Take a fresh look at your lifestyle.

స్వరాష్టంలోనూ స్థానికత అంశం

స్థానికంగా ఉన్నవారికి కాకుండా ఇతర ప్రాంతాల నుండి వొచ్చిన వారు ఉద్యోగాలను తన్నుకు పోతున్నారన్న అంశంపైనే తెలంగాణ పోరాటం జరిగిందన్న విషయం తెలియంది కాదు. కాని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తిరిగి అలాంటి అంశం మళ్ళీ తెరమీదకు రావడం ఆవేదన కలిగిస్తున్న అంశం. ఇది ఇప్పుడు రాష్ట్రంలో చిలికి చిలికి గాలి వానగా తయారయింది. మరోసారి ప్రతిపక్ష పార్టీలకు ఇది ఒక ఆయుధంగా మారగా, ఇప్పటికే అనేక విమర్శలను మోస్తున్న అధికార పార్టీకి మరో ఎదురు దెబ్బకు కారణమయింది. చివరకు ధర్నాలు, లాఠీ చార్జీలు, అరెస్టులు, కోర్టుల పరిధికిది చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు పెద్ద గందరగోళాన్నే సృష్టించించాయి. రాష్ట్రమంతా ఈ విషయంలో అట్టుడికి పోతున్నది. ప్రభుత్వ ఉత్తర్వులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాగరణ కార్యక్రమాన్ని చేపట్టిన భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ను అరెస్టు చేయడంతోపాటు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్‌ ‌రిమాండ్‌లో ఉంచడం రాష్ట్రంలో ఇప్పుడు ఇక విధంగా యుద్ధ వాతావరణానికి కారణమయింది. బండి సంజయ్‌ను అరెస్టు చేసిన దానికన్నా, అరెస్టు చేసిన విధానంపైన రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి బిజెపి నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించకుండా జారీ చేసిన 317 జివో అనేక మంది ఉపాద్యాయులను ఆందోళనపర్చడం, కొందరు ఈ విషయంలో ప్రాణాలు కోల్పోవడం లాంటి సంఘటనల కారణంగా ఎట్టి పరిస్థితిలో ఈ జివోపై పునరాలోచన చేయాలని బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేస్తూ జాగరణ దీక్షను చేపట్టాలని నిర్ణయించడమే ఈ యుద్ధ వాతావరణానికి కారణమయింది. ఆయన దీక్షకు రాష్ట్ర పోలీసు అధికారులు అనుమతి ఇవ్వక పోవడంతో ఆయన తన పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టాడు.

అయితే పోలీసులు తన దీక్షను భగ్నం చేస్తారని ముందస్తుగానే ఊహించుకున్న బండి సంజయ్‌ ‌కార్యాలయం లోపలివైపున తాళాలు వేసుకుని కూర్చోవడం, దాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు గ్యాస్‌ ‌కట్టర్‌లను, గడ్డపారలను తీసుకొచ్చి తలుపులను పగులగొట్టి లోపల ఉన్న బండి సంజయ్‌ను బలవంతంగా అరెస్టుచేసిన తీరుపైనే ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ప్రజల డిమాండ్‌కు మద్ధతు పలకడం తప్పు ఎలా అవుతుందని వారు వాదిస్తున్నారు. ప్రభుత్వం విధానం చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా భూ స్థాపితం చేస్తున్నట్లు ఉందని ఈ సంఘటనపై బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, హుజురాబాద్‌ ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌తదితర నాయకులు ప్రభుత్వం తీరుపై మండి పడుతున్నారు. వీరితోపాటు కాంగ్రెస్‌, ‌లెఫ్ట్ ‌పార్టీలు కూడా ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తున్నాయి. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల అంతకు ముందు ఒకే జిల్లా పరిధిలో ఉన్న మండలాల్లో కొన్ని ఒక జిల్లా పరిదికి, మరికొన్ని మరో జిల్లా పరిధిలోకి వెళ్ళాయి. కాగా బదిలీల విషయంలో సీనియర్లు పట్టణ ప్రాంతాలకు, జూనియర్లు మారుమూల ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా స్థానిక ఉద్యోగి ఇప్పుడు స్థానికుడు కాకుండా పోయాడన్నది ఆవేదన కలిగిస్తున్న అంశం.

కాగా ఈ బదిలీల విషయంలో అనేక అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. న్యాయమైన ఉద్యోగులకు అన్యాయం జరుగడంతో కొందురు తీవ్ర మనస్థాపానికి గురై మరణించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరికి మెడికల్‌ ఎమర్జెన్సీ అవసరముండగా వారు సరైన పత్రాలను చూపించినప్పటికీ సంబంధిత అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కుమ్మక్కు అయి అలాంటి వారినికూడా దూర ప్రాంతాల బదిలీ జాబితాలో చేర్చారు. ఈ విషయంలో ఉద్యోగుల పక్షాన మాట్లాడాల్సిన ఉద్యోగ సంఘ నాయకుల నోళ్ళు ఎందుకు మూతపడ్డాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఎదిరించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని ఉద్యమిస్తున్న ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బెంగాల్‌, ‌కేరళలోలాగా దౌర్జన్యాలకు, హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనికి కోవిడ్‌ ‌నిబంధనలను సాకుగా చూపిస్తున్నారని వారు ఆక్రోషిస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు లేని ఆంక్షలు కేవలం ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలపైనే పెట్టడమేంటని వారు నిలదీస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్‌ అరెస్టుపై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం సీరియస్‌గా ఉన్నట్లు తెలస్తున్నది. దీనికి ప్రతిగా త్వరలో భవిష్యత్‌ ‌కార్యక్రమాన్ని రూపొందించే పనిలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా 317 జివోపై పునరాలోచన చేయాల్సిందిగా మావోయిస్టు పార్టీ కూడా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలస్తున్నది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ ‌పేర విడుదలైన ఆ లేఖలో స్థానికత, రిజర్వేషన్‌లపై ఆధారపడిన నిరుద్యోగ యువతకు అవకావాలు కల్పించి, ఖాళీలను వెంటనే భర్తీచేయాలని పేర్కొన్నట్లు తెలుస్తున్నది.

Leave a Reply