ఇటీవల జమ్మూ కాశ్మీర్లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో లిథియం నిల్వలను గుర్తించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా లక్షల కోట్ల విలువైన లిథియం గురించి తెలుసుకుందాం.
500 పీపీఎం నాణ్యత
సాధారణ లిథియం నాణ్యత 220 పీపీఎం (పార్టస్ పర్ మిలియన్) ఉంటుంది. కానీ కాశ్మీర్‌లో కనుగొన్న లిథియం నాణ్యత ఏకంగా 500 పీపీఎంగా ఉండటం విశేషం.తెల్ల బంగారంగా పిలిచే లిథియం అనే పదం గ్రీక్ భాషలోని లిథోస్ (రాయి) నుంచి పుట్టింది. ఇది మెటల్ గ్రూప్‌కు చెందినది. తేలికగా, మృదువుగా, తెల్లటి వెండిలాగా మెరిసే లోహం.లితాజా నిల్వలతో 5వ స్థానానికి ఎగబాకిన భారత్ తాజాగా కశ్మీర్‌లో బయట పడ్డ 59 లక్షల టన్నులతో కలిపితే ప్రపంచంలో భారత్ ఐదో స్థానంలో నిలుస్తోంది. అమెరికాలో కంటే భారత్‌లోనే అధిక లిథియం నిల్వలున్నాయి.
లిథియంతో అనేక ఉపయోగాలు
ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా వైద్య రంగంలోనూ లిథియం ఖనిజాన్ని ఉపయోగిస్తున్నారు. ఫోన్ బ్యాటరీలు, సోలార్ ప్యానెళ్లు ఇతర పునరుత్పాదక సాంకేతికతల్లోనూ లిథియాన్ని వాడుతున్నారు. గ్లాస్ లు, సిరామిక్స్‌ను దృఢంగా రూపొందించడానికి, ఉష్ణోగ్రత మార్పులకు తట్టుకోవడానికి వీలుగా లిథియాన్ని కలుపుతారు. వేడిని తట్టుకునే గ్రీజ్‌లు, లూబ్రికెంట్లలోనూ ఈ ఖనిజాన్ని ఉపయోగిస్తారు. విమాన పరికరాలను తక్కువ బరువుతో తయారు చేయడం కోసం అల్యూమినియం, రాగితో లిథియం కలిపి ఉపయోగిస్తారు. అణ్వాయుధాల తయారీలోనూ లిథియం ఐసోటోప్‌ల ను ఉపయోగిస్తారు.
లిథియం అయాన్ బ్యాటరీలు
చాలా ఎలక్ట్రానిక్ వస్తువుల్లో లిథియం అయాన్ బ్యాటరీలను వాడుతున్నారు. ఇది ప్రపంచాన్ని క్లీన్ ఎనర్జీ వైపు నడిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అన్ని బ్యాటరీల్లో లిథియం బ్యాటరీలు శక్తివంతమైనవి. ప్రస్తుతం మొబైళ్లలో, ఎలక్ట్రిక్ వాహానాల్లో లిథియం అయాన్ బ్యాటరీని విరివిగా వాడుతున్నాం. లిథియం-అయాన్ బ్యాటరీపై చేసిన కృషికి స్టాన్లీ విట్టింగ్‌హామ్, జాన్ గూడెనఫ్ మరియు అకిరా యోషినోలకు 2019 సంవత్సరపు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
నక్షత్ర పేలుళ్ళ నుంచి లిథియం పుట్టుక
మిగతా ఖనిజాల మాదిరిగా లిథియం భూమ్మీద సహజంగా ఏర్పడదు. ప్రకాశవంతమైన నక్షత్ర పేలుడు నుంచి ఈ అంతరిక్ష మూలకం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బిగ్ బ్యాంగ్ కారణంగా విశ్వం ఆవిర్భవించిన తొలి నాళ్లలో కొద్ది మొత్తంలో లిథియం ఏర్పడిందని నాసా నిధులు సమకూర్చిన ఓ అధ్యయనం గుర్తించింది. నక్షత్ర పేలుడుకు కారణమైన న్యూక్లియర్ రియాక్షన్లలో లిథియం తయారై గెలాక్సీ మొత్తం వ్యాపించిందని భావిస్తారు.
లిలిథియం తవ్వకాలతో పర్యావరణానికి హానికరం
లిథియం తవ్వకాలను చేయడం వలన పర్యావరణానికి చాల ముప్పు పొంచివుంది. లిథియం తవ్వకాలను జరపడం వలన కాలుష్యం ఎక్కువగా ఏర్పడుతుందని, ప్రకృతిపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. నీటి నిల్వలు అనేవి ఈ లిథియం తవ్వకాలు చేపట్టిన ప్రాంతాలలో అంతరించి పోతాయని హెచ్చరిస్తున్నారు.లక్షల కోట్ల విలువైన లిథియం నిల్వలను కనుగొనడం వల్ల భవిష్యత్తులో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించి అగ్రదేశాలకు సరసన చేరుటకు అవకాశం ఏర్పడుతుంది.పర్యావరణానికి హానికాని రీతిలో లిథియం నిల్వల తవ్వకాలను చేస్తారని ఆశిద్దాం.
– పిన్నింటి బాలాజీ రావు
భౌతిక రసాయన శాస్త్రం ఉపాధ్యాయుడు
హనుమకొండ.9866776286