Take a fresh look at your lifestyle.

పాత్రికేయంలో చెరగని ముద్ర ‘‘చక్రవర్తుల’’

“సంప్రదాయ కుటుంబంలో పుట్టినా కట్టుబాట్లను కాదనుకుని, కమ్యూనిస్టు భావజాలం వైపు ప్రయాణించి, పత్రికా రంగంలో వేలాది మందికి ఆదర్శప్రాయంగా నిలిచిన అక్షర ఋషి ఆయన. ఆయన జీవితకాలంలో ఎవరి పైనా ఆగ్రహం వ్యక్తం చేయడం, కేకలు వేయడం, నిష్ఠూరంగా మాట్లాడటం, ద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం, చెడుగా మాట్లాడటం కానీ ఎవరూ కనీవినీ ఎరుగరు. ఛాందస భావాలకు దూరం. అయినా సనాతన ధర్మం సాహిత్యం పై విపరీతమైన అభిమానం, పూర్తి కమ్యూనిస్టు అయినా, విశ్వనాథ అన్నా, ఆయనకు సాహిత్యమన్నా వల్లమాలిన అభిమానం, అభిరుచి ఉండేది.”

పాత్రికేయ పితామహుడు, భాషాకోవిధుడు, మార్క్సిస్టు మేధావి విశేష అనుభవజ్ఞ సంపాదకుడు చక్రవర్తుల రాఘవాచారి. సమకాలీన పరిణామాలపై అద్భుత విశ్లేషణ చేయగలిగిన గొప్ప మేధావి. నిబద్ధత కలిగిన పాత్రికేయులు, యావత్‌ ‌జర్నలిస్ట్ ‌సమాజానికి ఆదర్శప్రాయుడు  రాఘవాచారి. 1939 సెప్టెంబరు 10వ తేదీన వరంగల్లు జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో జన్మించిన రాఘవాచారి 81వ జయంతి నేడు.  వృత్తిలో, ప్రవృత్తిలోనూ సిద్ధాంతకర్తగా నిలిచి దాదాపు అర్ధ శతాబ్దం పాటు చైతన్యం రగిలించి ఎందరిలోనూ స్ఫూర్తి నింపిన సంపాద కుడాయన.  చక్రవర్తుల రాఘవాచారి భావజాలానికి ఎవరైనా శిరస్సు వంచాల్సిందే అన్నట్టుగా ఆయన జీవనం సాగింది. నిబద్ధ, విశ్లేషణాత్మక జర్నలిజం ఆయన నైజం. పత్రికా రచనలో అన్నికాలాల్లో తానే మేటిగా వెలుగొందారు. తెలుగు పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలు ఆయన్ను చిరంజీవిని చేసాయి.
1968 – 1972 కాలంలో సంపాదకుడు వేములపల్లి శ్రీకృష్ణ నుంచీ 1972 లో రాఘవాచారి సంపాదకత్వం స్వీకరించి మూడు దశాబ్దాలు నిర్విఘ్నంగా కొనసాగి ఎనలేని కీర్తి గడించారు. విశాలాంధ్ర ఇంటిపేరుగా చేసుకున్న సంపాదకుడాయన. చక్రవర్తుల రాఘవాచారిగా కంటే విశాలాంధ్ర రాఘావాచారిగానే పాఠకలోకానికి ఎక్కువ పరిచితులాయన.   తెలుగు పాఠకుడు మరచిపోని  పాత్రికేయుడాయన. ఉస్మానియాలో ‘లా కోర్సు’ చదివి, ఎల్‌.ఎల్‌.ఎం. ‌కూడా పూర్తి చేశారు.  ధర్మ శాస్త్రాధ్యయనం ’’జూరిస్‌ ‌ప్రుడెన్స్’’ అం‌టే విపరీతమైన అభిమానం. ఇది చాలా కష్టమైన పాఠ్యాంశమైనా పట్టుదలగా దానినే ఎంచుకొని 1964లో ఉత్తీర్ణులయ్యారు. న్యాయకళాశాల సహవిద్యార్ధులమాదిరి న్యాయవాద వృత్తి స్వీకరించకుండా జర్నలిజంపై దృష్టి సారించారు. భారత రాజ్యాంగం, ఇతర దేశాల రాజ్యాంగాలను తులనాత్మకంగా పరిశీలింఛి విషయాలను కరతలామలకం చేసుకొన్నారు.

