Take a fresh look at your lifestyle.

ప్రమాదపుటంచుల్లో ఉన్నామా?

“రెండవ దశ దాటి మూడవ దశలోకి అడుగు పెట్టే స్థితిలో ఇప్పుడు భారతదేశం ఉంది. దేశం మొత్తం కాకపోయినా కొన్ని సెగ్మెంట్స్‌లో ఈ ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ‌డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌రణదీప్‌ ‌గులేరియా మీడియాతో చెప్పారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా మూడో దశ కనిపిస్తోందని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం మూడవ దశకు సంబంధించి అధికారిక ప్రకటన చేస్తే రాష్ట్రాలు, ప్రజలు మరింత కఠిన చర్యలను అమలు చేయాల్సి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ‌చెప్పిన సూచనల్ని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు పాటించాల్సి ఉంటుంది.”

Rehana

కరోనా ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. కంటి మీద కనుకు లేకుండా చేస్తూనే ఉంది. కన్నీళ్ళను దిగమింగుకుని ముందుకు సాగాల్సిన పరిస్థితులను, సవాళ్ళను మన ముందు ఉంచుతూనే ఉంది. చైనా, అమెరికా, స్పెయిన్‌, ఇటలీ, ఇంగ్లాండ్‌ ‌వంటి దేశాలు మహమ్మారి దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఆ దేశాలు ఇప్పటికే కమ్యూనిటీ విస్తరణలోకి వెళ్లిపోయాయి. హాస్పటళ్ళల్లో బతికే పరిస్థితి ఎవరికి ఉందో అంచనా వేసి వారికి మాత్రమే వైద్యం చేసే దుస్థితి ఇవాళ ఆ దేశాలు చవి చూస్తున్నాయి. ఒక్కో దేశంలో రోజుకు వందల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వేల సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.

ఆ దేశాలతో పోల్చితే ప్రస్తుతానికి మన దేశంలో ఊరట చెందే వాతావరణమే ఉంది. అలా అని మనం సేఫ్‌ ‌జోన్‌లో లేమన్నది కూడా కఠిన వాస్తవమే. రెండవ దశ దాటి మూడవ దశలోకి అడుగు పెట్టే స్థితిలో ఇప్పుడు భారతదేశం ఉంది. దేశం మొత్తం కాకపోయినా కొన్ని సెగ్మెంట్స్‌లో ఈ ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ‌డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌రణదీప్‌ ‌గులేరియా మీడియాతో చెప్పారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా మూడో దశ కనిపిస్తోందని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం మూడవ దశకు సంబంధించి అధికారిక ప్రకటన చేస్తే రాష్ట్రాలు, ప్రజలు మరింత కఠిన చర్యలను అమలు చేయాల్సి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ‌చెప్పిన సూచనల్ని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు పాటించాల్సి ఉంటుంది.

మూడవ దశ అంటే ఏమిటి?
కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని నాలుగు దశల్లో పరిగణిస్తారు. మొదటి దశలో కరోనా వైరస్‌ ఉన్న దేశాల నుంచి ఎఫెక్ట్ అవ్వటం. చైనా, అమెరికా లేదా మరే దేశం నుంచి వచ్చే వారు వైరస్‌ ‌బారిన పడి మన దేశంలోకి రావటం ద్వారా వైరస్‌ ‌వస్తుంది. ఇది చాలా ప్రాథ•మిక దశ. అంతర్జాతీయ ప్రయాణాలను కట్టడి చేస్తే వైరస్‌ను ఈ దశలోనే కట్టడి చేయవచ్చు. కాని విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి వైరస్‌ ‌పరీక్ష నిర్ధారణ కాకముందే స్థానికంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగు పొరుగు తదితరులతో కాంటాక్ట్‌లోకి వెళతారు. అలా అతని ద్వారా మరి కొంత మంది వైరస్‌ ‌బారిన పడతారు. వారిని గుర్తించి చికిత్స అందించటం, ఐసోలేషన్‌లో ఉంచటం కొంత వరకు సాధ్యమే. కాని మూడవ దశలో కరోనా వైరస్‌ ఎవరెవరిలో విస్తరించిందో గుర్తించకముందే సమాజంలో చాలా మందికి అంటుకుంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావటమే కాదు….చివరకు అందరికీ చికిత్స అందించే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. కరోనా విస్తరణలో మూడు, నాలుగో దశలు అత్యంత ప్రమాదకరమైనవి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇటువంటి కొన్ని అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి.

కరోనా సోర్స్ ఎక్కడో తెలియకుండా వ్యక్తులకు రావటం, వారి నుంచి విశృంఖలంగా చాలా మందికి విస్తరించటం కనిపిస్తుంది. హైదరాబాద్‌ ‌పాతబస్తీలోని తలాబ్‌ ‌కట్ట ప్రాంతంలో తాజాగా ఓ కేసు వెలుగు చూసింది. అరవై ఏళ్లు పైబడిన ఒక మహిళ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒకటి రెండు హాస్పటళ్ళకు చికిత్స కోసం ఆమెను తీసుకువెళ్లారు. కరోనా లక్షణాలు ఉండటంతో గాంధీకి, ఉస్మానియాకు కూడా తిప్పాల్సి వచ్చింది. చివరకు ఆమె మృత్యువాత పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ అని పరీక్షల్లో తేలింది. ఆమెతో సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులు 17మందికి వైరస్‌ ‌సోకింది. మిగిలిన మరో 24 మంది కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌లో ఉంచారు. పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చే లోపు వీరంతా ఎంత మందితో కాంటాక్ట్‌లోకి వెళ్లారో తెలియాలి. పరీక్షలు నిర్వహించింది కుటుంబ సభ్యులకే. వ్యక్తితో ప్రత్యక్షంగా కాంటాక్ట్‌లోకి వెళ్ళకపోయినా అదే పరిసరాల్లో తిరిగిన ఇరుగు, పొరుగు గోడలు, తలుపులు, అరుగులు లేదా ఇతర వస్తువులను ముట్టుకుని ఉండొచ్చు. వాటి ద్వారా మరి కొంత మందికి వైరస్‌ ‌వ్యాప్తించి ఉండే అవకాశాలను కొట్టిపారేయలేం. అంటే మూడవ దశ దిశగా వెళ్లే పరిణామాలు అన్నమాట. ఇక్కడ అసలు కీలకమైన విషయం ఏమిటంటే…చనిపోయిన ఈ మహిళకు వైరస్‌ ఎలా వచ్చిందో తేలకపోవటం. ఆమె ఎక్కడా ప్రయాణాలు చేయలేదు, పాజిటివ్‌ ‌వ్యక్తికి ఆమె ప్రైమరి కాంటాక్ట్ ‌కూడా కాదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువంటి పలు కేసులు నమోదవుతున్నాయి.

