Take a fresh look at your lifestyle.

ఇంకెంతకాలం రోడ్లమీద పడికాపులు..?

“దేశ ప్రజలకోసం నిరంతర శ్రమచేసి ఆహార ధాన్యాలను ఉత్పత్తిచేసే రైతాంగానికి పాలక ప్రభుత్వాలు ఇచ్చే విలువ ఇదేనా అన్న ప్రశ్న ఉత్పన్నంకాకుండా ఉందడు. తాము రూపొందించిన చట్టాలు కార్పొరేట్‌ ‌సంస్థలకు మేలు చేసేవి కాదన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి నమ్మకంగా చెప్పలేకపోవడమే ఈ ఆందోళన కొనసాగింపు. నిజంగా రైతులకు మేలు చేయడమే లక్ష్యమైతే, వారి డిమాండ్లను తెల్లకాగితాల మీద కాకుండా చట్టపరంగా ఎందుకు ఆమోదించడంలేదన్నది రైతు బాంధవులు వేస్తున్న వెయ్యి డాలర్ల ప్రశ్న.”

పచ్చని పంటపొలాల్లో గడుపాల్సిన రైతులు చలితో వొణికిపోతూ  గత పద్దెనిమిది రోజులుగా రోడ్లమీద జీవనం సాగిస్తున్నారు. రైతులను, రైతు సంఘాలను, చివరకు ప్రతిపక్షాలతో సంప్రదించకుండా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం వ్యవసాయరంగానికి సంబంధించిన మూడు చట్టాలను చేయడమే ఈ దీనావస్థకు కారణం. అధికారంలోకి వొచ్చిన ఏ ప్రభుత్వమైనా తాము చేసిందే సరైందన్న వాదన వినిపించడం సహజం. నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా గత కొంతకాలంగా ఇదే వాదనచేస్తున్నది. ప్రతీ ప్రభుత్వం మాదిరిగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా తమకు వ్యవసాయరంగమన్నా, రైతులన్నా అపారమైన అభిమానమన్న మాటలు చెప్పడానికి అలవాటు పడ్డాయి. నిజంగానే అంత అభిమానం, ప్రేమ ఉంటే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రైతాంగమంతా ఢిల్లీ బాట ఎందుకు పట్టారన్న ప్రశ్న ఉత్పన్నం కాకతప్పదు. వొణికే చలిలో, వయో వృద్ధులు, మహిళలతోపాటు లక్షలాదిమంది పద్దెనిమిది రోజులుగా ప్రభుత్వంతో చర్చలు జరుపేందుకు పడిగాపులు పడాల్సిన అవసరమేమొచ్చింది. వంటావార్పు, నిద్రాహారాలన్నీ రోడ్లపైనే చేసుకునే దుస్థితి వారికెందుకు సంక్రమించిందన్నది ఆలోచించాల్సిన విషయం.

 

ఒక వైపు కేంద్ర సర్కార్‌ ఆరేడు విడుతలుగా రైతు ప్రతినిధులతో చర్చలు జరుపుతుంటే ప్రధాని నరేంద్రమోదీ ఎట్టి పరిస్థితిలోనూ తాము చేసిన మూడు వ్యవసాయ చట్టాలను ఎత్తివేసే ప్రసక్తిలేదన్నట్లుగానే మాట్లాడడం చూస్తుంటే రైతాంగంపైన వారు కనబరుస్తున్న ప్రేమ ఇదేనేమో అనుకోకతప్పేట్లులేదు. తాజాగా ఒక సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ మరోసారి తాను రైతు పక్షపాతిగా చెప్పుకున్నారు. అయితే పాత చట్టాలతో కొత్త శతాబ్ధాన్ని నిర్మూలించలేమని, ఆ చట్టాలన్నీ రైతుల స్వేచ్ఛకు భారంగా ఉన్నాయని, అందుకే ఈ రంగం అభివృద్ధికి కొత్త సంస్కరణలు ప్రవేశ పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతకాలం పరిపాలన చేసినవారు రైతాంగాన్ని బ్రమంలో పెట్టారు. ఆ భ్రమల నుండి వైదొలగాల్సిందిగా ఆయన రైతాంగాన్ని కోరుతున్నప్పటికీ రైతుల డిమాండ్లను ఏమాత్రం పట్టించుకున్నట్లుగా కనిపించడంలేదు. ఇప్పటి వరకు ఆరేడు విడుతలుగా రైతు సంఘాలు, నాయకులతో కేంద్ర అధికార ప్రతినిధులు మంత్రులతో సాగిన చర్చలు ఫలవంతం కాకపోవడాన్నిబట్టి చూస్తే, ఇరువర్గాలెవరు ఒక మెట్టు తగ్గడానికి ఇష్టపడడంలేదు. రైతుల డిమాండ్‌ ‌మేరకు కొన్ని సవరణలు తప్ప మొత్తం చట్టాలను ఎత్తివేయడం కుదరదని కుండ బద్ధలు కొట్టినట్లు కేంద్ర సర్కార్‌ ‌చెబుతోంది. ఈ సవరణ అంశాలను కావాలంటే లిఖితపూర్వంగా రాసి ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకున్నా, రైతాంగంమాత్రం అంగీరించడంలేదు. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన చట్టాలకే దిక్కులేప్పుడు రాసిచ్చిన హామీలు ఏమేరకు అమలవుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా దేశానికి వెన్నెముకైన రైతాంగాన్ని గత పద్దెనిమిది రోజులుగా రోడ్లపాలు చేయడంపట్ల దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.

