(న్యూజిలాండ్‌లో మంత్రిగా పదవిచేపట్టనున్న కేరళ సంతతి ప్రియాంక రాధాకృష్ణన్‌ను అభినందిస్తూ)
న్యూజిలాండ్ కెబినెట్ మంత్రిగా పదవి చేపట్టనున్న భారత సంతతికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్ సొంత ప్రాంతం కేరళ రాష్ట్ర ఎర్నాకుళం సమీపాన గల పరపూర్ అని తెలిసిన వేళ దేశ పౌరులు ఆనందంతో శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భమిది. అనంతరం ప్రియాంక తల్లితండ్రులు వలస వచ్చి చెన్నైలో స్థిరపడ్డారు. చెన్నైలో ఉష మరియు పి యం రామన్ రాధాకృష్ణన్ తల్లితండ్రులకు 1979లో జన్మించిన ప్రియాంక రాధాకృష్ణన్, చిన్నతనమంతా సింగపూర్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత వారి కుటుంబం న్యూజిలాండ్‌కు మారింది. న్యూజిలాండ్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్లో డెవలప్మెంటల్ స్టడీస్‌లో పిజీ పూర్తి చేసింది. అభ్యుదయ వామపక్ష భావాలుగల తాతయ్య ప్రేరణతో పీడితుల పక్షాన నిలవడం అలవర్చుకున్నారు. తదనంతరం ఆక్లాండ్ భారతీయ సంతతిలో ప్రముఖ సమాజ సేవకురాలిగా పనిచేస్తూ మహిళా బాధితులు, గృహహింస అనుభవిస్తున్న స్త్రీలు మరియు వలస కార్మికుల పక్షాన తన గళం వినిపించారు. 2006లో న్యూజిలాండ్ లేబర్ పార్టీలో సభ్యత్వం తీసుకొని, పార్టీ అంతర్గత పాలసీల రూపకల్పనలో చురుకైన భూమిక నిర్వహించింది. 2017లో జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో ‘మౌంగాకికి’ స్థానం నుంచి లేబర్ పార్టీ జాబితాలో పార్లమెంట్లో అడుగిడినారు. 27 జూన్ 2019న జరిగిన మంత్రివర్గ విస్తరణలో వైవిధ్య జాతి వ్యవహారాలకు (ఎత్నిక్ అఫేర్స్) పార్లమెంటరీ ప్రైవేట్ సెక్రటరీగా నియమించబడ్డారు.
17 అక్టోబర్ 2020న జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ జాబితాలో మౌగాంకికి స్థానం నుండి యంపిగా ఎన్నికైనారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్ నాయకత్వంలో 02 నవంబర్ 2020న ఏర్పడిన మంత్రివర్గంలో చోటు లభించిన ఐదుగురిలో ప్రియాంక రాధాకృష్ణన్ ఉండడం విశేషం. ప్రియాంకను ‘స్వచ్ఛంధ, వైవిధ్య జాతి సంఘ,మూలవాసుల,యువజన, ఉద్యోగ మరియు సమాజ అభివృద్ధి శాఖ కేబినెట్ మంత్రి’గా నియమించారు. తొలి భారతీయ సంతతికి చెందిన మహిళగా మంత్రి పదవి చేపట్టనున్నది మన ప్రియాంక. ప్రస్తుతం భర్త రిచర్డ్సన్ (ఐటి ఉద్యోగి)తో కలిసి ఆక్లాండ్‌లో నివసిస్తున్న 41 ఏండ్ల ప్రియాంక రాధాకృష్ణన్‌కు మంత్రివర్గంలో మూడు శాఖలు కేటాయించడం తన ప్రతిభకు తార్కాణంగా చేప్పవచ్చు. దీపావళి సంబరాలు జరుగుతున్న వేళ భారతీయత ఉట్టిపడే పసుపురంగు చీరను ధరించిన ప్రియాంక, తన నిమామకాన్ని ఫేస్బుక్ మాద్యమంలో సంతోషంగా వెళ్లడించడం భారత సంస్కృతీ వారసత్వాల పట్ల తన నమ్మకాన్ని తెలియజేస్తున్నది. కేరళ ప్రాంతవాసిగా, చెన్నైలో జన్మించిన ప్రియాంక రాధాకృష్ణన్ చిన్నతనం నుండే మహిళా హక్కులు, మూగబోయిన గొంతుకలకు మాట తానై, గృహ హింస బాధితుల పక్షాన నిలిచి తన సేవా నిరతిని ప్రదర్శించారు. న్యూజిలాండ్ కేంద్రమంత్రిగా 06 నవంబర్ 2020న ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రియాంక రాబోయే రోజుల్లో న్యూజిలాండ్ వాసులకు అమూల్య సేవలు చేస్తూ మంచి పేరును తెచ్చుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇండియా ఈజ్ ఫ్రౌడ్ ఆఫ్ యు. ఆల్ ది బెస్ట్ ప్రియాంక రాధాకృష్ణన్.

జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్ – 99497 00037