“గాంధీ ప్రవచనాలకు ప్రభావితం అయిన బహుగుణ హిమాలయన్ అటవీ ప్రాంతాల్లో 4,700 కిమీ పాదయాత్ర చేసి, మెగా ప్రాజెక్టుల నిర్మాణంతో గ్రామీణ శ్రమైక్య సాంఘీక జీవన సౌందర్య విచ్ఛిన్నాన్ని మరియు పర్యావరణానికి కలిగిన విఘాతాన్ని గుర్తించి ఆకలింపు చేసుకున్నారు. హిమాలయన్ స్వరంగా, చెట్లకు స్నేహితుడిగా, అటవీ జాతుల ఆత్మగౌరవంగా, నీటి నేస్తంగా, లింగ సమానత్వ గళంగా, గ్రామీణ నేల పుత్రుడిగా బహు గుణాల పాత్రల పర్యావరణ బాటసారి సుందర జీవితం అనన్యసామాన్యం, అభినందనీయం. ఆధునిక అభివృద్ధి పేరుతో హరిత వినాశనం, నేల కాలుష్యం మరియు నీటి దోపిడిలను వ్యతిరేకించిన బహుగుణ పర్యావరణ గోసను ఢిల్లీ దాకా వినిపించగలిగారు.”
(21 మే 2021 రోజున పరమపదించిన ‘సుందర్లాల్ బహుగుణ’కు అక్షర నివాళి)
భారతదేశం గర్వించదగిన ప్రముఖ పర్యావరణవేత్త, సాంఘీక సేవాతత్పరుడు, చిప్కో ఉద్యమ కర్మయోగి ‘రాజేంద్ర సింగ్ సుందర్లాల్ బహుగుణ’ 09 జనవరి 1927న తెహ్రీ గర్వాల్ సమీపానగల మరోడా గ్రామం, ఉత్తరాఖండ్లో జన్మించారు. తన 13వ ఏటనే శ్రీ దేవ్ సుమన్ శిష్యరికంలో అహింస సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. చిన్న వయస్సులోనే ‘అంతరానితనం’ అనే దురాచారానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. 1965 – 70ల మధ్య హిమాలయ పర్వత ప్రాంత మహిళలను ఏకంచేస్తూ ‘మద్యపానానికి’ వ్యతిరేకంగా గళమెత్తారు. 1947లో వలసపాలనకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసిన పరమ దేశభక్తుడు, గాంధేయవాది సుందర్లాల్ బహుగుణ.
ధర్మపత్ని విమలను వివాహమాడి గ్రామంలో ఆశ్రమం ఏర్పరచుకొని ఆదర్శప్రాయ జీవితం గడిపారు. గాంధీ ప్రవచనాలకు ప్రభావితం అయిన బహుగుణ హిమాలయన్ అటవీ ప్రాంతాల్లో 4,700 కిమీ పాదయాత్ర చేసి, మెగా ప్రాజెక్టుల నిర్మాణంతో గ్రామీణ శ్రమైక్య సాంఘీక జీవన సౌందర్య విచ్ఛిన్నాన్ని మరియు పర్యావరణానికి కలిగిన విఘాతాన్ని గుర్తించి ఆకలింపు చేసుకున్నారు. హిమాలయన్ స్వరంగా, చెట్లకు స్నేహితుడిగా, అటవీ జాతుల ఆత్మగౌరవంగా, నీటి నేస్తంగా, లింగ సమానత్వ గళంగా, గ్రామీణ నేల పుత్రుడిగా బహు గుణాల పాత్రల పర్యావరణ బాటసారి సుందర జీవితం అనన్యసామాన్యం, అభినందనీయం. ఆధునిక అభివృద్ధి పేరుతో హరిత వినాశనం, నేల కాలుష్యం మరియు నీటి దోపిడిలను వ్యతిరేకించిన బహుగుణ పర్యావరణ గోసను ఢిల్లీ దాకా వినిపించగలిగారు. బహుగుణ సరళ జీవనశైలి, వస్త్రధారణ, పద్దతులు, అతి సాధారణ ఆహారపు అలవాట్లు, సుందర వాక్కులు, ఆకర్షణీయ నవ్వుల మేలు కలయిక భారతీయులకు సదా ప్రేరణాత్మకం.
