదపూలు పూస్తున్నాయి.బురదనేల వంటి మెదళ్ళతో సమాజాన్ని బురదలోకి నెట్టేసే అపసవ్య ధోరణులపైవే యువత పయనం యథేచ్ఛగా సాగుతున్నది.రాతియుగపు పోకడలు పునరావృతమవుతున్నాయి.

ఇలాంటి అస్తవ్యస్థ దుస్థితిలో పీకలోతు సుడిగుండంలో కూరుకుపోయి,పైశాచికానందం పొందుతున్న యువతను ఆ ఊబిలో నుండి  బయటకు తీసుకు రావాలి.విద్యార్థి దశ నుండే యుక్తాయుక్తవిచక్షణతో కూడిన నడవడికను నేర్పే విజ్ఞానాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉపదేశించాలి.’’అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు…తినగ తినగ వేము తియ్యనుండు..’’ అన్న చందంగా మన ప్రయత్నమే ఏనాటికైనా ఫలసిద్ధి నిస్తుంది. విద్యార్థులకు మన ప్రాచీన కాలం నాటి మహాగ్రంథాలలోని విలువల సారాంశాన్ని సంక్షిప్త రూపంలో బోధించాలి.

నేటి కాలంలో  పురాణైతిహాసాలు కంటగింపుగా మారాయి.భగవద్గీత శవాల మధ్య స్వల్ఫకాలం వినిపించే విషాదగీతంలా,తూతూ మంత్రపు ప్రహసనంలా మారిపోయింది. ఎవరూ ఏ మతాన్ని విమర్శించనక్కరలేదు… విస్మరించన క్కరలేదు..పరిహాసం  చేయనక్కరనూలేదు..ఇతరుల మనోభిప్రాయాలను గాయపరచవలసిన అవసరం అంతకన్నా  లేదు.కాని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తమైన విలువలనే నిధులను వలువలు  వదిలేస్తున్న యువతకుఅందించాలి.భగవద్గీత,రామాయణం,భారతం లాంటి మహోత్కృష్ట మైన ప్రాచీన గ్రంథాలలోని క్లుప్త సారాంశాన్ని గ్రహించాలి.భారత,రామాయణాలు నిజమా? కల్పితమా అనే మీమాంస వదిలేయాలి. గతంలో మనం లేము.

ముద్రణా యంత్రాలు లేని రోజుల్లో తాళపత్రాలతో వ్రాయబడ్డ ప్రాచీన గ్రంథాలలోని  ఔచిత్యాన్ని, విశిష్ఠతను, ఆంధ్రీకరణ చేసిన మహామహుల విద్వత్‌ ‌సంపదను తక్కువగా అంచనా వేయరాదు. గతకాలపు భారతం చదివితే వర్తమానంలో జరుగుతున్న వాస్తవ దృశ్యాలన్నీ  కళ్ళకు కట్టినట్టు మనముందు సాక్ష్యాత్కరిస్తాయి. భగవద్గీత అత్యద్భుత వర్ణన. రాజనీతి,యుక్తాయుక్త విచక్షణ, సమయానుకూల ద్ఫక్ఫథం  మన కళ్ళకు కట్టినట్టు రచించిన కమనీయ  కావ్యం ‘‘భగవద్గీత’’.  మానవుడు ఎలా జీవించాలో, ఎలా  జీవించకూడదో తెలియచెప్పే విశ్లేషణాత్మక సందేశమే  ‘‘రామాయణం’’. ఈర్ష్యాద్వేషాలతో మంచితనాన్ని అసమర్ధగా భావించి,వంచనపు పనులు చేస్తూ,మూర?ంగా ప్రవర్తించే ప్రబుద్ధులకు చివరకు ఏ గతులు ప్రాప్తిస్తాయో తెలియ చేసే అద్భుత వర్ణనతో కూడిన కావ్యరాజం ‘‘మహాభారతం’’. మిడిమిడి జ్ఞానంతో మనం ఈ మహా గ్రంథాలలోని భాష్యానికి వక్రభాష్యాలు వెదకడం శోచనీయం.మన జ్ఞానం జడివానలోని ఒక చిరునీటి తుంపర లాంటిది-మహా సముద్రంలోని నీటి బొట్టులో  వెయ్యోవంతు లాంటిది.

భారత,భాగవత,రామాయణ లోని కీలకమైన భావనలను నేటి విద్యార్థులకు, యువతకు నేర్పిస్తే ‘‘గుడ్డిలో మెల్లలా..’’ కొంతయినా ప్రయోజనం సిద్ధించవచ్చు.  భారత,రామాయణ,భాగవతాలే కాదు బైబిల్‌,‌ఖురాన్‌ ‌వంటి  అన్ని మతగ్రంథాలన్నీ సత్ప్రవర్తననే ప్రబోధిస్తాయి. దారులెన్నయినా గమ్యం ఒకటేనన్న ప్రాథమిక అవగాహన మనలో కలగాలి.ప్రాచీన గ్రంథాలలోని  సారాంశాన్ని గ్రహించి, ఈర్ష్యాద్వేషాలను విస్మరిస్తే ఈ సమాజమే ఒక దేవాలయంలా మనకు నేత్రపర్వం గావిస్తుంది. విశిష్ఠ ప్రాచీన విజ్ఞాన సాంగత్యమే నేటి  శిథిల వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించగలదు. మతమంటే మానవత్వానికి చిరునామా కావాలి. కుల మంటే సంస్కారానికి నెలవు కావాలి. ప్రాంతాలు, సంస్కృతులు, భాషలు ఒకరి జీవన విధానాన్ని మరొకరు, ఒకరి విజ్ఞానాన్ని మరొకరు పంచుకుని సాన్నిహిత్యం తో మెలగడానికి ఉపయోగ పడాలి. సంకుచిత ధోరణులు వీటికి వేరే నిర్వచనం కల్పించి, ప్రజల మధ్య విబేధాలకు కారణం కారాదు. విశాల దృక్పథం తో కూడిన వివేకవంతమైన నాగరికత పురుడు పోసుకోవాలి. ఆనాడే మానవ మనుగడ నల్లేరుపై నడకలా సాగుతుంది.
-సుంకవల్లి సత్తిరాజు.
970490346

Leave a Reply