కొరోనాపై సీఎం కేసీఆర్ రివ్యూ చేయడం లేదని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వైద్య శాఖలో ఉన్న లోపాలు బయటకు వస్తాయనే భయంతో సమీక్ష చేయడం లేదని ఆరోపించారు.మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డితో కలిసి భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ…వైద్య శాఖకు నిధులు విడుదల చేయండని డిమాండ్ చేశారు. ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల చెబుతున్నారు కానీ బయట ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. లక్ష 82 వేల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో వైద్యం గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో 50 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటళ్లలో రేట్లు ఫిక్స్ చేయాలని ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించాలని అన్నారు.
17 మంది అధికారులను, 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలుగా నియమించాలని అన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ… కొరొనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం ఇష్టం లేకపోతే కోవిడ్-19 పేరుతో ట్రీట్మెంట్ అందించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా స్థాయిలో వెంటిలేటర్లు లేవని జిల్లాలో వెంటిలేటర్ల సౌకర్యం కల్పించే బాధ్యతను సర్కార్ విస్మరించిందని విమర్శించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ తీరును కితాబు ఇచ్చిందంటున్నారని, ఏ విషయంలో ఇచ్చిందో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ధైర్యం ఇవ్వడం కనీస బాధ్యతగా వ్యహరించడం లేదన్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టాలని స్పీకర్ ఆదేశాలు ఉన్నాయని, మరి ఎమ్మెల్యే కానీ వ్యక్తి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఎలా ప్రెస్ మీట్ పెట్టారని ప్రశ్నించారు. అసెంబ్లీ చిల్లర రాజకీయ వేదికగా మార్చొద్దని, ఎమ్మెల్యే కానీ వ్యక్తి ప్రెస్ మీట్ పెడుతుంటే అసెంబ్లీ సెక్రెటరీ ఏంచేస్తున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు.
మంత్రి ఈటల ఒక బొమ్మ.. కేసీఆర్ కీ ఇస్తేనే మాట్లాడుతారు : జగ్గారెడ్డి
తెలంగాణ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి ప్రగతి భవన్లో సీఎం, మంత్రులు సెక్రటేరియట్లో బాత్ రూమ్ల వాస్తుపై మీటింగ్లు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ…సీఎం హోదాలో గాంధీ, జిల్లాల హాస్పిటల్స్ పర్యటించకుండా సెక్రటేరియట్ నిర్మాణంపై సీఎం దృష్టి పెట్టారని విమర్శించారు. ప్రతిపక్షాలు కొరొనా విషయంలో గగ్గోలు పెడుతుంటే సీఎంకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇంతటి పరిస్థితి ఉండేది కాదన్నారు. ఎన్నికల ముందు రైతుబంధు, బీమా ఇస్తే వోట్లు వేస్తారు లే అనే ధీమాలో సీఎం ఉన్నారని తెలిపారు. వైద్యమంత్రి ఈటల రాజేందర్ ఒక బొమ్మ అని, సీఎం ఎప్పుడు కీ ఇస్తే అప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో కొరొనా విషయంలో జరగరానిది జరిగితే ఈటలపై సీఎం నెట్టివేస్తారని అన్నారు. కొరొనా వల్ల ఉన్నతాధికారులు సైతం ప్రాణాలను కోల్పోతున్నారని ప్రభుత్వం కొరొనా విషయంలో స్పందించకపోతే కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లి సీరియస్గా పోరాటం చేస్తామన్నారు. టీఆరెస్ నేతలందరూ కొరొనాను వదిలేసి చాపలు, చెట్లు అని ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని విమర్శించారు.