Take a fresh look at your lifestyle.

కేంద్ర విద్యుత్‌ ‌సవరణ బిల్లు రైతన్నల పాలిట శాపం : మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న విద్యుత్‌ ‌సవరణ బిల్లు 2020 తెలంగాణ రైతులకు, సామాన్య ప్రజల పాలిట శాపంగా మారనుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ‌కృషి చేస్తుంటే ఉచిత విద్యుత్‌కు కోత పెట్టే విధంగా కేంద్రం వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖాశ్యాంనాయక్‌, ‌రాథోడ్‌ ‌బాపూరావుతో కలసి ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర తీసుకురానున్న కొత్త బిల్లు వల్ల రైతన్నలపై పెనుభారం పడనుందన్నారు. దీన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఏకీకృత విధానాల వల్ల వ్యవసాయ విద్యుత్‌ ‌కనెక్షన్లకు మీటర్లు బిల్లులు మళ్లీ పుట్టుకొస్తాయన్నారు.

దీంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారనీ,
ఒక్కో రైతు నెలకు రూ. 3 వేల నుంచి 4 వేల దాకా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ అం‌దిస్తుంటే తెలంగాణకు అండగా నిలవాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రైతులకు మొదటి విడతగా, రూ. 25 వేల రుణాని మాఫీ చేసిన సీఎం కేసీఆర్‌ ‌రైతు బాంధవుడని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం దేశానికే తలమానికంగా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 6 లక్షల మంది రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 1200 కోట్లు విడుదల చేసినందుకు ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply