భారత్ స్వావలంబన సాధించాలి
దేశీయంగా చమరు ఉత్పత్తిని సవి•కరించాలి
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన
విశాఖపట్నం, జనవరి 21 : భారతదేశ ఇంధన భద్రతకోసం దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పెట్రోకెమికల్ రంగంలో పరిశోధన, అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోలియం రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి మరింత కృషి జరగాలని, దానికి ప్రభుత్వాలు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల మధ్య అనుసంధానం అత్యంత కీలకమని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు.
కొరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో టీకా అందరూ వేసుకోవాలని, హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితుల నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు. పెట్రోలియం పరిశోధనలో ఐఐపీఈ పాత్ర కీలక భూమిక పోషించాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఏరినాలో ఐఐపీఈ తొలి వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హైడ్రోకార్బన్ల పరిశోధనల్లో మరింత పురోగతి అవసరమని, చమురు వినియోగంలో భారత్ మూడవ స్థానంలో ఉందన్నారు. ఈ అంశంలో ఇండియా స్వావలంబన సాధించాలన్నారు. సోలార్, విండ్, టైడల్ ఎనర్జీలను ప్రత్యామ్నాయ వనరులుగా అభివృద్ధి చేసుకోవాలని, స్వయంసమృద్దే ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నాయని, ఇది మంచి సంకేతమన్నారు. ప్రత్నామ్నాయ ఇంధన వనరులు అభివృద్ధిలో యువత పరిశోధనలు జరపాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ల డ్రైవ్లో భారతదేశం అతిపెద్ద పక్రియను చేపట్టిందన్నారు. ఆరోగ్యం పట్ల ఎవరికి వారు స్వీయ బాధ్యత వహించాలని వెంకయ్య నాయుడు అన్నారు.