Take a fresh look at your lifestyle.

గ్లోబల్‌ ‌మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌హబ్‌గా భారత్‌

ప్రజలు కేంద్రంగా అభివృద్ధి విధానం అమలుపై దృష్టి
కొరోనా, ఉక్రెయిన్‌ ‌యుద్ధంతో సరఫరా వ్యవస్థకు దెబ్బ
సరఫరా వ్యవస్థల ద్వారా దేశాల మధ్య అనుసంధానం
ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోడీ ఉద్ఘాటన
వొచ్చే ఏడాది సదస్సుకు సహకరిస్తామన్న జిన్‌పింగ్‌
‌మోడీ, జిన్‌పింగ్‌ల పరస్పర అభినందనలు

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 16 : ‌మెరుగైన సరఫరా ద్వారా దేశాల మధ్య అనుసంధానతను సాధించ వొచ్చని ఎస్‌సిఒ సభ్య దేశాలకు ప్రధాని మోడీ సూచించారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో 22వ షాంఘై సహకార సదస్సు ఎస్‌సిఒలో శుక్రవారం మోడీ సభ్యదేశాలనుద్దేశించి ప్రసంగించారు. కొరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌ ‌యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ సరఫరా గొలుసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం సంక్షోభం ఏర్పడిందని అన్నారు. ఈ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు సభ్యదేశాలు అనుసంధానతను సాధించేందుకు మెరుగైన సరఫరా కలిగి ఉండాలని సూచించారు. సభ్య దేశాల మధ్య సహకారానికి, పరస్పర విశ్వాసానికి భారత్‌ ‌మద్దతునిస్తుందని అన్నారు. ఆహార భద్రతకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయంగా, చౌకగా లభించే చిరుధాన్యాలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు భారత్‌ ‌కృషి చేస్తోందని అన్నారు. సాంప్రదాయక వైద్యంలో కూడా సభ్య దేశాలు సహకరించాలని కోరారు. ప్రజాభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న వినియోగంపై దృష్టి సారించామని, ఎస్‌సిఒ దేశాలకు సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.5 శాతానికి చేరుకుంటుందని అంచనావేస్తున్నామని, ప్రపంచ ఆర్థికవ్యవస్థలలో ప్రధానంగా నిలుస్తుం దని అన్నారు. ప్రజల కేంద్రంగా అభివృద్ధి విధానాన్ని అమలు చేయడంపై తాము దృష్టి పెట్టామని తెలిపారు. ప్రతి రంగంలోనూ సృజనాత్మకత, నవకల్పనలకు మద్దతిస్తున్నామని, సహకరిస్తు న్నామని చెప్పారు. భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చేదిశగా కృషి చేస్తున్నామని, ప్రతిరంగంలో ఆవిష్కరణకు మద్దతు ఇస్తున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో 70వేల కంటే అధిక స్టార్టప్‌లు, 100యునికార్న్‌లు ఉన్నాయని అన్నారు.

ప్రపంచంలో షాంఘై సహకార సంఘం పాత్ర ప్రాధాన్యం పెరుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశాల మధ్య సహకారం మరింత పెరగవలసిన అవసరం ఉందని తెలిపారు. భారత దేశాన్ని గ్లోబల్‌ ‌మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌హబ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. నేడు ప్రపంచం కోవిడ్‌-19 ‌మహమ్మారిని అధిగమిస్తోందని, ఈ సమయంలో ఎస్‌సీఓ పాత్ర చాలా ముఖ్యమైనదని తెలిపారు. ఎస్‌సీఓ సభ్య దేశాల్లో ప్రపంచ జనాభాలో 40 శాతం నివసిస్తోం దన్నారు. ప్రపంచ జీడీపీలో 30 శాతం వాటా ఈ దేశాలదేనని చెప్పారు. ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య సహకారాన్ని భారత్‌ ‌సమర్థిస్తుందన్నారు. కోవిడ్‌-19 ‌మహమ్మారి, ఉక్రెయిన్‌ ‌యుద్ధం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనివల్ల ప్రపంచం మునుపెన్నడూ లేని స్థాయిలో ఇంధనం, ఆహార సంక్షోభాలను ఎదుర్కొంటోందని చెప్పారు. వైవిద్ధ్యభరితమైన సరఫరా వ్యవస్థలను ఎస్‌సీఓ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దీని కోసం మెరుగైన అనుసంధానం మాత్రమే చాలదని, మెరుగైన రవాణా సదుపాయాలు అవసరమని చెప్పారు. ప్రజల కేంద్రంగా అభివృద్ధి విధాన్ని అమలు చేయడంపై తాము దృష్టిపెట్టామని తెలిపారు. ప్రతి రంగంలోనూ సృజనాత్మకత, నవకల్పనలకు మద్దతిస్తున్నామని, సహకరిస్తున్నామని చెప్పారు. నేటికి భారత దేశంలో 100కుపైగా యూనికార్న్‌లు, 70,000కుపైగా స్టార్టప్‌ ‌కంపెనీలు ఉన్నాయని చెప్పారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ ‌బాగ్చి ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఎస్‌సీఓ సభ్య దేశాల అధినేతలతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు.

అంశాలవారీగా, ప్రాంతీయ, జాతీయ సమస్యలపై ఈ చర్చలు జరిగాయి. ప్రాంతీయ శాంతి, భద్రతలు, వ్యాపారం, వాణిజ్యం, అనుసంధానం, సంస్కృతి, పర్యాటక రంగాలపై చర్చలు జరిగాయి. 28 నెలల క్రితం తూర్పు లడఖ్‌లో భారత్‌-‌చైనా మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, ‌ప్రధాని మోదీ కలుసుకోవడం ఇదే మొదటిసారి. అయితే వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతుందో, లేదో ఇంకా స్పష్టత రాలేదు. ఫొటో సెషన్‌లో వీరిద్దరూ పక్కపక్కనే నిల్చుని, ఎస్‌సీఓ దేశాల నేతలతో కలిసి గ్రూప్‌ ‌ఫొటో దిగారు. ఈ విధంగా నిల్చోవడాన్ని కాంగ్రెస్‌ ‌గట్టిగా ప్రశ్నించింది. ఇదిలావుంటే వచ్చే ఏడాది షాంఘై సహకార సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ ‌నిర్వహించనున్న సదస్సుకు చైనా సహకారం అందిస్తుందని అన్నారు. ఉజ్బెకిస్థాన్‌లోని చారిత్రాత్మక నగరమైన సమర్‌కండ్‌లో నిర్వహిస్తున్న సదస్సులో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ‌లు ముఖాముఖీ కలుసుకున్నారు. 2020లో లఢఖ్‌లో ఇరు దేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రారంభమైన అనంతరం ఇరుదేశాధినేతలు ఎదురుపడటం ఇదే మొదటిసారి. ఈ సదస్సులో ప్రధాని మోడీ, జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం ఉండనుందని వార్తలు వచ్చాయి. అయితే ప్రధాని కార్యాలయం ఈ వార్తలను తిరస్కరించనూలేదు, సమర్థించలేదు. ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశాల షెడ్యూల్‌ ‌పూర్తయిన అనంతరం తెలియజేస్తామని విదేశాంగ కార్యదర్శి వినరు క్వాత్రా పేర్కొన్నారు. చైనా కూడా ఇరు నేతల మధ్య భేటీని ధృవీకరించలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌, ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడు షావ్కత్‌ ‌మిర్జియోవ్‌, ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీలతో సమావేశం కానున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

Leave a Reply