 

ఎన్‌డిఏ భాగస్వామ్య పక్షాలు తప్ప ఇతర విపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలు కేంద్ర చర్యను తీవ్రంగా నిరసిస్తున్నాయి. రైతులు చేపట్టిన ఈ ఆందోళనకు తమ మద్దతును కూడా ప్రకటించాయి. విచిత్రమేమంటే ఇదిప్పుడు దేశం ఎల్లలు దాటడమే. ఇతర దేశ ప్రభుత్వాలు కూడా  ఆందోళన చేపట్టిన రైతాంగానికి తమ సానుభూతిని ప్రకటించాయి. ఇప్పటికే కెనడా ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు ఈ ప్రస్తావనను లేవనెత్తింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, అమెరికా దేశాల్లోని ప్రవాస భారతీయులు ఇప్పటికే ర్యాలీలు చేపట్టి మద్ధతు తెలిపారు. వివిధ దేశాల్లో నివసిస్తున్న అనేక మంది భారతీయులు ట్విట్టర్‌లలో తమ సందేశాలనిస్తున్నారు. గతంలో రైతులకు సంబంధించి ఇంత పెద్ద ఆందోళనేదీ జరిగి ఉండలేదన్న అబిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇంతకుముందు తమిళనాడు రైతాంగం వివిధ రకాలుగా వింత నిరసనలు చేపట్టి, వేల కిలోమీటర్లు నడిచినదానికి మించిన ఆందోళన కార్యక్రమమిది. చివరకు ఐక్యరాజ్యసమితి కూడా ఉద్యమానికి అనుకూలంగా తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి పంపించిందంటేనే ఈ ఉద్యమానికి ఎలాంటి స్పందన వొస్తున్నదన్నది వ్యక్తమవుతున్నది. ప్రత్యక్షంగా పద్దెనిమిది రోజులుగా రైతాంగ ఆందోళన కనిపిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ‌ద్వారా ఈ సంవత్సరం జూన్‌ 30‌న మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్‌ ‌చట్టాన్ని తీసుకొచ్చినప్పటినుండీ రైతులు ఉద్యమిస్తూనే ఉన్నారు.

 

అదే నెలలో ఆర్డినెన్స్ ‌కాపీలను దగ్ధం చేయడం, సెప్టెంబర్‌లో రెండు విడుతలుగా ధర్నాలు, రాస్తారోకోలు చేయడం, అక్టోబర్‌లో చట్టం చేసిన కాపీలను దగ్దం చేయడం, నవంబర్‌ 26‌న గ్రామీణ బంద్‌ ‌పిలుపు మొదలు నేటివరకు రైతులు తమ ఆందోళనను తీవ్ర తరంచేస్తూనే ఉన్నారు. ఈ నెల 8న భారత్‌ ‌బంద్‌, 11‌న దేశవ్యాప్త నిరసనలతోపాటు మరుసటిరోజున జాతీయ రహదారుల నిర్బంధం చేపట్టి తమ నిరసన వ్యక్తచేస్తున్న రైతులపైన ప్రభుత్వం దాష్టికంగా వ్యవహరించడం చూస్తుంటే తాము రైతాంగ పక్షపాతి అన్నది కేవలం మాటలకే పరిమితమన్నట్లుగా కనిపిస్తున్నది. రాహుల్‌గాంధీ ఆరోపిస్తున్నట్లు ఉద్యమం చేపట్టిన పదిహేడు రోజుల్లో పదకొండు మంది రైతులు మరణించడం నిజంగా విచారకరం. దేశ ప్రజలకోసం నిరంతర శ్రమచేసి ఆహార ధాన్యాలను ఉత్పత్తిచేసే రైతాంగానికి పాలక ప్రభుత్వాలు ఇచ్చే విలువ ఇదేనా అన్న ప్రశ్న ఉత్పన్నంకాకుండా ఉందడు. తాము రూపొందించిన చట్టాలు కార్పొరేట్‌ ‌సంస్థలకు మేలు చేసేవి కాదన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి నమ్మకంగా చెప్పలేకపోవడమే ఈ ఆందోళన కొనసాగింపు. నిజంగా రైతులకు మేలు చేయడమే లక్ష్యమైతే, వారి డిమాండ్లను తెల్లకాగితాల మీద కాకుండా చట్టపరంగా ఎందుకు ఆమోదించడంలేదన్నది రైతు బాంధవులు వేస్తున్న వెయ్యి డాలర్ల ప్రశ్న.
image.png
మండువ రవీందర్‌ ‌రావు

Leave a Reply