Take a fresh look at your lifestyle.

పెరుగుతున్న గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు

గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తక్కువ వేతనం కోసం పనిచేసే పెరుగుతున్న కార్మిక జనాభా డిమాండ్‌ ‘‘‌పని కావాలి’’. వీరికి భారత ఆర్థిక వ్యవస్థ తగిన పని కల్పించటంలో విఫలం అవుతున్నది. ఈ పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థ వైఫల్యాన్ని తెలుపుతున్నది. గ్రామీణ భారతదేశం భద్రతా వలయం అయిన ఉపాధి హామీ పథకం అధిక డిమాండ్‌లో ఉంది అంటేనే ప్రమాద ఘంటికలు మోగుతునట్టు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది ఆందోళన కలిగించే అంశం.

  • డీమానిటైజేషన్‌ ‌తర్వాత పెరిగిన జాబ్‌ ‌కార్డుల సంఖ్య
  • కొరొనా తర్వాత పని కల్పించడంలో పూర్తిగా విఫలం
  • ఇంటికి 100 రోజుల ఉపాధి హామీ ఉన్నా 2020-21లో దొరికింది కేవలం 22 రోజుల పనే
  • కార్మికులు నగరాల నుంచి స్వస్థలాలకు వెళ్లడంతో పని కొరకు పెరిగిన డిమాండ్‌

భారత దేశ పట్టణ కార్మికులు అతి తక్కువ వేతనానికి పని చేయటానికి సిద్ధపడుతున్నారు. అయినా దేశ ఆర్థిక వ్యవస్థ దేశ కార్మికులకు కనీస పని కలిపించ లేక పోతున్నది. దేశంలో అత్యధిక కార్మికులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజిఎన్‌ఆర్‌ఇజిఏ) కింద పనిచేయటానికి ఎగబడుతున్నారు.  దేశ కార్మిక వర్గం ఎంత అధ్వాన్న పరిస్థితిలో ఉందో తెలిపే అంశం ఇది. తక్కువ వేతనంతో పనిచేసే కార్మికుల డిమాండ్‌..‘‌జీవించి ఉండేందుకు కనీస పని కావాలి’. ఈ డిమాండ్‌ను నెరవేర్చటంలో భారత ఆర్థిక వ్యవస్థ విఫలం అయిందన్నది మరో సారి స్పష్టంగా కనిపిస్తున్నది.

గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో ఆమోదించబడింది. గత 16 సంవత్సరాలుగా పాలసీ రూపకర్తలు, ఆర్థికవేత్తలు  రాజకీయ విశ్లేషకులు చట్టాన్ని రకరకాలుగా విశ్లేషించారు. కొంతమంది ఆర్థికవేత్తలు దీనిని ‘‘పేదలకు ఆదాయాన్ని బదిలీ చేసే అసమర్థమైన వ్యవస్థ’’ అని విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ చట్టాన్ని ‘‘కాంగ్రెస్‌ ‌పాలన వైఫల్యానికి సజీవ స్మారకం’’ అని విశ్లేషించారు. ఈ విమర్శలను, విశ్లేషణలను పక్కన పెడితే,  కేందప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రజలకి చేర్చేందుకు ఈ పథకం కోసం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద 2020-21 మరియు 2021-22 సంవత్సరాలలో  వివిధ పథకాలకు సంబంధించిన బడ్జెట్‌ అం‌చనాలతో 51% నుంచి 56% వరకు నిధులను అందుకుంటూ ఈ చట్టం కొనసాగుతున్నది.