అలకనందా పరివాహక ప్రాంత అడవుల్లోని 2,500 మహావృక్షాలను ప్రభుత్వం వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ, చెట్లను ఆలింగనం చేసుకుంటూ నరికివేతను ఆపడానికి స్థానిక గౌర దేవి, సందేశా దేవి మరియు బచ్నీ దేవి లాంటి మహిళలను చైతన్య పరిచారు. 26 మార్చి 1974న ‘చిప్కో ఉద్యమం’ ప్రారంభించి హిమాలయ మరియు యూపీ ప్రాంత అడవులను కాంట్రాక్టర్లు నరికి వేయడానికి వ్యతిరేకంగా గళమెత్తి ‘జీవావరణమే శాశ్విత ఆర్థిక వ్యవస్థ (ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ)’ అని నినదించారు. హిందీ పదం ‘చిప్కో’ అనగా ‘ఆలింగనం’ అని అర్థం. 1981-83 మధ్య కాలంలో కాశ్మీర్ నుంచి కోహిమా వరకు 5,000 కిమీ గ్రామాల్లో తిరుగుతూ తన ఉద్యమం వైపుకు గ్రామీణులను ఆకర్షించగలిగారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీతో జరిగిన సమావేశ ఫలితంగా హిమాలయన్ అడవుల నరికివేతను 15 ఏండ్లు నిషేదించగలిగారు. తన సహచర మిత్రురాలు గౌర దేవితో కలిసి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు.
తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భగీరథి నది ఒడ్డున దశాబ్దాల పాటు నిరాహార దీక్షలు మరియు సత్యాగ్రహాలు నిర్వహిస్తూ తన నిరసనగళాన్ని జాతీయ స్థాయి వరకు వినిపిస్తూ జైలు పాలు కూడా అయ్యారు. 1995లో నిర్వహించిన 45 రోజుల నిరాహార దీక్షను నాటి ప్రధాని పి వి నరసింహారావు హామీతో విరమించారు. తరువాత న్యూఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్ వద్ద 75 రోజుల దీక్షను ప్రధాని దేవెగౌడ లిఖిత హామీతో విరమించారు.
దశాబ్దాల కాలం సుప్రీమ్కోర్టులో కేసు నడిచినా ఫలితం రానందున 2001లో ప్రభుత్వం అరెస్టు కూడా చేయడం, డ్యామ్ నిర్మాణం కొనసాగడం జరిగింది. 2004లో తెహ్రీ డ్యామ్ నిర్మాణం పూర్తి కావడం, డ్యామ్ నీటితో నిండటంతో తన నివాసాన్ని ‘కోటి’ అనబడే ప్రాంతానికి మార్చారు.
అమాయక గ్రామీణుల శ్రేయస్సు కోరుతూ పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన సుందర్లాల్ బహుగుణ పట్టుదల, ప్రజాహిత నిస్వార్థ సేవలు మరియు ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీ (1981లో తిరస్కరించారు), రైట్ లైవ్లీవుడ్ ఆవార్డు, జమ్నాలాల్ బజాజ్ ఆవార్డు, ఐఐటి రూర్కీ గౌరవ డాక్టరేట్ మరియు పద్మ విభూషన్ (2009) పురస్కారాలతో సన్మానించింది. సుందర్లాల్ బహుగుణ బహుముఖీన ప్రతిభ ప్రదర్శిస్తూ ‘ధర్తీ కీ పుకార్’, ‘భూ ప్రయోగ్ మే బునియాదీ పరివర్తన్ కీ ఓర్’, ‘ఎన్విరాన్మెంటల్ క్రయసిస్ అండ్ హుమన్స్ ఎట్ రిస్క్’ మరియు ‘ఇండియాస్ ఎన్విరాన్మెంట్’ లాంటి పుస్తక రచనలు కూడా చేశారు.
08 మే 2021న కరోనా సోకడంతో ఏఐఐయంయస్, రిషికేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన 94వ ఏట 21 మే 2021న కన్ను మూశారు. భార్య విమల, ఇద్దరు కుమారులు మరియు ఒక కూతురు కలిగిన ‘బహుగుణా’ల మేలు కలయికే మన స్వర్గీయ సుందర్ లాల్. అతని మరణం దేశానికి తీరని లోటు, అతని రూపం భవిష్యత్తు తరాలకు స్పూర్తిదాయకం. ‘ప్రకృతితో సామరస్యమే నికార్సైన జీవన విధానం’ అని ప్రగాఢంగా నమ్మిన చెట్టంత మనిషి మన సుందర్ లాల్ బహుగుణ. అటవీ ప్రాంతాల్లో మెగా డ్యామ్ల నిర్మాణం మాత్రమే సుస్థిరాభివృద్ధి కాదని నమ్మిన హరిత హితవరి, నీటి సహజ ప్రవాహ సహాయంతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని సూచించిన గిరిజ జాతుల గొంతుక మన బహుగుణ. భారతీయ జీవ నదులను, హిమాలయ పర్వత శ్రేణులను, పర్వత ప్రాంత తెగలను కాపాడాలనే మహత్తర లక్ష్యంతో తన జీవితాన్ని దారబోసిన సుందర్లాల్ బహుగుణ సదా చిరస్మరణీయుడు, ఆదర్శప్రాయుడు మరియు అనుసరణీయుడు.
