Take a fresh look at your lifestyle.

ఎన్నో సవాళ్లను భారత్‌ అధిగమించింది

ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణలో భారత్‌ది కీలక పాత్ర గ్లోబల్‌ ‌వీక్‌ ‌సదస్సులో ప్రధాని మోదీ

కొరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం గట్టెక్కడంలో భారత్‌ ‌కీలక పాత్ర పోషించబోతోందని ప్రధాని మోదీ అన్నారు. ఇటువంటి ఎన్నో సవాళ్లను భారత్‌ ఇం‌తకుముందు అధిగమించిందని చెప్పారు. బ్రిటన్‌ ‌వేదికగా నిర్వహించిన ’ఇండియా గ్లోబల్‌ ‌వీక్‌-2020’ ‌సదస్సులో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆర్థిక పునరుద్ధరణ గురించే మాట్లాడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణలో భారత్‌ ‌ముఖ్యపాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు. గతంలో భారత్‌ అనేక సామాజిక, ఆర్థిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొందని గుర్తుచేశారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొరోనా మహమ్మారిపై భారత్‌ ‌పోరాడుతూనే..ఓ వైపు ప్రజారోగ్యం, మరోవైపు ఆర్థిక పునరుద్ధరణ వంటి అంశాలపై దృష్టి సారించిందని చెప్పారు. ఇప్పటికే దేశంలో ఆర్థికంగా సానుకూలతలు నెలకొన్నాయని తెలిపారు. కొరోనా మహమ్మారి కారణంగా ప్రపంచానికి భారత్‌ ‌ఫార్మా రంగం సత్తా తెలిసిందని ప్రధాని మోదీ అన్నారు.

విపత్తు వేళ భారత ఫార్మా రంగం దేశానికే కాదు.. ప్రపంచానికి సైతం ఒక ఆస్తిగా మారిందన్నారు. ఔషధాల ధరలు తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది అక్కరకు వచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంలో భారత పాత్రం చాలా ప్రముఖమైందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశానికి చెందిన టెకీలు కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచానికి మార్గం చూపిస్తూనే ఉన్నారని, అలాంటి వారిని ఎవరు, ఎలా మరిచిపోగలరని ప్రశంసించారు. భారత్‌ ‌విజ్ఞానానికి అధికార కేంద్రమని, తమ విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచేందుకు సదా సిద్ధంగానే ఉందని ఆయన ప్రకటించారు. భారతీయలు సహజ సంస్కర్తలని, సాంఘికంగా గానీ, ఆర్థికంగా గానీ వచ్చే సవాళ్లను అధిగమించిన చరిత్ర తమకుందని ఆయన ప్రకటించారు. భారత్‌ ఓ ‌పక్క కొరోనా మహమ్మారితో పోరాడుతూనే… మరోపక్క ప్రజల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడుతోందని, ఆరోగ్యం, ఆర్థికం రెండింటీపై ఫోకస్‌ ‌పెట్టామని మోదీ తెలిపారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రపంచ దిగ్గజ సంస్థలను ఈ సందర్భంగా ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టేవారికి తాము రెడ్‌ ‌కార్పెట్‌ ‌పరుస్తున్నామని చెప్పారు.

Leave a Reply