ఈ చట్టం ముఖ్య లక్ష్యం గ్రామీణ భారతదేశానికి ఒక భద్రతా వలయం సృష్టించటం. ఈ చట్టం సంవత్సరంలో ప్రతి నమోదిత కుటుంబానికి 100 రోజుల ఉపాధిని అందిస్తానని వాగ్దానం చేస్తుంది.  ఈ చట్టం నైపుణ్యం లేని శారీరక పని కోసం సిద్ధపడిన కార్మికుడికి కనీస వేతనం చెల్లించే వర్క్ ‌ఫ్రేమ్‌ ‌పోగ్రామ్‌. ‌మరోరకంగా చెప్పాలంటే ఈ చట్టం పేద ప్రజలకు తక్కువ జీతంతో కూడిన పనిని అందించే స్వీయ-లక్ష్య ఆధారిత కార్యక్రమం. ఈ పథకం కింద, ఇళ్లకు జాబ్‌ ‌కార్డులు జారీ చేయబడతాయి. ఇంటిలోని ప్రతి వయోజన సభ్యుడు పనిని పొందవచ్చు. అనగా  అత్యంత ప్రాథమిక స్థాయిలో పని కోసం ఎగబడే కార్మిక వర్గం కోసం ఈ పథకం పనిచేస్తుంది.

ఈ పథకానికి సంబంధించిన అధికారిక డేటా ప్రకారం 2016-17లో జాబ్‌ ‌కార్డులలో 2.4 మిలియన్ల అభ్యర్థుల నికర క్షీణత ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే మరుసటి సంవత్సరం-నోట్ల రద్దు అనే ఆర్థిక షాక్‌ ‌తగిలిన తర్వాత 2017-18లో జాబ్‌ ‌కార్డులలో 1.8 మిలియన్లు జాబ్‌ ‌కార్డు అభ్యర్థులు పెరిగారు. మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై డీమోనిటైజేషన్‌ ‌చూపిన తీవ్ర ప్రభావం తరవాత ఈ పరిణామం జరిగిందనేది తెలిసిందే. ఆ తరువాత సంవత్సరంలో జాబ్‌ ‌కార్డుల పెరుగుదల ఆర్థిక సంక్షోభం పర్యవసానంగా చెప్పుకోవాలి. 2020-21 కొరోనా వైరస్‌ ‌మహమ్మారి సంవత్సరంలో, 14.97 మిలియన్ల జాబ్‌ ‌కార్డు హోల్డర్స్ ‌నికర పెరుగుదల కనిపించింది. రికార్డు స్థాయిలో 17.51 మిలియన్‌ ‌కొత్త జాబ్‌ ‌కార్డులు పథకానికికి జోడించబడ్డాయి. పర్యవసానంగా, మొత్తం 132 మిలియన్ల కుటుంబాలు 2020-21 సంవత్సరంలో జాబ్‌ ‌కార్డులను కలిగి ఉన్నాయి. అంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నప్పుడు మరింత ఎక్కువగా గ్రామీణ కుటుంబాలు గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనిని కోరుకున్నారు.

ఇటీవలి సంవత్సరాలలో ఈ పథకానికి సంబంధించిన డేటా ఇంకా కలతపెట్టే వివరాలను వెల్లడించింది. ఈ కార్యక్రమం కింద ఉద్యోగం కోరుకునే వారిలో 18-30 సంవత్సరాల వయస్సు గల యువకులు పెరిగారు. 2015-16 నుంచి 2018-19 మధ్య కాలంలో స్థిరమైన పెరుగుదల ఉన్నప్పటికీ, ఇది వాస్తవంగా పెరగటం అన్నది 2020-21లో ప్రారంభమైంది. 2019-20లో ఉపాధి హామీ పథకం కింద పని కోసం నమోదు చేసుకున్న 18-30 సంవత్సరాల వయస్సులో వారు 20% మంది నమోదయ్యారు. ఇది 2020-21 సంవత్సరానికి 37%కి పెరిగింది. 2020-21లో మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినందున యువ కార్మికులు కూడా తక్కువ వేతనాలకి పనిచేయటానికి ఉపాధఙ హామీ పనిపై ఆధారపడాల్సి వొచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. మహమ్మారి కాలంలో ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టకపోవడం వలన యువ శ్రామిక శక్తి అసమానంగా దెబ్బతిన్నదనేది స్పష్టం అవుతున్నది. భారత దేశంలో కార్మికుల కోసం సంక్షేమ నిర్మాణం చేసే వ్యవస్థగా, ఆర్థిక సంక్షోభం ప్రతికూల ప్రభావాలు కార్మికుల మీద పడినప్పుడు తీవ్రత తగ్గించే వ్యవస్థగా ఈ పథకం ప్రముఖ పాత్ర పోషించినప్పటికీ, గ్రామీణ పేదలకు తగినంత సహాయాన్ని అందించడంలో వైఫల్యాన్ని కూడా చవి చూసింది. ఈ అంశాన్ని  పరిశీలించాల్సి ఉంటుంది.

గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రతి ఇంటికి 100 రోజుల ఉపాధి కల్పిస్తామని వాగ్దానం చేస్తుంది. అయితే వాస్తవం మరోలా వుంది. 2020-21లో ప్రతి నమోదిత కుటుంబానికి సగటున పని కేవలం 22 రోజులు అందగా, నమోదిత వ్యక్తికి సగటున పని కేవలం 12 రోజులు మాత్రమే దొరికింది. 2020-21లో నమోదైన కుటుంబాలలో కేవలం 4.1% మాత్రమే 100 రోజుల పనిని అందుకున్నాయి. దారుణమైన విషయం ఏమిటంటే…పై గణాంకాలు 2015-16 నుంచి 2020-21 మధ్య అత్యధిక పని అందిన గణాంకాలుగా నమోదయి ఉన్నాయి. కొరోనా మహమ్మారి వలస కార్మికులు అధిక సంఖ్యలో మహానగరాల నుంచి తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిపోవటం పర్యవసానంగా ఉపాధి హామీ జాబ్‌ ‌కార్డుల పెరుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ఉపాధి కల్పించటంలో ఈ చట్టం విఫలమయిందని గణాంకాలు చెబుతున్నాయి. 2020-21లో రివర్స్ ‌మైగ్రేషన్‌ని చూసిన యుపిలో, సంవత్సరానికి ఈ పథకం కింద నమోదిత ఇళ్లకు, వ్యక్తులకు సగటున కేవలం 18 రోజులు, 13 రోజులు పని దొరికింది. వీరికి 201 రూపాయిల చొప్పున రోజువారీ వేతనం అందింది. బీహార్‌లో నమోదు చేసుకున్న కుటుంబాలకు 11 రోజులు మరియు నమోదు చేసుకున్న వ్యక్తికి ఎనిమిది రోజులు పని, రోజువారీ వేతనం 194 రూపాయలు మాత్రమే అందాయి.

గ్రామీణ భారతదేశంలోని పేద కార్మికులకు ఈ పథకం ఆధారపడే ప్రముఖ భద్రతా వలయంగా కనిపిస్తున్నప్పటికీ, గ్రామీణ పేద కార్మికులకు అవసరమైన సహాయం అందించడంలో ఈ పథకం విఫలమయిందని స్పష్టమవుతున్నది. ఇక పట్టణ భారత దేశానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ఫ్రేమ్‌ ‌వర్క్ ‌గల పథకాల ఆవశ్యకత కూడా పెరిగిపోతున్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తక్కువ వేతనం కోసం పనిచేసే పెరుగుతున్న కార్మిక జనాభా డిమాండ్‌ ‘‘‌పని కావాలి’’. వీరికి భారత ఆర్థిక వ్యవస్థ తగిన పని కల్పించటంలో విఫలం అవుతున్నది. ఈ పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థ వైఫల్యాన్ని తెలుపుతున్నది. గ్రామీణ భారతదేశం భద్రతా వలయం అయిన ఉపాధి హామీ పథకం అధిక డిమాండ్‌లో ఉంది అంటేనే ప్రమాద ఘంటికలు మోగుతునట్టు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది ఆందోళన కలిగించే అంశం.

Leave a Reply