Take a fresh look at your lifestyle.

బతుకు భరోసా కోసం పంతుళ్లు దీక్ష ..!

తెలంగాణ రాష్ట్రానికి అవమానం‌-‌ రాణి రుద్రమ

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రైవేటు ఉపాధ్యాకులు, అధ్యాపకులు తమ బతుకు భరోసా కోసం దీక్ష చేయడం తెలంగాణ రాష్ట్రానికి అవమానమని యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకున్నది పాఠాలు చెప్పే పంతుల్లు అన్నమో రామచంద్ర అని అడుక్కు తినేందుకు కాదన్నారు. తెలంగాణలో ప్రతి అంశంలో ఏది ముఖ్యము, ఏది ముఖ్యం కాదు, ఏ సమస్యను ఎట్ల పరిష్కరించాలని అనే కనీస జ్ఞానం, అవగాహణ లేని ముఖ్యమంత్రి  ఉన్న నేపథ్యంలో  పంతుల్లు చెప్పులు అమ్ముకుంటున్నా చూసుకుంటూ ఉంటున్నాం. కరోనా వేళ ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు చేపట్టిన దీక్షలో రాణిరుద్రమ పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  సార్, టీచర్, ఆచార్య అని గౌరవంగా పిలిపించుకునే పంతుల్లు ధర్నాలు చేయడం అంటే మనం ఎంత వెనక్కు వెళ్లామో ఆలోచించుకోవాలి. కరోనా కాలంలో స్కూళ్లు, కాలేజీలు మూసివేయబడి ఉపాధి కోల్పోయిన టీచర్లు, లెక్చరర్లకు ప్రభుత్వం నుంచి వారికి ఓ భరోసా కావాలి. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి.  కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థ రద్దు చేసి వారందరినీ రెగ్యులరైజ్ చేయాలి.విద్యార్థుల దగ్గర ఫీజులు తీసుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలు టీచర్లను, లెక్చర్లను తొలగించడం బాధాకరం. ఈ విషయంపై ప్రభుత్వం విచారణ జరపాలి. విద్యాశాఖలో ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ప్రైవేటు యాజమాన్యాలకు నోటీసు జారీ చేయాలి. వాళ్ల దగ్గర పనిచేస్తున్న టీచర్లు, లెక్చర్లను ఏ ప్రాతిపధికన తొలగించారో సమాధానం అడగాలి. కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన ప్రతి టీచర్, లెక్చరర్ కు నెలకు రూ. 10 వేల ఆర్థికసాయం ఇవ్వాలి. ఆత్మహత్యలు చేసుకున్న ప్రైవేటు టీచర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‍ గ్రేషియా చెల్లించాలి. అటు విద్యా సంస్థల సమస్యలపై గతంలో తాము కొట్లాడతాం.  ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం పోరాడాం. విజిలెన్స్ దాడులను వ్యతిరేకించాం.  అలాంటిది ఇప్పుడు ప్రైవేటు టీచర్లు, లెక్చర్లను కాదని  ఎందుకు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నరో చెప్పాలి.
  నిన్నటి దాకా ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తున్నదని చెప్పిన కేజీ టు పీజీ విద్యా సంస్థలు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే  ఆరేండ్లుగా ఒక్కసారి కూడా మీ గురించి మాట్లాడని పల్లా రాజేశ్వర్‍రెడ్డి చుట్టు ఎందుకు తిరుగుతున్నరో సమాధానం చెప్పాలి.  విద్యా సంస్థల యాజమాన్యాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా విజిలెన్స్ దాడులు చేయించిన ప్రభుత్వానికి, ప్రగతి భవన్‍లో పాలేరు పనిచేసే పల్లా రాజేశ్వర్‍రెడ్డికి మీ ప్రయోజనాలు తాకట్టుపెట్టి ఎందుకు కొమ్ముకాస్తున్నరో చెప్పాలి. తక్షణమే ప్రభుత్వం, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు.. ఉపాధికోల్పోయిన టీచర్లు, లెక్చరర్లతో చర్చలు జరపాలి.. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలి. వాళ్లకు జీతభత్యాలు చెల్లించాలి.. లేదా ప్రభుత్వం  చేత డబ్బులు ఇప్పించాలని యువ తెలంగాణ పార్టీ తరపున రాణీ రుద్రమ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో  తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ పాల్వాయి రవి, తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు షేక్ హుస్సేన్, ప్రైవేటు టీచర్ల సంఘం మునుగోడు నాయకులు అశోక్, నర్సింహ, యువజన సంఘాల నేత గుండ్లపల్లి బంగారయ్య, పలువురు ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు పాల్గొన్నారు.

Leave a Reply