విషయాలన్నీ ఆయన మునివేళ్లపై నర్తించేవి. రాఘవాచారికి కృష్ణా, గుంటూరు జిల్లాలతో సన్నిహిత అనుబంధం ఉంది. 33ఏళ్ల సుదీర్ఘకాలం విశాలాంధ్ర సంపాదకులుగా పనిచేసిన ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన ఎదురులేని పాత్రికేయుడే కాదు, అంతకు మించిన గొప్ప వక్త కూడా. ఆయన సభ ఉందంటే ప్రత్యేకంగా హాజరయ్యే వారి సంఖ్య ప్రత్యేకంగా ఉండేది. ఏ విషయం మీద, ఏ సందర్భంలో మాట్లాడినా అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా, చమత్కారంగా ప్రసంగించడం ఆయన ప్రత్యేకత. ఆధ్యాత్మిక సభలకు వెళ్లినా ఎక్కడా తన విశ్వాసాలు, సిద్ధాంతాలనుంచి పక్కకు తొలిగేవారూ కారు. అదే సమయంలో ఆ భావాలు ఉన్నవారిని నొప్పించేవారూ కారు, కానీ తాను చెప్పదలచిన విషయాన్ని చురుక్కుమనేలా అంటించేవారు. 1992 నవంబర్‌ 14, 15‌న గుంటూరులో జరిగిన అరసం 11వ రాష్ట్ర మహాసభలో ప్రారంభోపన్యాసకులుగా శ్రోతలను ఆకట్టుకున్నారు. అదే విధంగా తుమ్మల వెంకట్రామయ్య జయంతి సభలో అప్పట్లో ఆయన ప్రసంగం అందరినీ ఆకర్షించింది. ప్రజానాట్య మండలి నేత కందిమళ్ల ప్రతాపరెడ్డితో కలిసి అనేక సభల్లో ప్రసంగించారు. గుంటూరులో జరిగిన న్యాయవాదుల సంఘం వార్షికోత్సవ సభలో ముఖ్యఅతిథిగా ప్రసంగించి, న్యాయవాదుల్లో నూతనోత్సాహం నింపారు.  ఆయన సంపాదకీయాలపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. విలువలు నిలబెట్టుకోవడంలో, నైతికత కాపాడుకోవడంలో  ఆయన ఎప్పుడూ, ఎక్కడా రాజీ పడలేదు.

ఏటా విజయవాడ, హైదరాబాద్‌ ‌నగరాల్లో నిర్వహించే పుస్తక మహోత్సవాల్లో ఆయన ప్రతీరోజు కనిపించేవారు. అన్ని స్టాళ్లనూ సందర్శించి పుస్తక విక్రేతలను, పాఠకులనూ ప్రోత్సహించేవారు. సాహితీ మిత్రులను, పాత్రికేయులనూ పలకరిస్తూ వ్యాహ్యాళిగా తిరిగేవారు. సంప్రదాయ కుటుంబంలో పుట్టినా కట్టుబాట్లను కాదనుకుని, కమ్యూనిస్టు భావజాలం వైపు ప్రయాణించి, పత్రికా రంగంలో వేలాది మందికి ఆదర్శప్రాయంగా నిలిచిన అక్షర ఋషి ఆయన. ఆయన జీవితకాలంలో ఎవరి పైనా ఆగ్రహం వ్యక్తం చేయడం, కేకలు వేయడం, నిష్ఠూరంగా మాట్లాడటం, ద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం, చెడుగా మాట్లాడటం కానీ ఎవరూ కనీవినీ ఎరుగరు.  ఛాందస భావాలకు దూరం. అయినా సనాతన ధర్మం సాహిత్యం పై విపరీతమైన అభిమానం, పూర్తి కమ్యూనిస్టు అయినా, విశ్వనాథ అన్నా, ఆయనకు సాహిత్యమన్నా వల్లమాలిన అభిమానం, అభిరుచి ఉండేది.

విద్యార్థిదశ నుంచి వామపక్ష భావజాలంలో ఉన్న ఆయన.. ఏఐఎస్‌ఎఫ్లో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ ‌కమిషన్‌ ‌చైర్మన్గా, సీపీఐ జాతీయ కంట్రోల్‌ ‌కమిషన్‌ ‌సభ్యులుగా పనిచేశారు. ఉస్మానియా, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో జర్నలిజం విజిటింగ్‌ ‌ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహించారు. 2009లో కమ్యూనిస్టు రచయిత బొల్లిమంత శివరామకృష్ణ సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌ 28‌న అనారోగ్యంతో హైదరాబాద్‌ ‌లోని ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌ ‌లో ఆయన తుది శ్వాస విడిచారు. ఆ కలం ఆగిపోయినా, ఆ గళం మూగవోయినా, ఆ నిండైన విగ్రహం కనుమరుగైనా, నవ్వుల మోము మాయమైనా ఆరూపం పాత్రికేయుల మనోఫలకంపై చిరస్థాయిగా నిలిచిపోయారు.
– నందిరాజు రాధాకృష్ణ.

Leave a Reply