కాశ్మీర్‌లో మొన్నటి వరకూ అంతర్భాగమైన లడఖ్‌ను గత ఏడాది ఆగస్టు ఐదవ తేదీన నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం పట్ల చైనా అప్పటి నుంచి మన దేశంపై విమర్శలు చేయడం ప్రారంభించింది. కాశ్మీర్ విషయంలో మనకు పాకిస్తాన్‌తో తగాదా ఉంది కానీ, చైనాతో లేదు. అసలు చైనాకు ఏవిధంగా చూసినా సంబంధం లేదు. అయితే, ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్తాన్ కోసం చైనా కొన్ని శాశ్వత నిర్మాణాలు సాగిస్తోంది. దీనిపై మన దేశం అనేక సార్లు అభ్యంతరం తెలిపింది. ఇప్పుడు చైనా లడఖ్ గురించి పేచీ పెడుతున్నది. లడఖ్‌లో కొద్ది రోజుల క్రితం చైనా సైనికుడు పట్టు బడినప్పుడు మన దళాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి చైనా అధికారులకు అప్పగించాయి. ఇదే రీతిలో మన సైనికులకు చైనా నుంచి సరైన స్పందన కరువవుతోంది. ఇప్పుడు సామాజిక మాధ్యమం ట్విట్టర్ అకౌంట్‌లో లడఖ్‌ను చైనాలో అంతర్భాగంగా చూపించడం జరిగింది. దీనిపై ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్నీకి భారత ప్రభుత్వ ఐటి శాఖ గట్టి హెచ్చరిక చేసింది. సున్నితమైన విషయాల్లో స్వతంత్రించి సరిహద్దు భాగాల మ్యాపులను చూపడం గర్హనీయమనీ, సర్వసత్తాక ప్రతిపత్తికి భంగం కలిగించే చర్యలను భారత్ ఎంత మాత్రం సహించబోదని గట్టి హెచ్చరిక చేసింది. లడఖ్ తూర్పు ప్రాంతంలోని గాల్వాన్ లోయలో జూన్‌లో ఉద్రిక్తతలు ఏర్పడటానికి చైనా ప్రదర్శించిన దూకుడు కారణం. గాల్వాన్ లోయలో చైనా సైనికులను ఎదుర్కోవడంలో మన సైనికులు 20 మంది అమరులైన సంగతి తెలిసిందే.
చైనా లడఖ్‌ను ఎలాగైనా సరే తన భూభాగంగా మార్చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌ను కూడా చైనా అంతర్భాగంగా చిత్రీకరించే మ్యాపులను చైనా ఆ మధ్య విడుదల చేసినప్పుడు కూడా మన దేశం ఇదే రీతిలో తీవ్రంగా స్పందించింది. ట్విట్టర్ సెట్టింగ్స్‌లో లేహ్ ప్రాంతం చైనాలో ఉన్నట్టు చూపించడంపై ట్విట్టర్ సీఈఓకి భారత ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ సహానే ఘాటైన పదాలతో లేఖ రాశారు. లడఖ్ ప్రాంతంపై చైనా కన్నేసిన దగ్గర నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆ శాఖ ఉన్నతాధికారులు, కమాండర్లు గాల్వాన్ లోయలో తరచూ పర్యటనలు జరిపి మన సైనికుల చిత్తస్థయిర్యాన్ని పెంచుతున్నారు. లేహ్‌లో పలు ప్రాంతాల్లో భారతీయ దళాల ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో పాటు త్రివిధ దళాల చీఫ్‌లు కూడా లేహ్ ఫార్వర్డ్ పోస్టులను సందర్శించిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రయత్నాల వల్ల ట్విట్టర్ సంస్థకు చెడు పేరు వొస్తుందని, దాని విశ్వసనీయతపైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతాయన్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ట్విట్టర్ సంస్థ స్పందించింది. భారత ప్రభుత్వంతో పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ట్విట్టర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. సున్నితమైన అంశాలను గుర్తిస్తామని, లేఖను అందుకున్నట్లు చెప్పారు. ఆదివారం చోటుచేసుకున్న సాంకేతిక సమస్యను గుర్తించామన్నారు. జియోట్యాగ్ సమస్యను వెంటనే గుర్తించి పరిష్కరించామన్నారు.
చైనాకు సమయ సందర్భాలను అనుసరించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మాత్రం ఈ విషయాలేవీ పట్టనట్టుగానే లడఖ్ తమ పరిధిలోనిదేనన బుకాయించి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఈ మధ్య లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ ల విషయంలో చైనా దూకుడు ప్రదర్శిస్తే భారత్ సహించబోదనీ, తమ భూభాగాలను కాపాడుకునేందుకు భారత్ సంసిద్ధంగా ఉందంటూ హెచ్చరిక చేశారు. అమెరికా కూడా చైనాను ఈ విషయంలో గట్టిగా హెచ్చరించింది. చైనా గుర్రుకు అసలు కారణం అదే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో తమకున్న సమస్యల్లో భారత్‌ను భాగస్వామిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. చైనా, భారత్‌ల మధ్య ఉన్న సంబంధాలు, వివాదాలు ఈ రెండు దేశాలకు సంబంధించిన విషయాలు. గతంలో అమెరికా కోరినప్పుడు సలహ ఇస్తూ పెద్దన్న పాత్ర వహించేది. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అతిని ప్రదర్శిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో ప్రవాస భారతీయులను ఆకట్టుకోవడానికి పదే పదే భారత్‌నీ, ప్రధాని మోడీని పొగడటం కూడా చైనాకు గుర్రుగా ఉంది. అందుకే, పూర్వపు పాలకులు అమెరికాకు దగ్గర కాకుండా అలీన విధానాన్ని తుచ తప్పకుండా అమలు జేసేవారు. మారిన అంతర్జాతీయ పరిస్థితులలో అమెరికాను దూరంగా పెట్టడం కష్టమే కానీ, మరీ అంత దగ్గరగా జరగడం మంచిది కాదని విదేశాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని ప్రభావమే ఇది. చైనా మన ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని భారత పౌరులు ఎవరూ సహించరు. కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా కాశ్మీర్ విషయంలో చైనా తమ వాదాన్ని సమర్థిస్తోందంటూ చేసిన ప్రకటనపై దేశంలోని వివిధ వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ నాయకులు ప్రదర్శిస్తున్న అతి వల్ల పొరుగు దేశాలు మనపై చొరవ తీసుకోవడానికి వీలు కలుగుతోంది. మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి జాతీయ సమస్యలపై అంతా ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చైనా కుతంత్రాలను తిప్పికొట్టేందుకు ఈ సమయంలో జాతీయ భావస్ఫూర్తి అందరిలోనూ ఏర్పడాలి.