Take a fresh look at your lifestyle.

దూసుకుపోతున్న స్వదేశీ యాప్స్

  • 59 చైనా అప్లికేషన్లపై నిషేధంతో.. భారతీయ యాప్స్ కు పెరిగిన క్రేజ్
  • ఇండియన్ యాప్ డెవలపర్లకు వరంగా మారిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
  • షేర్ చాట్, రొపొసో, చింగారీ వంటి దేశీయ యాప్స్ వైపు యువత చూపు
హైదరాబాద్: ఇండియా విసిరిన డిజిటల్ మిస్సైల్ తో డ్రాగన్ కోరలూడాయి. చైనాకు చెందిన అతి ముఖ్యమైన 59 అప్లికేషన్ల(యాప్ ల)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో.. ఆ దేశం అయోమయంలో పడింది. భారత దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణశాఖ రహస్యాలకు భంగం వాటిల్లుతుందన్న కారణంగా.. కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా తన యాప్స్ లో ఉన్న మాల్ వేర్, స్పై వేర్ ద్వారా… యూజర్లు, ప్రభుత్వ సంస్థలు, అధికారుల ఫోన్లలోని డేటాను చోరీ చేస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో.. సర్కార్ వాటిని బ్యాన్ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ చర్యతో.. కయ్యాలమారి చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ యాప్ ల ద్వారా ఇన్నాళ్లూ ఆర్జిస్తున్న కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడింది. దీంతో, డ్రాగన్ ఇప్పుడు లబోదిబోమంటోంది. అయితే చైనా అప్లికేషన్లను కేంద్రం నిషేధించడంతో.. స్వదేశీ యాప్స్ కు డిమాండ్ అమాంతం పెరిగింది. భారతీయ యాప్ డెవలపర్లు.. మరిన్ని అప్లికేషన్లు రూపొందించేదుకు ఇది దోహదపడనుంది. దేశీయ డిజిటల్ రంగంలో ఇదొక శుభ పరిణామం.
కేంద్రం బ్యాన్ చేసిన చైనా యాప్ లలో ముఖ్యమైనది టిక్ టాక్. మనదేశంలో దానికి చాలా ఆదరణ ఉండేది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం టిక్ టాక్ డౌన్ లోడ్లలో.. 30 శాతం భారత్ నుంచే అయ్యాయి. ఇండియాలో ఆ యాప్ యాక్టివ్ యూజర్ల సంఖ్య దాదాపు 20 కోట్లు. అలాంటి టిక్ టాక్ ఇప్పుడు బ్యాన్ కావడంతో యూజర్లు ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే స్వదేశీ యాప్ లపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. రొపొసో, చింగారీ, షేర్ చాట్ వంటి యాప్ లను డౌన్ లోడ్ చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో, ఆ అప్లికేషన్లు స్వల్ప వ్యవధిలోనే కోట్లాదిగా డౌన్ లోడ్ అవుతున్నాయి. 15 ప్రాంతీయ భాషల్లో వినియోగదారులను ఆకట్టుకుంటున్న షేర్‌ చాట్‌ ను కేవలం రెండు రోజుల్లో 1.5 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకోవడమే అందుకు చక్కటి ఉదాహరణ. ఇప్పటికే ఆ అప్లికేషన్ కు దాదాపు 15 కోట్ల మంది యూజర్లున్నారు. అటు, రొపొసో యాప్ వైపు కూడా ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. టిక్ టాక్ లో లక్షలాది మంది ఫాలోవర్స్ వున్న ప్రముఖులు, ఇతర యువత.. రొపొసో బాట పడుతున్నారు. స్వదేశంలో తయారైన ఈ యాప్‌… 12 భారతీయ భాషల్లో సేవలందిస్తోంది. ఇక, టిక్‌ టాక్‌ కు పోటీగా చెప్పుకునే చింగారి అప్లికేషన్ కూ క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం దాని డౌన్‌ లోడ్‌ల సంఖ్య 25 లక్షలు దాటింది. మరోవైపు, మహీంద్రా సంస్థ ఆధ్వర్యంలోని గోసోషియల్‌ ను ఉపయోగించే వారి సంఖ్యా గణనీయంగా పెరిగింది. లాక్‌ డౌన్‌ లో ప్రారంభమైన వీడియో షేరింగ్‌ వెబ్‌ సైట్‌ బాక్స్‌ ఎంగేజ్‌ డాట్‌ కామ్‌ కు కూడా ఆదరణ ఎక్కువగానే ఉంది. అలాగే ట్రెల్‌, ఖబ్రీ లాంటి యాప్‌లు సైతం దూసుకుపోతున్నాయి. ఇవే కాకుండా ఇంకా అనేక స్వదేశీ అప్లికేషన్లు.. యూజర్ల ఆదరణ పొందుతున్నాయి.
మరోవైపు, చైనా యాప్ లను కేంద్రం బ్యాన్ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వంటి దేశాలు, ఎంతో మంది ప్రముఖులు సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. చైనా అప్లికేషన్ల స్థానాన్ని స్వదేశీ యాప్ లు భర్తీ చేస్తాయని టెక్ నిపుణులు అభిప్రాయడుతున్నారు. భారతీయ యూజర్లు.. ఇకపై మన యాప్స్ నే ఎక్కువగా వాడే ఛాన్స్ వుందని అంటున్నారు.  చైనా యాప్‌ లపై నిషేధం.. స్వదేశీ సంస్థలకు చక్కటి అవకాశమని.. దీన్ని అవి సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన అప్లికేషన్లను రూపొందించి.. వినియోగదారులను ఆకట్టుకోగలిగితే… ఆయా సంస్థలకు ఇక తిరుగుండదని అంటున్నారు. మన దేశంలో నైపుణ్యం ఉన్న యువతకు కూడా కొదవలేదని.. వాళ్ళు సైతం కొత్త కొత్త అప్లికేషన్లు తయారుచేసి తమ టాలెంట్ రుజువు చేసుకునేందుకు ఇది మంచి సమయమని సూచిస్తున్నారు. స్వదేశీ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాలన్న ప్రధాని మోడీ సంకల్పానికి దీని ద్వారా మరో ముందడుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply