Take a fresh look at your lifestyle.

యునెస్కో గుర్తింపు కట్టడాల జాబితాలో భారత్‌ది ఐదోస్థానం

  • గతంలో చార్మినార్‌, ‌గోల్కొండ కోట గుర్తింపునకు యత్నాలు
  • రామప్ప నిర్వహణ సరిగా లేకుంటే గుర్తింపు రద్దు చేసే ప్రమాదం

యునెస్కో గుర్తింపు పొందిన అత్యధిక కట్టడాలున్న దేశాల జాబితాలో భారత్‌ 5‌వ స్థానంలో ఉన్నది. తెలంగాణ నుంచి గతంలో గోల్కొండ కోట, చార్మినార్‌, ‌కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తించాలని ప్రతిపాదనలు వెళ్లినా అర్హత లభించలేదు. చివరకు రామప్పకు మాత్రం దక్కింది. ఈ జాబితాలో అత్యధికంగా ఇటలీ నుంచి 57 కట్టడాలు యునెస్కో గుర్తింపు పొందాయి. యునెస్కో 1978 నుంచి ఇప్పటివరకు 1,126 కట్టడాలు, ప్రాంతాలకు వారసత్వ హోదా కల్పించింది. వీటిలో మూడు కట్టడాల నిర్వహణ యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో వాటిని ఆ జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం 167 దేశాలకు చెందిన 1,123 కట్టడాలు వారసత్వ జాబితాలో ఉన్నాయి. మొదటి అయిదు స్థానాలలో చైనా(55), జర్మనీ(48), స్పెయిన్‌(48), ‌ఫ్రాన్స్(47) ఉన్నాయి. మన దేశంలో రామప్పతో కలిపి మొత్తం 39 కట్టడాలకు వారసత్వ హోదా దక్కింది. మొదటిసారిగా 1983లో అజంతా, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్‌మహల్‌కు వారసత్వ హోదా లభించింది. ఆ తర్వాత వీటి సంఖ్య క్రమంగా పెరిగింది.

వారసత్వ హోదా ఇచ్చేందుకు యునెస్కో మొత్తం 10 ప్రమాణాలను నిర్ణయించింది. వీటిలో కనీసం ఒక్కదానినైనా అందుకున్న వాటికి జాబితాలో చోటు దక్కుతుంది. ఈ ప్రమాణాలను ఎప్పటికప్పుడు హెరిటేజ్‌ ‌కమిటీ సవి•క్షిస్తుంది. 2004 వరకు సాంస్కృతిక కట్టడాల కోసం 6 ప్రమాణాలు, సహజసిద్ధ ప్రదేశాల కోసం 4 ప్రమాణాలు ఉండేవి. ఆ తర్వాత వీటన్నింటినీ కలిపి 10 ప్రమాణాలుగా నిర్దేశిరచారు. ఒక ప్రాంతం లేదా కట్టడం వారసత్వ హోదా పొందాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో నిబంధనల్లో పొందుపరిచారు. ఒక ప్రాంతం లేదా కట్టడాన్ని ప్రతిపాదించే ముందు ఆయా నిబంధనలకు అనుగుణంగా దానిని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగించడం వంటివి చేయాలి.

ఆ తర్వాత దేశ ప్రభుత్వం యునెస్కో వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. వాటిని యునెస్కో బృందం పరిశీలించి నివేదికను కమిటీకి అందజేస్తుంది. కమిటీ దాన్ని పరిశీలించిన అనంతరం హోదా ఇస్తుంది. వారసత్వ హోదా వొచ్చాక ఆ కట్టడం లేదా ప్రదేశాన్ని స్థానిక ప్రభుత్వాలు యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలి. ఆక్రమణలు, కూల్చివేతలు, నిర్వహణ సరిగా లేకపోవడం, మరమ్మతులు చేయకపోవటం వంటి కారణాలతో హోదా రద్దవుతుంది. నిర్వహణ సరిగా లేనివాటిని ముందుగా ‘ప్రమాదంలో ఉన్న కట్టడాల’ జాబితాలో చేర్చుతారు. నిర్ణీత సయమంలోగా అభివృద్ధి చేయకుంటే జాబితా నుంచి తొలగిస్తారు. ఇప్పటివరకు మూడింటి హోదా ఇలా రద్దయ్యింది. ఇంకా 51 కట్టడాలు ప్రమాద జాబితాలో ఉన్నాయి.

Leave a Reply