కరెన్సీ కలకలం
మూడవ దశ అని మనం చెప్పుకుంటున్న విషయానికి బలం చేకూర్చే రెండు సంఘటనలు ఏపీలో జరిగాయి. మొదటి రెండు దశల్లో ఈ మహమ్మారి మనిషి నుంచి మనిషికి విస్తరిస్తుంది. ఈ దశ దాటి ఇప్పుడు నోట్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందనే అనుమానాలను అధికారులే వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో గుర్తించిన రెండు కేసుల పూర్వాపరాలు పరిశీలించిన తరువాత ఈ నిర్థారణకు అధికారులు ఈ నిర్ధారణకు వచ్చారు.

కరోనా వైరస్‌కు చేతులు కూడా కేంద్రాలే. రకరకాల పనులు చేతులతోనే చేస్తాం. కంప్యూటర్‌ ‌కీ బోర్డ్‌పై పని చేయటం, బాత్‌రూంకు వెళ్లేటప్పుడు తలుపులు తీయడం, లిఫ్ట్ ఎక్కినప్పుడు బటన్స్ ఆపరేట్‌ ‌చేయటం, స్విచ్ఛ్‌లు ఆన్‌ ‌చేయడం, షాపుకు వెళ్లితే ట్రాలీ పట్టుకోవటం వంటి అనేక పనులు అన్‌కాన్షియస్‌గానే చేసేస్తాం. దీనివల్ల ఒకరి చేతిలోని వైరస్‌ ‌మరొకరి చేతిలోకి విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని, శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని వైద్యులు పదే పదే చెబుతున్నారు. వీటన్నింటినీ కొంత వరకు అదుపు చేయగలమేమో కాని కూరగాయలు, మందులు, నిత్యవసరాల సరుకులు వంటివి కొనేటప్పుడు కరెన్సీ నోట్లు మనం ఇవ్వటం, తిరిగి వచ్చిన చిల్లరను జేబులోనో, బ్యాగ్‌లలో వేయటం కూడా చాలా సహజంగా జరిగిపోతుంది. ఇటువంటి చెల్లింపుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ ‌వ్యాపిస్తోందని తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల అధికారులు గుర్తించటం ఆందోళన కలిగించే విషయమే. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆర్‌ఎం‌పీకి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయునికి ఈ విధంగానే కరోనా సోకిందని తేల్చారు. ఈ ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే డిజిటల్‌ ‌చెల్లింపులే ప్రత్యామ్నాయం ఉంది. కాని డిజిటల్‌ ‌చెల్లింపులకు చాలా పరిమితులున్నాయి.

ప్రాణాలతో చెలగాటం-బతుకు పోరాటం
లాక్‌డౌన్‌తో లక్షలాది బతుకులు రోడ్డున పడ్డాయి. పనులు లేక వలస కార్మికులు, ఉపాధి కూలీలు, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు పిల్లా పాప, పెట్టే బేడ సర్దుకుని సొంత ఊళ్ళకు కాలి నడకన వెళుతున్న దృశ్యాలు మీడియాలో చూస్తున్నాం. లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం ప్రకటించిన వెంటనే హైదరాబాద్‌ ‌నుంచి పదుల సంఖ్యలో క్యూ కట్టారు. వెంటనే ప్రభుత్వం అప్రమత్తం అయి వారందరిని అడ్డుకుని ఖర్చులకు డబ్బులు, నిత్యవసరాలు అందించటంతో వారందరు వెనక్కి మళ్లారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో అయితే వేల సంఖ్యలో సొంత ఊర్లకు వెళ్లటానికి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఇటువంటి ఒక సంఘటన వైరస్‌ ‌చాలా విజృంభించటానికి. కమ్యూనిటీ స్ప్రెడ్‌ అనే ప్రమాదంలోకి వెళ్ళటానికి. చికిత్స కోసం హాస్పటల్‌కు వెళితే పరీక్షించటానికి వైద్యులు దొరకని దుస్థితి, ప్రాణాలకు భరోసా లేని భయానక వాతావరణం, ఏం ముట్టుకుంటే వైరస్‌ ఎటు నుంచి దాడి చేస్తుందో అన్న ఆందోళన బారిన పడకుండా ఉండాలంటే …ఇదే సరైన సమయం. వైరస్‌ను అడ్డుకోవటానికి ఇళ్ళకే పరిమితం కావడం ముఖ్యం. ప్రభుత్వాలు లాక్‌ ‌డౌన్‌ ‌విధించటం వెనుక ఉన్న తీవ్రతను మనం గుర్తించాలి. అలా అయితేనే మన ప్రాణాలను మనం కాపాడుకోగలుగుతాం.

Leave a Reply