“అంతర్జాతీయ వాణిజ్య రీత్యా ఇండో-పసిఫిక్ ప్రాంతం చాలా ముఖ్యమైంది. కనీసం 38 దేశాలకు ఈ ప్రాంతం కూడలిగా ప్రపంచ
ఉపరితల వైశాల్యంలో 44 శాతం, ప్రపంచ జనాభాలో 65 శాతం, ప్రపంచ జీడీపీలో 62శాతం, ప్రపంచ వాణిజ్యంలో 46శాతం వాటాతో విరాజిల్లుతోంది. కొన్ని దశాబ్దాలుగా చైనా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో మరో ధ్రువంగా రూపాంతరం చెందింది. చైనా విస్తరణ వాంఛతో టిబెట్, హాంకాంగ్, తైవాన్ పై ఆధిపత్యం చలాయిస్తూన్నది. వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పిన్స్ , బ్రునే తదితర దేశాలతో దక్షిణచైనా సముద్ర విషయంలో చైనా ఘర్షణకు దిగుతూనే ఉంది.”
ఒక ప్రాంత భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, ప్రాధాన్యత రిత్యా ఆ ప్రాంతానికి ప్రపంచ •వ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడుతుంది. గతంలో అట్లాటిక్ మహాసముద్ర ప్రాంతం భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, ప్రాధాన్యత రిత్యా ఆ ప్రాంతానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆ ప్రాంతంపై ఆధిపత్యానికై రెండు రాజకీయ సైద్ధాంతిక వైరుధ్యా భావాలున్న దేశాల మధ్య జరిగిన పోటీ ఫలితమే రెండో ప్రపంచ యుద్ధం. ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతం భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, ప్రాధాన్యత రీత్యా ఆ ప్రాంతంపై ఆధిపత్యానికి సైద్ధాంతిక వైరుధ్య భావాలున్న దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు మరో ప్రపంచ సంగ్రామానికి వేదిక కానుందా అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
అంతర్జాతీయ వాణిజ్య రీత్యా ఇండో-పసిఫిక్ ప్రాంతం చాలా ముఖ్యమైంది. కనీసం 38 దేశాలకు ఈ ప్రాంతం కూడలిగా ప్రపంచ ఉపరితల వైశాల్యంలో 44 శాతం, ప్రపంచ జనాభాలో 65 శాతం, ప్రపంచ జీడీపీలో 62శాతం, ప్రపంచ వాణిజ్యంలో 46శాతం వాటాతో విరాజిల్లుతోంది. కొన్ని దశాబ్దాలుగా చైనా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో మరో ధ్రువంగా రూపాంతరం చెందింది. చైనా విస్తరణ వాంఛతో టిబెట్, హాంకాంగ్, తైవాన్ పై ఆధిపత్యం చలాయిస్తూన్నది. వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పిన్స్ , బ్రునే తదితర దేశాలతో దక్షిణచైనా సముద్ర విషయంలో చైనా ఘర్షణకు దిగుతూనే ఉంది. స్పాట్లీ, పారసెల్ దీవుల్లో భవనాలను నిర్మిస్తూ జపాన్ తో డియోయు దీవుల విషయంలో వివాదం పెట్టుకుంది.
దక్షిణాసియా లో సమతుల్యత దెబ్బతీసే విధంగా భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక, మాల్దీవుల్లో చైనా సముద్ర ప్రాజెక్టులు చేపడుతున్నది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా పాకిస్తాన్ తో కలిసి వివిధ ప్రాజెక్టులు చేపట్టే ప్రయత్నం చేస్తున్నది. లడఖ్ నుంచి టిబెట్ మీదుగా హాంకాంగ్, తైవాన్ వరకు, శ్రీలంక నుంచి ఫిలిప్పిన్స్ వరకు, జపాన్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఘర్షణ వాతావరణం సృష్టిస్తూనే ఉంది . మరో వైపు ఇండో-పసిఫిక్ ప్రాంతంపై దృష్టి సారించింది. అమెరికా జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాను కలుపుకొని క్వాడ్ పేరిట అవతరించి, భౌగోళిక ఆర్థిక సహకారం నుంచి సైనిక సహకారం వరకు ఒప్పందాలను విస్తరించు కుంటున్నది.
క్వాడ్ ప్లేస్ పేరిట ఇండో-పసిఫిక్ ప్రాంత దేశాలకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉంది. చైనా విస్తరణ వాంఛ వల్ల భారత్ వంటి దేశాలు అమెరికాకు చేరువ వుతున్నాయి. 2002లో జీ యెస్ యం ఐ ఎ తో ప్రారంభమైన అమెరికా, భారత్ ఒప్పందాలు 2016లో లెమోవా, 2018లో కామ్ కాసా, 2020లో బెకా తో అమెరికా-భారత్ సైన్యాలు అనుసంధానమవు తున్నాయి. భవిష్యత్తులో అమెరికా సైన్యాలు యథేచ్ఛగా భారత భూభాగాలను ఉపయోగించుకునే అవకాశా లుంటాయి. భవిష్యత్తులో చైనా ఉత్తర కొరియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ తోపాటు ఇండో- పసిఫిక్ ప్రాంతంలో తనతో కలిసి వచ్చే దేశాలతో సైనిక ఒప్పందం ఏర్పరచుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అమెరికా చైనా మధ్య మొదలయిన వాణిజ్య యుద్ధం కరోనాతో ఊపందుకుంది. చైనా – వుహన్ నగరం లోనే కరోనా వైరస్ పుట్టిందని స్వయంగా అమెరికా అధ్యక్షుడే ఆరోపించడంతో ఈ రెండు దేశాల మధ్య సంఘర్షణ మరింత పెరిగింది. .
గతంలో మాదిరి, న్యూడీల్, మార్షల్ ప్రణాళికలతో కరోనాతో అతలాకుతలం అయిన దేశాల ఆర్థిక వ్యవస్థలను చక్కపరిచే మిషతో అమెరికా సిద్ధం కావచ్చు. కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక కష్టాలు తీర్చే నెపంతో ఇండో- పసిఫిక్ ప్రాంతంపై పట్టుబిగించే ప్రయత్నం చేయవచ్చు. అదే వరుసలో చైనా కూడా తన మిత్రదేశాలకు కరోనా కాణంగా ఏర్పడ్డ ఆర్థిక కష్టాలు తీర్చేనెపంతో, అమెరికాకు వ్యతిరేకంగా ఒక ప్రణాళికతో ముందుకు రావచ్చు. ఇప్పటికైనా ఇండో-పసిఫిక్ ప్రాంత దేశాలు ధృతరాష్ట్ర కౌగిళ్ళనుంచి బయటపడి సొంత బలబలాలపై, పరస్పర ప్రయోజనాలకై పోరాడాలి.
జుర్రు నారాయణ యాదవ్
టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్నగర్, 9494019270.