బెంగుళూరు మహానగరాల్లో ఆర్థిక అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని, పెట్టుబడులు కూడా ఈ ప్రాంతానికి తరళుతున్నట్లు తెలుస్తున్నది. ఉన్నత విద్యావంతులు దక్షిణ భారతంలో అధికంగా ఉండడంతో పాటు వివిధ వ్యాపారాల స్థాపన, ఉద్యోగాల కల్పన, అధిక జీవన ప్రమాణాలు కలిగి ఉండడంలో ముందు ఉన్నట్లు వివరాలు రుజువు చేస్తున్నాయి. వస్త్రధారణలో ఉత్తరాది మహిళలు చీరలు, సల్వార్ చుడిదార్ అధికంగా వాడితే దక్షిణాదిన చీరలు, హాఫ్ సారీస్ అధికంగా వాడతారు. ఉత్తరాది పురుషులు ప్యాంట్, షర్ట్, కుర్తా లాంటివి వాడితే దక్షిణాది వారు ప్యాంట్, షర్ట్, దోతి, లుంగీలా వాడతారు.
రాజకీయ, ప్రభుత్వ ప్రాతినిధ్యంలో వివక్షలు :
రాజకీయ క్రీడలో ఉత్తర భారతం ముందంజలో ఉండడం, దక్షిణ భారతానికి మొండి చెయ్యి చూపడం అనాది జరుగుతున్నట్లు రుజువులు చూపిస్తున్నారు. ప్రధానమంత్రి పదవి (పి వి నరసింహారావు/దేవెగౌడాల తరువాత) దక్షిణ భారతానికి రావడం అసాధ్యం అనే వాదన కూడా బలపడుతున్నది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు (డియంకె, బిఆర్‌యస్, వైయస్‌ఆర్‌సి, ఏఐఏడియంకె లాంటివి) రాజ్యమేలుతున్నాయి. సామాజిక, సంస్కృతిక, సంప్రదాయాల్లో వైవిధ్యత కలిగిన ఉత్తర దక్షిణ భారతాలను విడిదీసి కొత్త దేశాలుగా ఏర్పాటు చేయాలని వాదించే నిపుణులు కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గ కూర్పులో, మంత్రిత్వ శాఖల కేటాయింపులో, నిధుల వితరణలో, డామినేషన్‌లో దక్షిణ భారతాన్ని చిన్న చూపు చూస్తున్న వేళ విభేధాల అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తున్నది. జనాభా, పార్లమెంటరీ నియోజకవర్గాల ఏర్పాటులో ఉత్తర భారతం చాలా ముందంజలో ఉన్నది. యూపీలో 80, బీహార్‌లో 40 యంపీ స్థానాలు ఉండగా తమిళనాడులా 39, ఏపిలో 25, కర్నాటకలో 28, తెలంగాణలో 17, కేరళలో 20 స్థానాలు మాత్రమే ఉన్నాయి.
దక్షిణ భారతంలో పెరుగుతున్న అసహనం :
ఉత్తర దక్షిణ కొరియాలో విడిపోయి వేరు వేరు దేశాలుగా మనగలుగుతున్న వేళ ఇలాంటి వివక్షల తీవ్రత పెరిగి అణచివేతలు ఇలాగే కొనసాగితే ఉత్తర, దక్షిణ భారతాల మధ్య అదృష్య అడ్డుగోడలు పెరిగి విడిపోవాలనే నినాదాలు బలపడతాయని విశ్లేషిస్తున్నారు. 140 కోట్లు దాటిన జనాభా, పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం, అనారోగ్యం, నిరక్షరాస్యత, పేదరికం లాంటి ప్రధాన సమస్యలను దాటుతూ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరేందుకు ఉత్సాహపడుతున్న యువభారతంలో ఉత్తర, దక్షిణ భారతాల మధ్య అఘాదం పెరిగితే దేశ సమగ్రత, సమైక్యత, శాంతియుత సహజీవనాలకు ముప్పు కలుగుతుందని గమనించి అన్ని ప్రాంతాలను సమానంగా గౌరవించే సంస్కృతిని అలవర్చుకుందాం.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ – 9949700037